పద్యానికి ప్రాణ ప్రతిష్టచేసిన కరుణశ్రీ

పద్యానికి ప్రాణ ప్రతిష్టచేసిన కరుణశ్రీ

తెలుగు పద్యానికి ప్రాణ ప్రతిష్టచేసిన కరుణశ్రీ
– జంధ్యాల పాపయ్య శాస్త్రి (కరుణశ్రీ) వర్దంతి జూన్ 22

ఆధునిక కాలంలో తెలుగు పద్యానికి ప్రాణ ప్రతిష్టచేసిన జంధ్యాల పాపయ్య శాస్త్రి పేరు ‘కరుణశ్రీ’ గా సాహితీ జగత్తుకు చిరపరిచితమే. గొప్ప కవిగా పేరు పొందాడు. మృదు భాషిగా, సుమధుర కవిత్వానికి చిరునామాగా నిలిచిపోతారు. కరుణశ్రీ ఇతని కలం పేరు. నవరసాలలో కరుణ రసానికే ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చిన కరుణశ్రీ వర్ధంతి జూన్ 22. ఈ సందర్భంగా ఆయనని గుర్తుచేసుకుందాం…

కరుణశ్రీ గుంటూరు జిల్లా, పెదనందిపాడు మండలములోని కొమ్మూరు గ్రామములో 1912, ఆగస్టు 4న జన్మించారు. తల్లి మహాలక్ష్మమ్మ, తండ్రి పరదేశయ్య. కొమ్మూరులో ప్రాథమిక, మాద్యమిక విద్య చదివిన పాపయ్యకు సంస్కృత భాషపై మక్కువ పెరిగింది. భమిడిపాటి సుబ్రహ్మణ్యశర్మ, కుప్పా ఆంజనేయశాస్త్రి వద్ద సంస్కృత కావ్యాలు చదివారు. రాష్ట్ర భాషా విశారద, ఉభయ భాషా ప్రవీణ, హిందీ భాషా ప్రవీణ పరీక్షలలో ఉత్తీర్ణుడై అమరావతి రామకృష్ణ విద్యాపీఠములోనూ, గుంటూరులోని స్టాలు గర్ల్స్‌ హైస్కూలులో, ఆంధ్ర క్రైస్తవ కళాశాలలో 22 సంవత్సరాలు హిందూ కళాశాలలో 2 సంవత్సరాలు ఆంధ్రోపన్యాసకులుగా వ్యవహరించారు. విద్యార్థినీ విద్యార్థులకు విశేషమైన సేవలు అందించారు.

వీరి కలం పేరు ‘కరుణశ్రీ’. ఉదయశ్రీ, విజయశ్రీ, కరుణశ్రీ, ఉమర్‌ ఖయ్యూం వీరి రచనలు. కుంతి కుమారి, పుష్పవిలాపం (ఘంటసాల గానం చేశారు) మొదలైన కవితా ఖండికలు బహుళ జనాదరణ పొందాయి. 20వ శతాబ్దములో బాగా జనాదరణ పొందిన తెలుగు కవులలో ఒకరు. వీరి కవిత్వము సులభమైన శైలిలో, సమకాలీన ధోరణిలో, చక్కని తెలుగు నుడికారముతో విన సొంపై యుండును. ఖండకావ్యములు వీరి ప్రత్యేకత. అందునా కరుణ రస ప్రధానముగా చాలా కవితలు వ్రాసి, “కరుణశ్రీ” అని ప్రసిద్దులైనారు. మృదుమధురమైన పద్య రచనా శైలి వీరి ప్రత్యేకత.

జంధ్యాల పాపయ్య రాసిన ఉదయశ్రీ, కరుణశ్రీ, విజయశ్రీ, కుంతికుమారి పుష్ప విలాపం కావ్యాలు ఆయనకు గొప్ప కీర్తి ప్రతిష్టలు తెచ్చిపెట్టాయి. తెలుగులో పద్యం, వచనం, గేయం వంటి ప్రక్రియా రూపాల్లో 76కు పైగా రచనలు చేశారు. అలా వచనం గేయం ప్రక్రియలు చేపట్టినా అత్యంత ప్రాధాన్యం పద్యానికే ఇచ్చారు.*
జంధ్యాల పాపయ్య శాస్త్రి గారి పద్యానికి అంతపేరు రావడానికి ఆ పద్యాల సొగసు, హొయలు అన్నీ కవిగారి నోట పలికేటప్పుడు ఎంతో తీయగా, రమ్యంగా సరళంగా మధురంగా పండితులకే కాదు పామర జనులకు కూడ సులువుగా ఆకర్షించే రీతిలో ఆలపించడమే కారణం.

