నీలాంబరి – వెన్నెల విరి

సమసమాజంలోని సమస్యల్ని వివిధ కోణాల్లో విశదీకరించి ప్రతీ పాత్రలో తన అనుభవాలను క్రోడీకరించి రచించిన కధల సంకలనం – నీలాంబరి. శ్రీమతి శారద గారు “భగవద్గీత” లోని 18 పర్వాలు లాగా ఈ పుస్తకంలో 18 కధలు వ్రాసారు. ప్రతీ కధ సమాజంలోని ఒక సమస్యను తీసుకొని అందులో అనువైన పాత్రలని సృష్టించి చదువరి ఆ పాత్రలో లీనమై పోయేట్లుగా వ్రాయడం శారద గారి కలంలో ప్రత్యేకత. తన చుట్టూ వున్న పరిసరాలను కూలంకుషంగా పరిశీలించి కధా వస్తువును మన తెలుగువారి పరిస్థితులకు అనుకూలంగా మలచి మంచి పదజాలంతో వ్రాసిన కధలివి. ప్రతీ కధలోనూ వైవిధ్యం వుంది. హాస్యం వుంది, వ్యంగ్యం వుంది. సమసమాజంలో జరుగుతున్న సంఘర్షణ వుంది. ముఖ్యంగా ఆస్ట్రేలియా ఆంధ్రుల జీవన విధానం వుంది. జనజీవన స్రవంతిలోని ఆర్ధ్రత వుంది.

ప్రతీ కధని విశ్లేషిస్తూ పొతే ఇదే ఒక గ్రంధం అవుతుంది. కానీ కొన్ని కధల గురించి వ్రాయకపోతే ఈ సమీక్షకి అర్ధం లేదు. “రాగసుధా రసపానం” లో మన శాస్త్రీయ సంగీతానికి తిలోదకాలిస్తున్న తీరును దుయ్యబట్టడం చాలా చక్కగా వివరించారు. “ఆకాశానికి గుంజలు” కధ సమాజంలో వున్న ఒక సమస్యను తీసుకొని కాలానుగుణంగా ఎటు వైపైనా దారి తీయవచ్చని తెలియజేసారు. “నేనెవరిని” కధలో ఒక స్త్రీ తనని తానే ప్రశ్నించుకొని మానసిక సంఘర్షణ పడుతూ కాలభ్రమణములో ఎలా నిర్వీర్యం చెందుతుందో అని వివరించే విధానం చాలా చక్కగా వుంది. ఆస్ట్రేలియా దేశంలో పడవ వివాదాలను ఎత్తిచూపే “పడవ మునుగుతోంది” కధ స్థానిక సమస్యల్ని కళ్ళకు కట్టినట్టు చూపించారు. “విషవలయం”, “వస్త్రాపహరణం” వంటి కధల్లో మన పిల్లల గురించి వారి సమస్యలతో తలిదండ్రులు పడే ఆవేదన గురించీ అతిసున్నితంగా వివరించారు.

ప్రతీ కధలో మంచి సాహిత్యం, సమస్య, ఆవేదన, పరిష్కారం ఇలా నవరసాలు ఉట్టిపడే ఈ కధల సంపుటి నీలాంబరి ఆస్ట్రేలియా ఆంధ్రుల సాహిత్య ఒరవడిలో ఒక వెన్నెల విరి.