నా ఆస్ట్రేలియా యానం

2018 నవంబరు నెల 3-4 తేదీలలో మెల్బోర్న్ నగరంలో జరగబోతున్న అంతర్జాతీయ సాహితీ సమ్మేళనం సందర్భంగా కవితాస్త్రాలయ మూడవ సంకలనం కోసం, ‘ఆస్ట్రేలియా లో తెలుగువారి ప్రస్థానం’ అనే అంశం పై నా ఆస్ట్రేలియా అనుభవాలను ఈ కథానిక లో పొందుపరుస్తున్నాను.

అయితే ఈ కథ పేరు వెనుక మరొక కథ ఉంది!!

యానం అంటే ప్రయాణం అనే అర్థం వస్తుంది. ఈ కథ ముఖ్యంగా ఆస్ట్రేలియా లో నా జీవన పయనం గురించి. అయితే నా జీవితం మొదలయింది కూడా యానం లొనే. యానం నేను పుట్టిన ఊరు. ఆ ఊరు గురించి ఒక కథ వ్రాయవచ్చు! ఎందుకంటే అది ఒక ప్రత్యేకమైన ఉరు ! ఆంధ్రప్రదేశ్ మథ్యలో అటువంటి ఉరు ఒకటి ఉందని చాలా మందికి తెలియదు. భౌగోళికంగా ఆంద్రప్రదేశ్ లో ఉన్నాగాని, మా ఊరు కేంద్రపాలిత ప్రాంతమైన పుదుచ్చేరి లో ఒక భాగం. పుదుచ్చేరి లో మరో రెండు భాగాలు కూడా ఉన్నాయి. కరైకాల్ తమిళనాడు లోను, మాహే కేరళ లోను. ఇవన్నీ ఒకప్పటి ప్రెంచి స్థావరాలు. ఇలా చెప్పుకుంటూ పోతే, ముందు చెప్పినట్లు మా ఊరి గురించి మరొక కథ వ్రాయవచ్చు. ఫ్రాన్స్ లో పోలీసులు ఎటువంటి టోపీలు పెట్టుకొంటారో, మా ఉరిలో పోలీసులు కూడా అటువంటి టోపీలే పెట్టుకుంటారనే విశేషంతో మా ఊరి కథ ముగించేసి, నా ఆస్ట్రేలియా అనుభవాలలోకి వచ్చేస్తాను.

ఒకటి కాదు, రెండు కాదు, మూడు సంవత్సరాలు తక్కువగా మూడు దశాబ్దాలు ముగిసి పోయాయి ఆస్ట్రేలియా లో అడుగు పెట్టి. ఇంతవరకు నా జీవిత పూర్వార్ధం మాతృ దేశం లోనూ, ఉత్తరార్ధం వలసొచ్చిన దేశం లోను గడిచింది. ఆస్ట్రేలియా అనుభవాల గురించి చెప్పడానికి ఉపక్రమిస్తూ మాతృదేశ ప్రస్తావన ఎందుకంటే, ఒక గీత పెద్దదో, చిన్నదో చెప్పాలంటే, మరొక గీతతో పోల్చినపుడే సాధ్యం. మన జీవిత అనుభవాలు కూడా మన నుదుటి గీతల మీదే ఆధారపడి ఉంటాయి కదా !

తమాషా ఏమిటంటే చాలా వరకు నా ఆస్ట్రేలియా అనుభవాలు అభివృద్ధి చెందిన దేశాలకు వలస పోయిన భారతీయుల అనుభవాలతో పోలికలు కలిగి ఉంటాయి. కారణం ఆ దేశాలలో జీవిత శైలి ఒకేలా ఉండటం. దీనికి ఒక ఉదాహరణ కవితాస్ట్ర్రాలయ మొదటి సంకలనంలో నేను వ్రాసిన “గోంగూరామాయణం” కథ. తెలుగోళ్లు కష్టపడి ప్రేమగా పెంచుకున్న గోంగూర మొక్కలను, తెల్లోళ్ళు గంజాయి మొక్కలనుకొని, పీక్కోని పోయిన సంఘటనలకు సంభందించిన కథ అది. ఆస్ట్రేలియా లో నేను విన్నరెండు అటువంటి సంఘటనల గురించి వ్రాస్తే, అదే సమయంలో అమెరికా వాస్తవ్యులు అయిన ఒక తెలుగు రచయిత కూడా అటువంటి ఒక సంఘటన గురించి వ్రాయడం జరిగింది !