పుష్పవిలాపంలో…*

“నేనొక పూలకడనిల్చి
చివాలున కొమ్మవంచి
గోరానెడు నంతలోన విరులన్నియు
జాలిగా నోళ్ళు విప్పి మా ప్రాణము*
తీతువా యనుచు బావురుమన్నవి”….అనే కరుణశ్రీ పద్యం కరుణ రసభరితం. సున్నితమనస్కుల హృదయాలను చెమరింపచేస్తుంది.

కుంతి కుమారి, పుష్పవిలాపం రెండు కావ్యాలలో కరుణ రసం తొణికిసలాడడం మనం గమనిస్తాం. ఈ కావ్యాల్లోని పద్యాలను ఘంటసాల వేంకటేశ్వరరావు ఆలపిస్తుండే సాహిత్యాభిమానుల మేనులు పులకింతలకు లోనుగాగ మైమరచిపోయే వారు. తన్మయత్వం పొందని ఆంధ్రుడు లేడని గర్వంగా చెప్పవచ్చు.నిజానికి కరుణశ్రీ పద్యాలను ఘంటసాల పాడడం వల్లే అంతపేరు వచ్చిందని ఆనాటి రోజులలో కొందరంటే కరుణశ్రీ పద్యాలను ఘంటసాల పాడడంవల్లే అతనికి అంతపేరు వచ్చిందని మరికొందరు అనేవారు.

ఏదేమైనా కరుణశ్రీ పద్యాలను ఘంటసాల పాడడం వల్ల కరుణశ్రీకి, పాడిన ఘంటసాలకు విశేషమైన కీర్తి ప్రతిష్టను దక్కడంవల్ల వీరి అవినాభావ సంబంధానికి పూవుకు తావిఅబ్బినట్లు చెప్పవచ్చు. ఘంటసాల స్వయంగా చెప్పుకొన్నాడు తాను చలనచిత్ర రంగంలో స్థిరపడడానికి పుష్పవిలాపంలోని పద్యాలు పాడడమే కారణమని.

జంధ్యాల పాపయ్య శాస్త్రి రాసిన ఉదయశ్రీ కావ్యం 56 సార్లు పునర్ముద్రితమైంది. ఇది సామాన్య విషయం కాదు గదా! కరుణశ్రీ మరో రచన ఉమర్‌ ఖయ్యాం. ఈకావ్యం తెలుగు విశ్వ విద్యాలయం అవార్డు పొందింది. కరుణశ్రీ రచనలు మరెన్నో ఇతర భాషలైన హిందీ, ఇంగ్లీషులలోకిఅనువదించబడ్డాయి.
తిరుమల తిరుపతి దేవస్థానం వారు పోతన భాగవతాన్ని సరళమైన తెలుగులో అందించేందుకు పూనుకొని పోతన ప్రాజెక్టును ఏర్పాటు చేశారు. దానికి ప్రధాన సంపాదకులుగా కరుణశ్రీని నియమించడం మరో అరుదైన విశేషంగా చెప్పవచ్చు.
కరుణశ్రీ పొందిన బిరుదులు, సన్మానాలు అనేకం తిరుపతిలోని శ్రీ వేంకటేశ్వర విశ్వవిద్యాలయంవారు కరుణశ్రీని గౌరవ డాక్టరేట్‌తో సత్కరించారు.
కరుణశ్రీ ఇంటిలో నిత్యం ప్రముఖ కవి పండితులతో సాహిత్యంపై చర్చలు జరిపేవారు. ఇంతటి సాహితీవేత్త సాహితీ ప్రియులను దు:ఖసాగరంలో ముంచి 1992 జూన్‌ 22న శాశ్వతంగా కన్నుమూశారు. సాహితీ లోకంలో కరుణశ్రీ లేనిలోటు ఎప్పటికీ ఎవ్వరూ తీర్చలేనిది.

