నమ్మకం

(నమ్మకం+అమ్మకం = అపనమ్మకం)

అస్తిత్వపు పోరులో
దేవుడున్నాడని నమ్మకం ఆస్తికుడికి
దేవుడులేడని నమ్మకం నాస్తికుడికి

కుటుంబం/సమాజం నిలబడాలంటే
పెళ్లి అనే ప్రక్రియ పై ఓ జంటకి
చట్టాలపై ఆ వ్యవస్థకు …ఉండాల్సింది నమ్మకం

స్వార్ధం, నిస్వార్దాల ముసుగులో
హెచ్చు, తగ్గుల తేడాలతో
లాభ నష్టాల బేరీజుల్లొ,

నమ్మకమే, అపనమ్మకానికి అమ్మై వెలసి,
నిజానికి ఇప్పుడు, నమ్మకం అమ్మకమై
మానవ సంబంధాలను వ్యాపారపరం చేసింది

ప్రేమిస్తే నమ్మాలా? ప్రేమిస్తే సరిపోదా?
అసలు ఎందుకు నమ్మాలి ? నమ్మించాలి?

నమ్మకం ఓ నిబంధన!,
స్వచ్చమైన ప్రేమకు నిబంధనలుండవు..
ప్రేమించే మనసుకు కావలసింది స్వేచ్చ

తల్లి బిడ్డను, ఆవు లేగను
నమ్ముతుందా ? ప్రేమిస్తుందా?
నమ్మకంగా ప్రేమిస్తుందా?

స్వార్ధానికి హేతువే నమ్మకం
నిస్వార్దానికి నిలువుటద్దం ప్రేమ
నమ్మకం, నివురుగప్పిన మటీరియలిజం
ప్రేమకు పరమార్ధం మానవత్వం