నేను కుటుంబ సమేతంగా ఆస్ట్రేలియాకు వలస రావడం కాకతాళీయంగా జరిగింది. ఢిల్లీకి దగ్గర ఘజియాబాద్ లో మేము నివసిస్తున్న క్వార్టర్స్ లో, పై అంతస్తు లోని సహోద్యోగి ఇక్కడకు వలస రావడం, స్నేహపరంగా అతని భార్య నా భార్యని ప్రోత్సహించడం, తద్వారా మేము కూడా సిడ్నీ నగరానికి వలస రావడం జరిగింది. ఆ రోజుల్లో ఐ ఐ టి డిగ్రీ ఉంటే, ప్రవేశ పరీక్షలు అవీ ఏమీ ఉండేవి కాదు. వలస రావాలని అనుకొంటే వచ్చేయ్యడమే ! అంతే కాదు, ఆస్ట్రేలియా గడ్డ మీద అడుగు పెట్టిన క్షణం నుండి, ఇక్కడి ప్రభుత్వం సాదరంగా ఆహ్వానించి ఆదుకొంది. అక్కడి జీతంతో కొనగలిగే నిత్యావసరాలు, ఇక్కడి నిరుద్యోగ భత్యం తోనే సమకూరేవి !

నా మాతృ దేశం లో కూడా ఇక్కడి లాంటి పరిస్థితితులు ఉంటే ఎంత బాగుంటుంది అని ఎన్నోసార్లు అనిపించింది. కులం, మతం, ధనం, వృత్తి – వీటన్నింటికీ అతీతంగా సాటి మనిషిని ఇక్కడ గౌరవిస్తారు. ప్రధానమంత్రి అయినా, ముఖ్యమంత్రి అయినా సగటు పౌరుని లాగే ప్రవర్తిస్తారు. మా సిడ్నీ తెలుగు సంఘం వారు ప్రతి సంవత్సరం ఉగాది మరియు దీపావళి సంబరాలు జరుపుతారు. ఒక సంవత్సరం మా న్యూ సౌత్ వేల్స్ ప్రీమియర్ బాబ్ కార్ ని ముఖ్య అతిథిగా ఆహ్వానించారు. కాని ఆయన ప్రారంభ సమయానికి రాలేదు. కార్యక్రమం మొదలయిన 15 నిమిషాలకు నేను ఏదో తీసుకు రావడానికి కారు దగ్గరికి వెళుతుంటే హాలు ఎక్కడ ఉందో వెతుక్కుంటూ ఒంటరిగా బాబ్ కనిపించారు. నేను అప్పుడు ఆయనను హల్ దగ్గరకు తీసుకెళ్ళాను. మరోసారి నేను సిటీ లో నా ఆఫీసు దగ్గర లంచ్ బ్రేక్ లో బయట నడుస్తుంటే, మాజీ ప్రధానమంత్రి జాన్ హౌవార్డ్ ఎదురు పడ్డారు. ఒంటరిగా నడుచుకుంటూ, ఎదురైన ప్రతీ వ్యక్తిని పలుకరించుకొంటూ వెళ్ళారు. ఇటువంటి సంఘటనలు మన మాతృదేశం లో కూడా ఎదురైతే ఎంత బాగుంటుంది ?

మేము ఆస్ట్రేలియాకి వలస వచ్చి 25 సంవత్సరాలు దాటింది. ఇంతవరకు ఇక్కడ అవినీతి. లంచగొండితనం లాంటి దూరాచారాల బారిన పడలేదు. అందుకేనేమో ఈ దేశాన్ని అదృష్టదేశం అని అంటారు. మేము నివసిస్తున్న సిడ్నీ నగరం ప్రతి సంవత్సరం జీవన ప్రమాణ పట్టికలో మొదటి 10 స్థానాల్లో ఉంటుంది.

