ఎన్టీఆర్ ….ఈ మాట లేకుండా తెలుగు చలనచిత్రరంగాన్ని గానీ రాజకీయాలను గానీ ఊహించలేం. ఆంధ్రులందరూ ఎంతో అభిమానంగా అన్నగారనీ ఎన్టీఆర్ అని పిలిచేవారు. ఆయన పూర్తి పేరు నందమూరి తారకరామారావు.
నాలుగు వందలకు పైగా చిత్రాలలో నటించిన ఎన్టీఆర్ 1923 మే 28 వ తేదీన కృష్ణా జిల్లా పామర్రు మండంలోని నిమ్మకూరు పల్లెలో లక్ష్మయ్య చౌదరి, వెంకట రామమ్మ దంపతులకు జన్మించారు. మేనమామ సూచన మేరకే ఆయనకు తారకకామారావు అని నామకరణం చేశారు. ఆయన తన 73వ ఏట గుండెపోటుతో 1996 జనవరి 18వ తేదీన కన్ను మూశారు.
అక్షరాలా బహుముఖ ప్రజ్ఞాశాలి అయిన ఎన్టీఆర్ నిజంగానే విశ్వవిఖ్యాత నటసార్వభౌముడు.
కొన్ని చిత్రాలు నిర్మించడమే కాకుండా దర్శకత్వం కూడా వహించిన ఆయన పోషించిన ప్రతి పాత్ర వైవిధ్యభరితమైనదే. రాముడు, కృష్ణుడు తదితర పౌరాణిక పాత్రలను మనమెవరం చూడలేదు. కేవలం పుస్తకాలలో ఉన్న ఆయా పాత్రల రూపురేఖలను ఊహించుకోవడమే. అయితే ఎన్టీఆర్ పోషించిన ఈ పాత్రలను చూస్తే కృష్ణుడు, రాముడు అంటే ఇలానే ఉన్నారేమో అనిపించకమానదు. ప్రతి తెలుగు వాడే కాదు, దక్షిణ భారత రాష్ట్రాల వారు కూడా ఆయనను అలాగే భావించారు.
నాలుగు దశాబ్దాలకుపైగా ఆయన సినీ ప్రస్థానం సాగింది. దాదాపు నాలుగు వందల చిత్రాలలో నటించిన ఆయనకు మీసాల నాగమ్మ అనే పేరెలా వచ్చిందో చూద్దాం…..
విజయవాడలో కొంతకాలం చదువుకున్న రామారావుతో విశ్వనాథ సత్యనారాయణ గారు ఓమారు ఓ నాటకంలో స్త్రీపాత్ర వేయమని మీసాలు తీయమని అడిగారు. కానీ ఎన్టీఆర్ అందుకు అంగీకరించక మీసాలతోనే ఆ పాత్ర పోషించారు. దాంతో ఆయనను అందరూ మీసాల నాగమ్మ అని పిలవసాగారు.
తన ఇరవయ్యో ఏట బసవతారకాన్ని పెళ్ళి చేసుకున్న ఎన్టీఆర్ కొంతకాలం గుంటూరులోనూ చదువుకున్నారు. అక్కడ చదువుకుంటున్న రోజుల్లో కొంగర జగ్గయ్య వంటి వారితో నాటకాలలో నటించిన ఎన్టీఆర్ కు మొత్తం పదకొండు మంది పిల్లలు. వారిలో కుమారులు ఏడుగురు. కుమార్తెలు నలుగురు.
దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన 1947లో ఆయన డిగ్రీ పుచ్చుకున్నారు.
అనంతరం కొంతకాలం సబ్ రిజిస్ట్రారుగా పని చేసిన ఆయన నటించిన తొలి సినిమా పేరు – మనదేశం. ఈ చిత్రంలో ఆయన పోలీస్ ఇన్ స్పెక్టర్ పాత్ర పోషించారు.
పాతాళభైరవి, మల్లీశ్వరి తదితర చిత్రాలు ఆయనకు విశేషమైన పేరుప్రఖ్యాతులు తెచ్చిపెట్టాయి. విజయా వారి సంస్థలో ఆయనకు నెల జీతం అయిదు వందలు. ఆ సంస్థ తరఫున ఆయన అనేక చిత్రాలలో నటించారు. ఆయన నటించిన పౌరాణిక చిత్రాలలో లవకుశ అన్ని విధాల విజయవంతమైంది.
ఇక ఆయన దర్శకత్వంలో వచ్చిన తొలి సినిమా – సీతారామ కళ్యాణం. ఇది 1961లో వచ్చింది.
క్రమశిక్షణకు మారుపేరైన ఎన్టీఆర్ వెంపటి చినసత్యంగారి దగ్గర కొంతకాలం కూచిపూడి నృత్యం కూడా నేర్చుకున్నారు.
1982లో తెలుగుదేశంపేరుతో పార్టీని ప్రారంభించి రాజకీయ రంగప్రవేశం చేసిన ఆయన తొమ్మిది నెలల్లోనే అప్పటి వరకూ అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీని చావు దెబ్బ తీసి అధికారంలోకి వచ్చి ఆంధ్ర రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయి చరిత్ర సృష్టించారు. చైతన్యరథంతో ప్రజలకు చేరువైన ఆయన చేసిన ప్రసంగాలు ప్రజలను ఎంతగానో ప్రభావితం చేసాయి. రెండు రూపాయలకే కిలో బియ్యం, సంపూర్ణ మద్యనిషేధం వంటి హామీలతో ప్రజల దృష్టిని ఆకట్టుకున్న ఆయన రాజకీయ జీవితం ఎంతో ఆశక్తికరంగా సాగింది.
ఆయన చేసిన సేవలను గుర్తించిన కేంద్ర ప్రభుత్వం ఎన్టీఆర్ పేరిట ఓ పోస్టల్ స్టాంప్ కూడా ముద్రించింది.
ఎన్నో అవార్జులు రివార్డులు అందుకున్న ఆయన పేరిట అప్పటి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 1996లో ఎన్టీఆర్ జాతీయ పురస్కారాన్ని నెలకొల్పింది. ఈ పురస్కారాన్ని కొంతకాలం కొనసాగించారు.
తెలుగుజాతికీ, తెలుగుభాషకూ దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చిన వ్యక్తి ఎన్టీఆర్ నక్సలైట్లను దేశభక్తులుగా అభివర్ణించడం అప్పట్లో సంచలనం సృష్టించింది. మదరాసులో ఆయన వుండగా తిరుపతి వెళ్ళిన తెలుగు యాత్రీకులు మొక్కుబడిగా మదరాసు వెళ్ళి ఆయనను దర్శించుకుని వచ్చేవారు.
పదహారు సినిమాలకు దర్శకత్వం వహించిన ఆయన నిర్మాతగా ఎనిమిది సినిమాలు నిర్మించారు. అవి, సామ్రాట్ అశోక్. శ్రీనాథ కవిసార్వభౌమ. దానవీరశూరకర్ణ. శ్రీమద్విరాటప్రవం, శ్రీ తిరుపతి వేంకటేశ్వర కల్యాణం. చండశాసనుడు. శ్రీమద్విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి చరిత్ర. బ్రహ్మర్షి విశ్వామిత్ర.