కరుణశ్రీ గురించి ప్రఖ్యాత సంపాదకులు నండూరి రామమోహనరావు మాటల్లో చెప్పాలంటే…
గణ యతి ప్రాసలతో కూడిన పద్యం తెలుగు వాడి సొత్తు. సంస్కృతంతో సహా ఏ భాషా ఛందస్సులో లేని సొగసు తెలుగు పద్యానిది. ఆ సొగసైన తెలుగు పద్యాన్ని సొంతం చేసుకున్న మహనీయ కవి కరుణశ్రీగా తెలుగు నెల నాలుగు చెరుగుల పేరుపడిన జంధ్యాల పాపయ్య శాస్త్రి గారు. పద్య విద్యనూ పరాకాష్ఠకు తీసుకువెళ్ళిన కవిశేఖరుడు పాపయ్య శాస్త్రి గారు. తెలుగు పద్యాన్ని ఎంత రమ్జుగా, రమ్యంగా, సరళంగా, మధురంగా, శ్రవణసుభగంగా నడిపించడానికి వీలుందో అంతగాను నడిపించిన ఘనత పాపయ్య శాస్త్రి గారిది.విడదీయరాని సంబంధం వుంది తెలుగు పద్యానికి, కరుణశ్రీకి మధ్య. తెలుగు పద్యానిది వెయ్యేళ్ళ చరిత్ర. ఈ వెయ్యేళ్ళలో తెలుగు పద్యం ఎన్నో పోకడలు పోయింది. నన్నయదొక పోకడ, తిక్కనదొక పోకడ, శ్రీనాథుని దొకటి, పోతనదొకటి, పెద్దనది మరొకటి.
ఆకాశమార్గాన అందనంత దూరాన విహరించే తెలుగు పద్యాన్ని నేల మీదికి లాక్కొచ్చి, ప్రతి పల్లెటూరిలో ప్రతి నోట పలికించిన ఘనత తిరుపతి వేంకట కవులది. కాగా, తెలుగు పద్యాన్ని హుమాయిలా, రుబాయిలా పరువెత్తించిన నేర్పు జాషువాది. వారి తర్వాత అంతగాను, అంతకన్నా మిన్నగాను పద్య కవితను ప్రజల మధ్యకు చొచ్చుకుపోయేటట్టు చేసి ఔననిపించుకున్నవారు కరుణశ్రీ.

నాలుగు, నాలుగున్నర దశాబ్దాల నాడు, కరుణశ్రీఏ ఒక కవితలో “సరస సంగీత సామ్రాజ్య చక్రవర్తి”గా కీర్తించిన ఘంటసాల మధుర కంఠం నుంచి అమృతవాహినిలా జాలువారిన –
“అంజనరేఖ వాల్గనుల యంచులు దాట, మనోజ్ఞ మల్లికా
కుంజములో సుధా మధుర కోమల గీతిక లాలపించు ఓ
కంజదళాక్షీ! నీ ప్రణయ గానములో పులకింతునా – మనో
రంజని! పుష్ప వృష్టి పయిరాల్చి నిమన్ పులకింపజేతునా!”
అనే పద్యంతో మొదలయ్యే కరుణశ్రీ “సాంధ్యశ్రీ”, “అద్వైతమూర్తి” కవితలను విని పులకించని తెలుగువారు ఎవరుంటారు?

అలాగే –
“అది రమణీయ పుష్పవనమా వనమందొక మేడ, మేడపై
నది యొక మారుమూలగది, ఆ గది తల్పులు తీసి మెల్లగా
పదునయిదేండ్లయీడు గల బాలిక; పోలిక రాచపిల్ల, జం
కొదవెడి కాళ్ళతోడ దిగుచున్నది క్రిందికి మెట్ల మీదుగన్”
అని మొదలయ్యే “కుంతీ కుమారి”లో కన్యా మాతృత్వ శోక భారాన్ని ఘంటసాల విషాద మధురంగా వినిపించగా కంటతడి పెట్టని తెలుగువారు ఎవరుంటారు?

పద్యం వ్రాస్తే కరుణశ్రీ వ్రాయాలి. పద్యం పాడితే ఘంటసాల పాడాలి అనేది ఒక నానుడి అయింది. కరుణశ్రీ కవితా మాధుర్యం, ఘంటసాల కంఠ మాధుర్యం – ఆ రెండింటిది ఒక అపూర్వమైన కలయిక. అది తెలుగువారు చేసుకున్న అదృష్టం.

