నన్నేం చేస్తావు ...?

నీ చేతిలో
నేను ఒక వేణువును

వాయించి చూడు
అందులోంచి వినిపిస్తుంది
ప్రేమ రాగం

మరి వేణువును
వాయిస్తావా?
లేక
ముక్కలు చేస్తావా?

నే చేతిలో
నేనొక ఉత్తరాన్ని

చదివి చూడు
అర్ధమవుతుంది నా ప్రేమ

ఉత్తరాన్ని
చదువుతావా?
లేక
ముక్కలు చేసి విసిరేస్తావా?

నీ చేతిలో
నేనొక అద్దాన్ని

అందులో
తదేకంగా చూడు
నా మోము కనిపిస్తుంది

అద్దాన్ని
చూస్తావా?
లేక
ముక్కలు చేస్తావా?

నీ చేతిలో
నేనొక రూపాయి నోటుని

బాగా చూడు
నా విలువేంటో తెలుస్తుంది

రూపాయి నోటును
దాస్తావా?
లేక
ఖర్చు చేస్తావా?

నీ చేతిలో
నేనొక తెల్ల కాగితాన్ని

నువ్వు రాయాలనుకున్నది
నా ప్రేమకు
ముందు మాటా?
లేక
ముగింపు మాటా?

నీ చేతిలో
నేనొక రాయిని

దానిని
ఎలా ఉపయోగిస్తావు?

ప్రేమ సౌధానికి సోపానాలుగానా?
లేక
నా మీదకే విసురుతావా?

నేను
నీ వైపే వస్తున్నాను

నువ్వు
నన్ను స్వీకరిస్తావా?
లేక
స్వీకరించవా?
అది నీ ఇష్టం….

నన్ను
ఎన్ని రకాలుగా
నీ ముందు ఉంచాలో
అన్ని రకాలుగా
నీ ముందు ఉంచాను
కనుక
నువ్వేం చేస్తావో నీ ఇష్టం