పశ్చిమ బెంగాల్లో విచిత్రా అనే ఒక సాహితీ సంస్థ ఉండేది. అది విశ్వకవి రవీంద్రనాథ్ టాగూర్ ఆధ్వర్యంలో నడిచేది. ఆ సాహితీ సంస్థ క్రమం తప్పకుండా సాహితీకార్యక్రమాలను నిర్వహిస్తూ ఉండేది. ఆ కార్యక్రమాలలో సాహితీవేత్తలు తమ తమ రచనల గురించి వినిపించేవారు. చర్చించుకునే వారు.
ఆ కార్యక్రమాలు విశ్వకవి టాగూర్ ఇంట్లోనే నిర్వహించేవారు…. కార్యక్రమానికి వచ్చే వాళ్ళందరూ సమావేశం జరిగే హాలు ప్రవేశ ద్వారం వద్ద తప్పనిసరిగా చెప్పులు విప్పి లోపలికి రావాలి. కొన్ని సార్లు కొత్త చెప్పులు చోరీకి గురయ్యేవి. అప్పుడు పోయిన కొత్త చెప్పుల కోసం కొందరు గోల పెట్టేవారు.
విశ్వకవి మిత్రుడు శరత్ చంద్ర కూడా ఒక గొప్ప రచయితే….ఆయన కూడా సమావేశాలకు వస్తుందే వారు. ఆయన ఖరీదైన చెప్పులు వేసుకునే వారు.
ఓ మారు ఆయన సాహితీ కార్యక్రమానికి వచ్చినప్పుడు గది ప్రవేశద్వారం వద్ద చెప్పులు విప్పడానికి జానకి వాటిని విప్పి ఒక కాగితంలో చుట్టి చేత్తో పట్టుకుని లోపలకు వచ్చారు. ఈ విషయాన్ని ఒకరు చూడనే చూసారు.
సభ ప్రారంభమైంది. ప్రసంగాలు రసవత్తరంగా సాగుతున్నాయి. శరత్ చంద్ర చెప్పుల పొట్లం తో హాల్లోకి రావడం చూసిన ఒకరు విశ్వకవి వద్దకు వెళ్లి ఆయన చెవిలో రహస్యంగా శరత్ చంద్ర విషయం చెప్పారు.
ప్రసంగం మధ్య విశ్వకవి లేచి “శరత్, మీ చేతిలో ఉన్న ఆ పొట్లం ఏమిటీ? అని అడిగారు.
అప్పుడు శరత్ “అదా…అదీ…అదీ” అని సాగదీస్తుంటే …
విశ్వకవి టాగూర్ “ఏమిటీ చెప్పడానికి ఆలోచిస్తున్నారు…అది మరీ విలువైనదైతే చెప్పక్కరలేదులే” అన్నారు.
శరత్ చంద్ర “అవును…అది విలువైన పుస్తకం…” అని విషయం మళ్లిద్దామనుకున్నారు.
కానీ విశ్వకవి ఆగలేదు.
“ఓహో అది పాదుకా (చెప్పులు) పురాణమా?” అని టాగూర్ అనగానే హాలు హాలంతా నవ్వుల్లో మునిగిపోయింది.
– యామిజాల జగదీశ్