పద్యాలలో సంఖ్యావాచకాలు - 2

పుష్ప గృహ శయ్య పత్ని తాంబూల వస్త్ర
గంధ భూషణా లష్టభోగంబులగును
జగతి ధర్మార్థకామ మోక్షములు నాల్గు
ననిరి పురుషార్థములటంచు నార్యజనులు.

భక్ష్య భోజ్య చోష్య పానీయ లేహ్యాలు
పలుకబడును పంచభక్ష్యములని
పులుసు నుప్పు కారమును జేదు వగరును
దీపు షడ్రుచులని తెలియవలయు.

ధరణి రథ గజ తురగ పదాతిదళము
తనరు చతురంగబలమంచు దానవారి !
తెలియ పంచాంగమనునది తిథియు వార
యోగ నక్షత్ర కరణంబు లుండునదియ.

సూర్యచంద్రులు కుజబుధుల్ సురగురువును
శుక్ర శని రాహు కేతువుల్ జ్యోతిషమున
గ్రహములివి తొమ్మిదై చెల్లు కమలనేత్ర
దేహమును వాఙ్మనస్సులు త్రికరణములు.

అవని శృంగార కరుణ కాంతాద్భుతములు
హాస్య బీభత్స వీరభయానకములు
రౌద్రముంగూడుచో నవరసములగుచు
వెలయు గావ్యంబులందు శ్రీవెంకటేశ