నవ్వు--దాని వైఖరులు

నవ్వవు జంతువుల్,నరుడు నవ్వును. నవ్వులు చిత్తవృత్తికిన్
దివ్వెలు.కొన్ని నవ్వులెటు తేలవు. కొన్ని విషప్రయుక్తముల్.
పువ్వులవోలె ప్రేమరసముల్, వెలిగ్రక్కు, విశుద్ధమైన లే
నవ్వులు సర్వదుఃఖ దమనంబులు,వ్యాధులకున్ మహౌషధముల్.
(కవికోకిల—–గుర్రం జాషువా)

డాక్టరు “మదన్ కటారియా” అనే వైద్యుడు 1995 లో ఒక “హాసం” క్లబ్బును పెట్టి నవ్వుతో అనారోగ్యసమస్యలన్నీ పరిష్కరించేవాడు. లాఫింగ్ థెరపీకి అప్పటినుండి ఆదరణ పెరిగింది. 1998 లో 10,000 వేలమందితో నవ్వులయోగా చేయించాడు. అప్పటినుండి ప్రతిసంవత్సరం మే నెలలో మొదటి ఆదివారాన్ని నవ్వులదినంగా పాటించాలని నిర్ణయించి ఆచరిస్తున్నారు.

నవ్వులవలన లాభాలు—–
మనస్స్ఫూర్తిగా నవ్వితే ఆరోగ్యకరం. నవ్వువల్ల మెదడు,ముఖం,శరీరంలోని చాలాభాగాల్లో బిగుసుకుపోయిన కండరాలు వ్యాకోచం చెంది రక్తప్రసరణ పెరుగుతుంది. నవ్వినప్పుడు విడుదలయ్యే “ఎండార్ఫిన్” హార్మోన్ ఉత్సాహం పెంపొందిస్తుంది. నిత్యం పది నిమిషాలు నవ్వేవారికి 45 నిమిషాలు వాకింగ్ చేస్తే వచ్చే చురుకుదనం ఆరోగ్యం వస్తుందని పరిశోధకులు చెబుతున్నారు. నవ్వువలన రోగనిరోధకశక్తి పెరుగుతుంది. అందుకే ఇటీవల కొలంబో ఆసుపత్రులలో రోగులకు హాస్యంలో కౌన్సిలింగ్ నిర్వహించడం వంటి చర్యలు చేపడుతున్నారు.

ఒక జోక్ నల్గురిలో పేలిస్తే రకరకాల ధ్వనుల్లో నవ్వులు విరబూస్తాయి.కొందరు గ్యాసు సోడా కొట్టినట్లు, మరికొందరు పెదవి కదలకుండా శబ్దం వినిపించకుండా,కొందరు డబ్బాలో రాళ్ళు వేసి గిలకరించినట్లు, కొందరు ప్రక్కనున్నవారిని చితక్కోట్టేస్తున్నట్లు ఇలా రకరకాల నవ్వులతో నవ్విస్తూంటారు. అయితే నవ్వులకు సంబంధించి శాస్త్రీయవర్గీకరణకూడా ఉంది.
రుచుల్లో షడ్రుచులున్నట్లే హాస్యంలోనూ ఆరు రకాలున్నాయి.
స్మితం——-కనీ కన్పించకుండా ఉండే నవ్వు. హసితం—–పెదాలు విచ్చుకోకుండా సాగదీసి నవ్వడం.
విహసితం—పళ్ళు కన్పించేలా నవ్వడం. ఉపహసితం—–కళ్ళు పెద్దవి చేసి నోరు బాగా తెరచి నవ్వడం.
అపహసితం——భుజాలు తలా కదిలిస్తూ నవ్వే నవ్వు. దీన్నే వేళాకోళం వెకిలి నవ్వు అంటారు.
అతిహసితం—– మనిషంతా ఊగిపోతూ కళ్ళల్లో నీళ్ళు వచ్చేవిధంగా నవ్వడం.
ఇవే కాక, కాకా పట్టే నవ్వు,బాకా ఊదే నవ్వుల్లాంటివి చాలావరకూ ప్రాపంచికలోకంలో ఇంకా పుడుతూనే ఉన్నాయి.
(సేకరణ——ఐవియన్)