నా తదుపరి సినిమా...

మహేశ్ బాబుతోనే : రాజమౌళి

రాజమౌళి తదుపరి సినిమా ఏ హీరోతో ఉండనుంది అనే విషయం అభిమానుల్లో ఆసక్తిని రేకెత్తిస్తోంది. ప్రభాస్ తో ఉంటుందని కొంతమంది అంటుంటే, మహేశ్ బాబుతో ఉంటుందని మరికొందరు చెబుతున్నారు. తాజాగా ఒక ఇంటర్వ్యూలో రాజమౌళి మాట్లాడుతూ, ఈ విషయంపై క్లారిటీ ఇచ్చారు.

maheshడీవీవీ దానయ్య నిర్మాణంలో ఒక సినిమా .. కేఎల్ నారాయణ నిర్మాతగా ఒక సినిమా చేయాలని నేను నిర్ణయించుకున్నాను. ప్రస్తుతం ‘ఆర్ ఆర్ ఆర్’ సినిమాను డీవీవీ దానయ్య నిర్మాణంలోనే చేస్తున్నాను. ఆ తరువాత సినిమా కేఎల్ నారాయణ నిర్మాణంలో వుంటుంది. ఆ సినిమా ప్రభాస్ తో కాదు .. మహేశ్ బాబుతో ఉంటుంది. కేఎల్ నారాయణ నిర్మాణంలో మహేశ్ బాబు హీరోగా ఒక సినిమా చేస్తానని చాలా కాలంగా చెబుతూ వస్తున్నాను. ‘ఆర్ ఆర్ ఆర్’ తరువాత ఈ ప్రాజెక్టు పట్టాలెక్కుతుంది” అని ఆయన చెప్పుకొచ్చారు.

“ఒక జోనర్లో ఒక సినిమా చేసిన తరువాత, అదే మూసలో మరో సినిమా చేయకుండా పూర్తి డిఫరెంట్ గా వుండే మరో జోనర్ ను ఎంచుకుంటాను. అలా చేయడం వలన తప్పకుండా హిట్ వస్తుందని కాదు .. అది నాకు నేనుగా పెట్టుకున్న ఒక నియమం అంతే. నా దృష్టిలో ఏ సినిమాకి ఆ సినిమాయే ఇంపార్టెంట్. ఇంతకుముందు చేసిన సినిమాను గురించి పూర్తిగా మరిచిపోయి, ప్రస్తుతం నా ఎదురుగా వున్న కథపై పూర్తి దృష్టిపెడతాను. నా చేతిలో వున్న కథకు పూర్తి న్యాయం చేయడానికి శాయశక్తులా కృషి చేస్తాను” అని చెప్పారు.

ఇటీవల చరణ్ బర్త్ డే సందర్భంగా ‘ఆర్ ఆర్ ఆర్’లో చరణ్ పాత్రకి సంబంధించిన ఒక వీడియోను వదిలారు. తాజాగా ఆ వీడియోను గురించి రాజమౌళి మాట్లాడారు. “అల్లూరి సీతారామరాజు గురించి కొమరమ్ భీమ్ మాట్లాడితే ఎలా ఉంటుందా? అనే ఆలోచన మాకే కొత్తగా అనిపించింది. సాయిమాధవ్ తో వాయిస్ ఓవర్ రాయించి ఆ వీడియోను వదిలాము. ఆ వీడియోకి మంచి రెస్పాన్స్ వచ్చింది.

లాక్ డౌన్ కి ముందే 80 శాతం చిత్రీకరణను పూర్తి చేశాము. ఆ మెటీరియల్ అంతా కూడా మా ల్యాప్ టాప్స్ లో వుంది. అయితే లాక్ డౌన్ పరిస్థితుల్లో చరణ్ వీడియోను రిలీజ్ చేయడం కరెక్టేనా? అనే ఆలోచనలో పడ్డాము. లాక్ డౌన్ కారణంగా ఇళ్లలో ఉన్నవాళ్లు ఆ వీడియో చూసి దాని గురించి మాట్లాడుకోవడం జరుగుతుందనే నిర్ణయానికి వచ్చాము. ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఎవరి ఇంట్లో వాళ్లే వుండి ఈ వీడియోను రిలీజ్ చేశాము. ఈ వీడియోను చూసి చాలామంది ఎంజాయ్ చేశారు. కొంతమంది నెగెటివ్ కామెంట్స్ చేశారు .. వాటిని గురించి పట్టించుకోనవసరం లేదు” అని వివరించారు.

Send a Comment

Your email address will not be published.