నా భార్య ఉద్యోగ విషయం లో కూడా, మాతృదేశం లో కంటే ఆస్ట్రేలియా లోనే సరైన గుర్తింపు లభించింది. అక్కడ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్ ఇంజనీరింగ్ లో మొదటి శ్రేణిలో డిప్లొమా పూర్తి చేసిన తను, వ్యక్తిగత కారణాల వలన రెండు సంవత్సరాలు ఉద్యోగం చెయ్యడం కుదరలేదు. ఈ లోపు ఒక ఊరినుండి మరో ఊరికి, ఒక ఇంటి నుండి మరో ఇంటికి మారవలసి వచ్చిన క్రమంలో, తన డిప్లొమా సర్టిఫికెట్ ఎక్కడో కోల్పోయింది. ఆ తరువాత తన చదువుకు సంబంధించిన ఉద్యోగానికి అప్లై చేస్తే, రెండు సంవత్సరాలు ఖాళీగా ఎందుకున్నావు; ఒరిజినల్ సర్టిఫికేట్ లేకుండా అప్లయ్ చేయలేవు వగైరా వంకలతో ఉద్యోగం ఇవ్వలేదు. వేరే మార్గాలు సూచించారు కానీ ఆ దారుల్లో నడవడం మాకు ఇష్టం లేకపోయింది. ఆ తరువాత దాదాపు ఆరు సంవత్సరాలు అక్కడ ప్రయివేటు స్కూల్ లో, పార్ట్ టైం టీచర్ గా పనిచేసింది. ఆస్ట్రేలియా వచ్చిన తర్వాత, తన దగ్గర ఉన్న సర్టిఫికెట్ కాపీ మరియు మార్క్ లిస్టుల ఆధారంగా, తన ఇండియా డిప్లొమా కు సమానమైన ఆస్ట్రేలియా అసోసియేట్ డిప్లొమా సర్టిఫికెట్ ఇవ్వడమే కాకుండా, తన క్వాలిఫికేషన్ కి తగిన ఉద్యోగం కూడా ఇచ్చారు. ఈ రోజు తను ఒక అంతర్జాతీయ టెలిస్కోప్ ప్రొజెక్టు లో పనిచేస్తుంది. ఉద్యోగపరంగా కెనడా, సౌత్ ఆఫ్రికా, బ్రిటన్ లాంటి దేశాలకు ప్రయాణం చేస్తుంది. భారత దేశం లోనే ఉండిపోతే, ఇవన్నీ సాధ్యం అయ్యేవా అనిపిస్తుంది ఆలోచిస్తుంటే.
నా ఉద్యోగ విషయం లో కూడా, అనుకోని పరిణామాలు సంభవించాయి. చదువు పూర్తయిన తరువాత 8 సంవత్సరాలు ఇండియాలో ఉద్యోగం చేసి వచ్చిన నాకు, ఇక్కడికి వచ్చిన తరువాత 6 నెలల వరకు ఉద్యోగం దొరకలేదు. రిసెషన్ టైం లో ఇక్కడకు రావడం ఒక కారణం అయితే, లోకల్ అనుభవం లేకపోవడం మరొక కారణం. ఉద్యోగం లేకుండా లోకల్ అనుభవం ఎలా వస్తుంది అనేది ఒక అర్థం కాని ప్రశ్న. నా ఫీల్డ్ లో ఉద్యోగం కోసం ఎదురు చూసే బదులు నాకు ఎదురైన షాప్ అసిస్టెంట్ ఉద్యోగం లో చేరి పోయాను. 2 సంవత్సరాలు ఆ ఉద్యోగం లో మునిగి పోయిన నాకు ఒక రోజు నాతోపాటు ఇండియా లో ఉద్యోగం చేసిన ఒక మిత్రుడు ఎదురై మా కంపెనీ లో రాడార్ టెస్ట్ ఇంజినీర్ ఉద్యోగం ఖాళీ ఉంది. అప్లై చెయ్యి అని సలహా ఇచ్చాడు. రెండున్నర సంవత్సరాలుగా ఆ ఫీల్డ్ కు దూరంగా ఉన్న నాకు ఆ ఉద్యోగం ఇస్తారా ? అని అనుమానిస్తూనే ఆప్ప్లై చేసాను. కాని ఉద్యోగం నాకే ఇచ్చారు.

