పద్యమే ఉద్యమం

పద్యమే ఉద్యమం

వెయ్యేళ్ళ తెలుగు భాష ప్రాశస్త్యం ‘పద్యం’ లోనే ఇమిడి ఉందన్న భావనతో ఆస్ట్రేలియా మరియు న్యూ జిలాండ్ లోని భాషాభిమానులు, ఔత్సాహికులు ‘తెలుగుమల్లి’ ఆధ్వర్యంలో ‘పద్య విజయం’, ‘పద్య వికాసం’ అని రెండు సమూహాలను ఏర్పరచుకొని చందోబద్ధమైన తెలుగు పద్యాలు వ్రాయడం నేర్చుకుంటున్నారు. ప్రతీ వారం రెండు గంటలు జూమ్ మాధ్యమంగా కలుసుకొని గణ, యతి, ప్రాసలను వాటి ప్రయోగాలను కూలంకషంగా చర్చించుకొని విభిన్న అంశాలపై తేటగీతి, ఆటవెలది, సీసము ఇలా జాతులు, ఉపజాతులలో పద్యాలను వ్రాసి పరవశించిపోతున్నారు.

ఎప్పుడో చిన్నప్పుడు మార్కులకోసం విభక్తులు, ఛందస్సు, సంధులు, అలంకారాలు చదివి అక్కడే విడిచిపెట్టిన మూలధనం మళ్ళీ 30-40 సంవత్సరాల తరువాత నేర్చుకునే అవకాశం కలిగి నందుకు ఎంతో ఆనందపడి శ్రద్ధగా నేర్చుకుంటున్నారు. కరోనా పుణ్యమాని బయటకెళ్ళే అవకాశం లేక ఇదొక అభ్యాసంగా అందరూ సాధన చేస్తున్నారు.

గత సంవత్సరం (2020) జూన్ నెలలో ముగ్గురితో మొదలైన ఈ ప్రక్రియ ఇప్పుడు సుమారు 25 మంది ఈ సమూహాలలో చేరి దినదినాభివృద్ధి చెందుతోంది. ఆస్ట్రేలియా మరియు న్యూ జిలాండ్ వాస్తవ్యులే కాకుండా భారతదేశం, సింగపూర్, దుబాయ్, సౌత్ ఆఫ్రికా మరియు అమెరికా దేశాలలోని రచయితలు ఈ సమూహంలో చేరి పద్య రచన నేర్చుకుంటున్నారు. ఒకప్పుడు పద్యం ఎవరు చదువుతారులే అనే భావన నుండి ఇప్పుడు ‘పద్యమే’ ఉద్యమంగా మారిందంటే అతిశయోక్తి కాదు. 2020 స్వాతంత్ర్య దినోత్సవం రోజున ఆస్ట్రేలియా వాసులు వ్రాసిన మొదటి ‘వీర సైనిక’ శతకం ప్రముఖ కవి, రచయిత, దర్శకులు, రంగస్థల నటులు శ్రీ మీగడ రామలింగ స్వామి గారి చేతులమీదుగా ఆవిష్కరించబడింది. విజయదశమి రోజు మరో ఇద్దరు కవులు వ్రాసిన ‘శ్రీ సాయినాథ’ శతకం ఆవిష్కరించబడింది. ప్లవ ఉగాదికి ‘శ్రీ సోపానలహరి’ పద్య కావ్యం ఆవిష్కరించబడింది.

అయితే దీనికి మూలం ముఖ్యంగా ఇద్దరు వ్యక్తుల గురించి చెప్పుకోవాలి. వ్రుత్తి రీత్యా సాఫ్ట్ వేర్ నిపుణులు మరియు ఆస్ట్రేలియా అవధాని ‘శారదామూర్తి’ బిరుదాంకితులు శ్రీ తటవర్తి కళ్యాణ చక్రవర్తి గారు మూడేళ్ల క్రితం ఆస్ట్రేలియా వచ్చి తన పద్య విద్యను నలుగురికీ అందివ్వాలన్న సంకల్పంతో మొదట ‘పద్య విజయం’ సమూహాన్ని ప్రారంభించి ఛందోబద్ధమైన పద్యాలను వ్రాయడం మొదలుపెట్టారు. యాదృచ్చికంగా ఈ బృందానికి పరిచయమైన కవి, పద్య రచనా విశారదులు డా. చింతలపాటి మురళీ కృష్ణ గారు ఈ రెండు బృందాలకు పద్య రచనలోని మెలుకవులను అందరికీ చెబుతూ రచనా సత్సంగాన్ని ప్రోత్సహిస్తున్నారు. వీరిరువురు గురువుల ప్రోత్సాహంతో ఇక్కడి భాషాభిమానులు దినదినాభివృద్ధి చెంది పద్య రచనలో ముందడుగులేస్తున్నారు. అవకాశం దొరికినపుడు వారు వారాంతం అవధానాలు కూడా చేసుకుంటున్నారు.

