పాటల బాటసారి సుద్దాల

పాటల బాటసారి సుద్దాల

పాటల బాటసారి సుద్దాల అశోక్ తేజ….పుట్టినరోజు మే 16

సుద్దాల అశోక్ తేజ తెలుగు ప్రజలకు కొత్తగా పరిచయం చేయాల్సిన వసరం లేని పెరు. ఆయన తండ్రి సుద్దాల హనుమంతు ప్రజాగాయకునిగా, కవిగా ప్రాచుర్యం పొందారు. సుమారు 1200కి పైగా చిత్రాల్లో 2200 పై చిలుకు పాటలు రాసిన తెలుగు సినిమా కథ, పాటల రచయిత సుద్దాల అశోక్ తేజ పుట్టినరోజు మే 16. ఈ సందర్భంగా ప్రత్యేక కథనం

సుద్దాల అశోక్ తేజ 1960, మే 16 న నల్గొండ జిల్లా, గుండాల మండలం, సుద్దాల గ్రామంలో పుట్టా రు. ఈయన ఇంటిపేరు గుర్రం. ఆయన తండ్రి హనుమంతు ప్రముఖ ప్రజాకవి. తెలంగాణా విముక్తి పోరాటంలో పాల్గొన్నాడు. నైజాం రాజు నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా కమ్యూనిస్టులు జరిపిన ఉద్యమంలో ప్రముఖ పాత్ర పోషించాడు. వీరి స్వంత ఊరు సుద్దాల కాబట్టి ఈయనను అందరూ సుద్దాల హనుమంతు అని పిలిచేవారు. ఆయన గుర్తుగా తన ఇంటి పేరు, తర్వాత తరాలకు కూడా సుద్దాల గా మార్చుకున్నారు.. తల్లి జానకమ్మ. అశోక్ తేజ తల్లిదండ్రులిద్దరూ స్వాతంత్ర్య సమరయోధులు. హనుమంతు 75 సంవత్సరాల వయసులో క్యాన్సర్ వ్యాధితో మరణించాడు. బాల్యం నుంచే అశోక్ తేజ పాటలు రాయడం నేర్చుకున్నారు. సినీ పరిశ్రమకు రాక మునుపు అశోక్ తేజ మెట్‌పల్లిలో తెలుగు ఉపాధ్యాయుడిగా పనిచేస్తుండేవారు.

నమస్తే అన్న చిత్రం ద్వారా తెలుగు సినీ తెరకి పరిచయమయ్యారు. సినీ నటుడు ఉత్తేజ్ కు మేనమామ కావడం వల్ల పరిశ్రమకు పరిచయం కావడం అంత కష్టం కాలేదు. తనికెళ్ళ భరణి లాంటి వారి ప్రోత్సాహంతో సినిమా రంగంలో పాటల ప్రస్థానం ప్రారంభించారు. .అయితే ఆయనకు మంచి బ్రేక్ ఇచ్చింది మాత్రం దాసరి . దాసరి నారాయణరావుని కలవడం. కృష్ణవంశీ లాంటి దర్శకుల సినిమాల్లో మంచి మంచి పాటలు రాశారు. తొలుత తండ్రియైన సుద్దాల హనుమంతు నేపథ్యం వల్ల అన్ని విప్లవగీతాలే రాయాల్సి వచ్చింది. కృష్ణవంశీ లాంటి దర్శకుల ప్రోద్బలంతో తన పాటల్లో అన్ని రసాలు ఒలికించా రు. ఒసేయ్ రాములమ్మా, నిన్నే పెళ్ళాడతా సినిమాలో పాటలతో మంచి పేరు తెచ్చుకున్నారు.

ఆశోక్ తేజ సినీ పరిశ్రమకు వచ్చిన కొత్తలో ప్రజా ఉద్యమ చిత్రాలకు, సమస్యాత్మక చిత్రాలకు మిగిలిన కమర్షియల్ చిత్రాల్లాగనే మంచి ఆదరణ వుండేది. అలా దాసరి నారాయణ రావు గారి దగ్గర ఒసేయ్ రాములమ్మా, కంటే కూతుర్నే కను; కృష్ణ గారి సినిమా ఎన్ కౌంటర్; మోహన్ బాబు గారి అడవిలో అన్న, శ్రీరాములయ్య అతని పాటల మీద ప్రత్యేక ముద్ర వేశాయి. అదే సమయంలో రాఘవేంద్ర రావు ‘రాజకుమారుడు’ లో ‘రామ సక్కనోడమ్మ సందమామ’ పాట, కృష్ణవంశీ గారి ‘నిన్నే పెళ్ళాడుతా’ లో అట్లతద్ది పాట (నా మొగుడు రాంప్యారీ) ప్రేక్షకులకు, పరిశ్రమకు అతనిని మరో కోణంలో పరిచయం చేశాయి.