ఈ ఘటనాక్రమంలో నేర్చుకున్న పాఠాలు: ఇక్కడ లోకల్ అనుభవం అంటే ఆ ఫీల్డ్ కు సంభందించిన ఉద్యోగం లో మాత్రమే కాదని, వేరే దేశం నుండి వచ్చి ఇక్కడి ఉద్యోగ పద్ధతులకు, ముఖ్యంగా కమ్యూనికేషన్స్ పరంగా అలవాటు పడ్డారా లేదా అనేది దాని అర్థమని, ఉద్యోగ ప్రకటనల కంటే నెట్వర్కింగ్ వలన ఎక్కువ ఉద్యోగావకాశాలు ఉంటాయని, కష్టపడి పనిచేయాలి అనే కోరిక ఉంటే, ఫీల్డ్ అంతరాయం కాదని, ఇలా ఇంకా చాలా చాలా. ఆ 2 సంవత్సరాలు రిటైల్ ఇండస్ట్రీలో పనిచేయడం వలన, ఇక్కడి వాళ్ళ గురించి మంచి అవగాహన కలగటమే కాకుండా ఒక కొత్త ఫీల్డ్ లో అనుభవం, నైపుణ్యం కూడా వచ్చాయి.

నా వ్యక్తిగత విషయాల నుండి, తెలుగు కమ్యూనిటీ విషయాలకొస్తే, తెలుగు భాషాభిమానిగా, సిడ్నీ తెలుగు సంఘాల కార్యక్రమాల్లో మా కుటుంబ సభ్యులం బాగానే పాల్గొన్నాము. స్టూడెంట్ వలసలు మరియు ఐ టి కంపెనీల కారణంగా తెలుగు వారి సంఖ్య కూడా బాగానే పెరిగింది. మేము వచ్చినప్పుడు వందల సంఖ్యలో ఉన్న తెలుగు వారు ఇప్పుడు వేల, పదివేల సంఖ్యలో ఉన్నారు. ఈ సంఖ్యాబలం వలన, SBS రేడియో వారు ఇంతవరకు నడుస్తున్న కన్నడ భాషా కార్యక్రమాలు ఆపేసి, ఆ టైం స్లాట్ లో తెలుగు భాషా కార్యక్రమాలు మొదలు పెట్టబోతున్నారు.

ఇండియా లో చేయనవసరం లేని కొన్ని పనులు ఇక్కడ చెయ్యాల్సి వస్తుంది. గిన్నెలు కడగడం, బట్టలు ఉతకడం లాంటి మన పనులు మనమే చేసుకోవాలి. ఇండియా లో లాగా పని మనిషిని పెట్టుకోవాలంటే, మనకు వచ్చే జీతంలో పెద్ద భాగం వాళ్ళకు ఇవ్వాల్సి వస్తుంది. సంవత్సరం లో ఒకసారి ముందుకు, ఒకసారి వెనక్కు గడియారాలను తిప్పుకోవాలి. పెద్దలను, పిల్లలను చాలావరకు వాళ్ళ మొదటి పేరుతోనే పిలవాలి.

జీవన పరిణామాలలాగానే, ఇక్కడి ప్రకృతి అందాలు కూడా ఉన్నతమైనవే. ఆ అందాల మధ్యనున్న ఎడారి కూడా ఎంత పెద్దదంటే, ప్రపంచంలో అత్యధిక సంఖ్యలో ఒంటెలు ఆస్ట్రేలియా లొనే ఉన్నాయట.

ఇలా చెప్పుకొంటూ పోతే ఎన్నో, ఎన్నెన్నో నా ఆస్ట్రేలియా అనుభవాలు

–CV రావు సిడ్నీ