ఈ సమూహంలో ఉన్న వారందరూ మంచి కథా వస్తువులతో పద్య కావ్యాలు వ్రాసి భావితరాల వారికి మార్గదర్శకులు కావాలని అకాంక్షిద్దాము.

గత నెలరోజులుగా పద్యరచన మొదలుపెట్టిన కొంతమంది పద్యాలు:

ఆ.వె.
పుట్ట గానె నీవు పూర్ణచంద్రుడుగావు
విద్యయందును విలువిద్య యందు
పాక శాస్త్రమైన పద్యరచన యైన
సాథనమ్ము తోడ సాధ్యమగును
శ్రీనివాస్ బృందావనం, మెల్బోర్న్

ఆ.వె.
పాట మాట నీదు వరములు కృపతోడ
మెండు గనిడు మమ్మ దండి కలుగ
మరువ నేను నాదు మనమున నెన్నడు
చేయి బట్టి నడుపు మోయి తల్లి
కోటీశ్వర రావు శనగపల్లి, మెల్బోర్న్

ఆ.వె.
పుస్త కమ్ము హస్త భూషిత మానాడు
వంద నమ్ము చేయ వాణి యంచు
కరము నాక్ర మించె చరవాణి ఈనాడు
మనము నందె నింక మనుము తల్లి
శ్రీనివాస్ నందగిరి, ఆక్లాండ్

ఆ.వె.
పుస్తకమును చేత బూనితి భారతీ
వరములియ్యవమ్మ పద్య రచన
చేయ వందనములు చేతును వేడ్కగా
భాషణంబు నిమ్ము భూషణముగ
నాగలక్ష్మి తంగిరాల, ఆక్లాండ్

ఆ.వె.
మల్లె వంటితల్లి మా శారదాంబ యే
పుస్తకాల నిలచి పూజనొంది
నాకు భూషణము గ నలువంక నిలచు చూ
అభయ హస్త మొసగి ఆదు కొనవె
గోవర్ధన్ మల్లెల, ఆక్లాండ్

ఆ.వె.
శారద నను కోరి చక్కగ కరుణింప
భక్తి పుస్త కమును పాణి నిలిపి
భూషణముల బదులు భువిని సుభాషిత
ముల గ్రహింతు సత్కవుల నెల వున
ఉషా శ్రీదేవి శ్రీధర్, సిడ్నీ

ఆ.వె.
శ్రావణమున లక్ష్మి శారదతో గూడి
పూజలందుకొనగ భువికి జేరె
శుక్రవారమందు శోభతో మాయింట
షోడషోపచార సుకృతమొందె
శర్మ చెరుకూరి, మెల్బోర్న్

ఆ.వె.
శారదాంబ కలిమి శార్ధూలమును పలుక
శక్తి నొసగె నాకు యుక్తి నొసగె
పుస్తకమును చదవ ప్రొత్సహించె
అంత నాటవెలది పద్యమవతరించె
రాజశేఖర్ రావి, మెల్బోర్న్

ఆ.వె.
పలుకు నొసకు నాకు పలుకుల విరబోణి
పుస్తక మున నెలచి బుద్దినిమ్ము
నాదు హస్తమందు నమ్మిక మీరగా
భూషణముగ నీవు భోగమిమ్ము
సునీల్ పిడుగురాళ్ళ, మెల్బోర్న్

ఆ.వె.
లేత చిగురు టాకు లే తల్లి పాదాలు
అరుణ వర్ణ మందు హస్త ముండు
అమ్మ వారి నుదుట ఆదిదే వునిరూపు
గలిగి ఉన్న దల్లి కరుణ జూపు
ఓరుగంటి రోజారమణి, సింగపూర్