‘రాజకుమారుడు’ తర్వాత ‘ఒకటో నంబరు కుర్రాడు’ లో ‘నెమలీ కన్నోడ – నమిలే సూపోడ – కమిలీ పోకుండా తాకాలిరో ‘ పాట చాలా పెద్ద హిట్టు. అలాగే ఏయన్నార్, సుమంత్ నటించిన ‘పెళ్ళిసంబంధం’ లో ‘ఆచ్చీ బుచ్చీ ఆటలకు రావే లచ్చీ’ అనే మంచి పాట రాయించారు. ఇవి గాక భక్తిరస చిత్రాల్లో కూడా రాయించారు. ‘శ్రీ రామదాసు’ లో ‘ఏటయ్యిందే గోదారమ్మ’ పాట, ‘షిరిడి సాయి’ లో ‘ఒక్కడే సూర్యుడు ఒక్కడే చంద్రుడు’ పాట – ఇవన్నీ అశోక్ తేజకు ఉండే ముద్ర నుంచి తప్పించి అన్ని పాటలూ రాయగలడన్న అభిప్రాయాన్ని పెంచాయి.

ప్రసిద్ధి చెందిన అశోక్ తేజ పాటలలో కొన్ని….ఆలి నీకు దండమే, అర్దాంగి నీకు దండమే, నేను సైతం (ఠాగూర్), నేలమ్మ నేలమ్మ నేలమ్మా..ఒకటే జననం ఒకటే మరణం (భద్రాచలం), దేవుడు వరమందిస్తే… నే నిన్నే కోరుకుంటానే, నువు యాడికేళ్తే ఆడికోస్త సువర్ణా
ఏం సక్కగున్నావో నా సోట్టసెంపలోడా ( ఝుమ్మంది నాదం), మీసాలు గుచ్చకుండా ‍‍(చందమామ), నీలి రంగు చీరలోన సందమామ నీవే జాణ (గోవిందుడు అందరి వాడేలే)…… ఇలా ఎన్నెన్నో ఉన్నాయి.

పురస్కారాలు
2003 సంవత్సరానికి అశోక్ తేజకు (ఠాగూర్ సినిమాలోని “నేను సైతం” పాటకు) “జాతీయ ఉత్తమ గీత రచయిత” అవార్డు లభించింది. ఇది తెలుగు సినీ గేయ రచయితలకు అందిన మూడవ అవార్డు. అంతకుముందు శ్రీశ్రీకి అల్లూరి సీతారామరాజు సినిమాలో “తెలుగు వీర లేవరా” అనే పాటకు, వేటూరి సుందరరామమూర్తికి (మాతృదేవోభవ సినిమాలో “రాలిపోయే పువ్వా నీకు రాగాలెందుకే” పాటకు) లభించాయి. 2010 అక్టోబరు 13న సుద్దాల ఫౌండేషన్ ను ప్రాంరంభించి తన తల్లిదండ్రుల పేరుతో సుద్దాల హనుమంతు-జానకమ్మ పురస్కారంను ఏర్పాటుచేసి ప్రతి ఏటా ఒకరికి పురస్కారాన్ని అందజేస్తున్నారు.

‘అమ్మ ఒడి పండగ’ అని ప్రతి సంవత్సరం జనవరి నుంచి డిసెంబర్ లోపల సంతానవతులైన తల్లులకు, పుట్టిన పిల్లలకు బట్టలు పెట్టి ఊరందరి చేతా సన్మానం చేయించి వచ్చిన వారందరికీ భోజనాలు పెడుతున్నారు. ఈ అమ్మ ఒడి పండగ ఇప్పటిదాకా – సుద్దాల, పల్లె పహాడ్, బ్రాహ్మణపల్లి లో చేశారు. ఈ రెండు కార్యక్రమాలూ ప్రతి ఏటా జరుగుతాయి. ఇందుకు తన సంపాదనలో కొంత భాగాన్ని పక్కన పెడుతూంటారు. ఇందువల్ల పల్లెల్లో ఒకరంటే ఒకరికి అనురక్తి కలుగుతుంది. మానవ సంబంధాలు మెరుగుపడతాయి. మనిషి జన్మ ఎత్తినందుకు , అంతటి మహానీయుల కడుపున పుట్టినందుకు ఇది కనీస ధర్మం అనుకుంటున్నానని సుద్దాల అశోక్ తేజ ఎంతో ఆనందంగా చెబుతారు.

ఆస్ట్రేలియా పర్యటన – 2012

ఆస్ట్రేలియాలో 2012 వ సంవత్సరం ఉగాది సందర్భంగా శ్రీ అశోక్ తేజ గారు రావడం జరిగింది.  వారు ఇక్కడికి వచ్చిన సందర్భంగా వారి జీవితంలో జరిగిన ఎన్నో సంగతులు ఇక్కడి తెలుగువారితో పంచుకున్నారు.  తెలుగుమల్లి ఆస్ట్రేలియా మరియు న్యూ జిలాండ్ తెలుగువారి తరఫున పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలుపుకుంటుంది.

Send a Comment

Your email address will not be published.