నేల – నింగి ప్రేమ కలాపం

నేల – నింగి ప్రేమ కలాపం

ఉత్పలమాల పద్య ఖండిక

1.
నింగిని నీవుదూరమని యెప్పుడు ఖేదము చెందలేదు నీ
భంగిమ లెప్పుడున్ గనుచు భాగ్యమ దేయని మౌనముద్రలో
నింగిత మైనభావములు నీశ్వరు పల్కులు కాగ నెన్నియో
సంగతులన్ వచింతువని సౌమ్యత నుంటిని వేచి చూచుచున్
2.
సుందరమైన రూపున రసోజ్వల కాంతివి రాజితంబుగా
పందిరి వేసినట్లు పలు భంగిమ లెన్నియొ గాంచితిన్ భలే
సందడి చేయగా మనసు సంభ్రమ మొందగ గోరుచుంటి నా
చందమునెంచకుండనను చాయగనుండగ సమ్మతించుమా
3.
ఉల్లస మందె నామనసు నుత్తర మొక్కటి చూడగా నెదో
మల్లెసు గంధవాసనలు మత్తుగ యత్తరు నింపి నిండు దో
సిల్లను బట్టి దెచ్చినటు సింధుర బొట్టును దిద్దినట్లుగా
అల్లిన దండనా మెడను హారము వేసిన చందమయ్యెనో
4.
మానసమందునా తలపు మారుతి చేష్టలు రూపునొంద నీ
గానము జేయుదున్నెపుడు కమ్మని రాగము ఝుమ్మనంగ నే
కానను వేరుభోగములు ఘల్లన నాట్యము జేయదున్ సదా
తానము జేయుదున్ మదిని తాపము తీరగ తన్మయుండనై
5.
చిత్తమునందు నిన్ దలచి చిన్నగ నే పనిచేయుచుండ గ-
మ్మత్తుగ వానచిన్కు నను మన్నన దాకుచు వీణవంటి నా-
మెత్తని మానసంబున సమీప్సిత గీతికలన్ రచించి కొం-
గ్రొత్తవియైన కోరికల కూటమితీర్చెను సంతసంబునన్

6.
ఇంద్రధనుస్సునన్ గనగ హేమవతీ స్వరరాగ వేడుకల్-
చాంద్రమసీ విలాసములు చంచలనేత్రల మేన నిండగా-
సంద్రమువోలె గన్పడెను సవ్వడిజేయుచు మేఘమాలలున్-
సాంద్రవినూత్నభావముల సంగతి జెప్పెను ముచ్చటించుచున్!
7.
రోదన చెందినా మనసు రోదసి వంకకు చూచెనెందుకో
కాదనలేకనీ సొగసు ఘమ్మున వర్షపు బిందువయ్యెనో
ఖేదమునొందుచున్న నను గ్రీష్మము బారిని గాచినిల్వగా
మోదమునొందితిన్ తలపుమోహములన్ని ఫలింప ముగ్ధునై !
8.
నేనుధరాతలంబగుచు నీయడుగున్ బడి క్రిందనుండగా
నూనిన కోపభారమున నొక్కెడనాపయి పంతమో యనం
గా నశని ప్రసారమును కక్షగ జేసితి వాకశమ్మ ! నిన్
నేనుశపింపగల్గుదును నీతియుగాదని మిన్నకుంటిరా !
9.
ప్రేమగ యుండుటే మనకు పేరిమి యౌనని నే తలంపగా
గోముగ నీవుచెప్పితివి కూరిమి తోడను మాట మౌనమై
ఏమని చెప్పుసంతసము నేగతి తెల్పెద నాదు మాటగా
కోమల మైనపల్కులు చకోరము నైవిని పించనా సఖా !
10.
కూరిమితో మనిద్దరిని కూర్చినదైవము ప్రేమభావనన్ –
వేరగుయోచనావిధిని వీడుచు నిర్వురునొక్కరేయనన్-
హారమునందుదారముగ హాయిగనుండుమటంచు దీవెనల్-
పేరిమితో నొసంగిరిట ప్రేమగ బ్రోచుచు నాదిదంపతుల్ !

—మల్లికేశ్వర రావు కొంచాడ