కరుణశ్రీ కవితలో సారళ్య, తారళ్యాల తర్వాత ప్రధానంగా చెప్పవలసింది కరుణ రసావేశం. నవ రసాలలో కరుణపైనే ఆయన మొగ్గు. “ఏకో రసః కరుణ ఏవ” అన్న భవభూతి వాక్కు కరుణశ్రీకి వేదవాక్కు. “కరుణకు, కవికి అవినాభావ సంబంధం” అని, తన కవితకు స్ఫూర్తి కరుణ రసానిదేనని ఆయన స్వయంగా చెప్పుకున్నారు. అందుకే పాపయ్య శాస్త్రి గారు తన కాలం పేరే “కరుణశ్రీ”గా పెట్టుకున్నారు. పరమ కారుణ్యమూర్తి గౌతమ బుద్ధుడిని ఎన్ని కవితలలో కీర్తించారో!!

కరుణశ్రీ కవితలో మరొక ప్రధానమైన పాయ దేశభక్తి. భగత్ సింగ్, అల్లూరి సీతారామరాజు వంటి విప్లవవీరులను, గాంధీ మహాత్ముడిని ఎన్నో కవితలలో చదువరుల హృదయాలను ఉప్పొంగించే ఆవేశంతో ఆయన గానం చేసారు. ముఖ్యంగా “అల్లూరి సీతారామరాజు” కవితలో
“రాచరికంపు రక్కసి కరమ్ములు సాచి అమాయిక ప్రజన్
దోచు పర ప్రభుత్వమును దోచిన రాజుల చిన్నవాడ! వీ
రోచితమైన తావక మహోద్యమమాంధ్ర పురా పరాక్రమ
శ్రీ చరణమ్ములందు విరజిమ్మె నవారుణ విప్లవాంజలుల్”
వంటి పద్యాలు చదివి ఒడలు గగుర్పొడవని పాఠకుడుండడు.

ఇంకా దైవభక్తి ప్రచోదితమైన కవితలు, రాసిక్య ప్రధానమైన కవితలు, సమకాలిక రాజకీయ, సాంఘిక పరిస్థితులకు స్పందించి వ్రాసిన కవితలు, వ్యంగ్య కవితలు కడచిన మూడు, నాలుగు దశాబ్దాలలో కరుణశ్రీ లేఖిని నుంచి పుంఖాను పుంఖంగా వెలువడ్డాయి. పద్య కవిత వ్రాసినా, గద్య కవిత వ్రాసినా కరుణశ్రీ బానీ స్పష్టంగా తెలిసిపోయేది. ఆయనదొక ప్రత్యేక శైలి. అయితే గద్య కవితలో కంటే పద్య కవితలోనే ఆయన ముద్ర ప్రస్ఫుటంగా కనబడేది. “కవనార్థంబుదయించినారము..” అని తిరుపతి వేంకటకవులు అన్నట్టు “పద్యార్థంబుదయించి నాడను..” అని చెప్పుకోగల కవి ఆయన. పద్య కవితకు రోజులు కాని రోజులలో పద్య కవిత వ్రాసి ఓహో అనిపించుకోవడం ఆయనకే చెల్లింది.

తెలుగు పద్యం పట్ల ఆయన మమకారం ఎంతటిదంటే నన్నయ నుంచి దక్షిణాంధ్ర కవుల వరకు గల ఆంధ్ర కవిత్వంలో రమణీయమైన, బహుజన ప్రచారం పొందిన రసవద్ఘట్టాలను “కల్యాణ కల్పవల్లి”గా సంకల్పించి రసిక పాఠక ప్రీతి కావించారు.

మంచి గంధం వంటిది, మల్లెపూల పరిమళం వంటిది ఆయన వ్యక్తిత్వం. ఎవరినీ నొప్పించని మృదు స్వభావం, సరస సంభాషణా చాతుర్యం ఆయన సొత్తు. వక్తగా అనర్గళ వచోధారతో శ్రోతలను ఆకట్టుకోగలిగిన నేర్పరి. భావ కవితా యుగ ప్రభావం ఇంకా వీడని తరానికి చెందిన వారైనా, దానికి భిన్నమైన మార్గంలో నడిచి తన ప్రత్యేకతను నిలబెట్టుకున్న మధురకవి. ఆయన “ఉదయశ్రీ” కవితా సంపుటి – బహుశా తెలుగులో ఇంకే గ్రంథానికి లేనన్ని సార్లు – యాభై ఆరు ముద్రణలు పొందినదంటేనే ఆయన కవిత్వాన్ని తెలుగువారు ఎంతగా ఆదరించారో గ్రహించవచ్చు..ఆయన స్మృతికి నివాళులర్పిద్దాం…