పుడమి తల్లి పరవశించిన వేళ...

Kavitastraliya book2018ప్రాశ్చాత్య దేశంలో మా ఊరి సంగతులని మనసున్న కవులు మన భాషలో పదిమందితో పంచుకోవాలన్న ఆరాటం. అమ్మ నాన్నల సంగతి అ ఆ ఇ ఈ లతో అందరినోటా పలికించి పులకరించిపోవాలన్న మమకారం. వలపు తలపుల తలుపులు తెరచి మల్లెల మాలలు అల్లి మరువలేని మధుర కవితలను మనకందించిన మకరందం. మధుర భావాల మాటల మూటలు మంచి మనసుతో వ్రాసి మధుర గుళికలుగా మదిని మురిపింపజేసిన మంజీర నాదం. తన మాట ఇంకొకరికి పూల బాటగా మారాలని పాటల పల్లవులు పదిలంగా వ్రాసిన ప్రజా నినాదం. ఇతిహాసాలు, పురాణాలు, ప్రభంధాలు, కావ్యాలు ఔపోసనపట్టి కాచి వడగట్టిన విశేర్ణవాలను విశదీకరించి విరాజిల్లిన అరవిరిసిన మందారం.

ఆస్ట్రేలియా మరియు న్యూ జిలాండ్ దేశాల తెలుగువారి ప్రస్థానంగా తీర్చిదిద్దిన ముచ్చటైన మూడవ సంకలనం “కవితాస్త్రాలయ – 2018” ఎన్నో అంశాలను తనలో కలబోసుకొని రెండు దేశాలలోని తెలుగువారి దశాబ్దాల చరిత్రను సంక్షిప్తంగా ఒక ఆరోహణా క్రమంలో అక్షర రూపమిచ్చి అందరికీ తెలియజేయడం ఎంతో ముదావహం. రచయితలు వారి అనుభవాలను ఆలోచనలుగా మలిచి భావకవితలుగా భావితరాలకు అందివ్వాలన్న తపన ఈ పుస్తకరూపంలో రావడం ఇక్కడి తెలుగువారి అకుంఠిత దీక్షకు తార్కాణం. ఇదివరకెన్నడూ లేనంతగా ఆస్ట్రేలియాలోని పలు రాష్ట్రాలనుండి వైవిధ్యమైన అంశాలతో, న్యూ జిలాండ్ లోని ప్రధాన నగరం ఆక్లాండ్ నుండి మరికొంతమంది తెలుగు భాషపైనున్న అభిమానంతో మధురమైన కవితలు, కధలు, కధానికలు, గేయాలు, కార్టూన్లు పంపి ఈ పుస్తకాన్ని తెలుగుదనానికి నిలువెత్తు నిండుదానాన్ని చేకూర్చారు.

మనసు కవులు, సుకవులు, భావ కవులు ఎంతోమంది వారిలోని భాషా పరిజ్ఞానానికి సాన పట్టి తమ శాయశక్తులా కృషి చేసి వారి మనోభావాలకు అక్షర రూపం ఇచ్చి ఈ సాహితీ సంకలనానికి చేయూతనిచ్చారు. అందరికీ పేరుపేరునా వందనాలు. ‘ఆస్ట్రేలియాలో తెలుగు వారి ప్రస్థానం’ వ్యాసాన్ని పలుమార్లు చదివి తగిన సూచనలిచ్చిన మిత్రులు శ్రీ సారధి మోటమర్రి గారికి ప్రత్యేక కృతజ్ఞతలు. ఈ సంకలనంలో పలువురు క్రొత్తవారు క్రొంగొత్త శైలిలో వారి రచనలను వ్రాసి భావితరాలకు స్పూర్తినందించారు. వారికీ కృతజ్ఞతాభినందనలు.

ఆంధ్ర ప్రదేశ్ శాసనసభ ఉప సభాపతి, జాతీయవాదం, గాంధేయవాదం కలగలిపిన మనిషి మరియు తెలుగు భాషాభిమాని శ్రీ మండలి బుద్ధ ప్రసాద్ గారు అడిగిన వెంటనే ఈ పుస్తకానికి ముందుమాట వ్రాయడం మా అదృష్టం. వారికీ కృతజ్ఞతాభినందనలు.

ఆస్ట్రేలియాలో మొదటిగా వచ్చిన తరంవారు, తమ సాహితీ పిపాసతో తన కలానికి కాలంతో పనిలేక కవన ధారలు కురిపిస్తున్న భువనవిజయానికి ఆప్తులు శ్రీ దూర్వాసుల మూర్తి గారు ఆప్త వాక్యం వ్రాయడం మాకెంతో ఆనందకరం. వారికీ ఆత్మీయ భావంతో కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాము.

ఈ పుస్తకం ప్రత్యేకంగా శ్రీ వంగూరి ఫౌండేషన్, లోక్ నాయక్ ఫౌండేషన్ మరియు ఆస్ట్రేలియా తెలుగు సంఘం వారు సంయుక్తంగా నిర్వహిస్తున్న 6వ సాహితీ సదస్సులో ఆవిష్కరించడానికి అనుమతినిచ్చినందుకు సదస్సు నిర్వాహకులందరికీ పేరు పేరునా కృతజ్ఞతాభినందనలు.

ఈ పుస్తక ప్రచురణకు ఆర్ధిక సహాయం అందించిన SVN ENGINEERING PTY LTD అధినేతలు శ్రీమతి ఉషా శ్రీదేవి శ్రీధర మరియు కరుణాకర్ శ్రీధర గార్లకు కృతజ్ఞతలు.

ఎన్నో గంటల సమయం వెచ్చించి లోపల పేజీలలోని బొమ్మలు సమకూర్చిన శ్రీ నరసిం గారికి, ఈ పుస్తకంలోని వ్యాసాలన్నిటికీ DTP వర్క్ చేసిన శ్రీ పద్మాకర్ చతుర్వేదుల గారికి కృతజ్ఞతాభినందనలు. ఈ పుస్తక ప్రచురణకు సహాయం చేసిన నవ తెలంగాణా ప్రింటర్స్ ప్రైవేట్ లిమిటెడ్ వారికి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాము.

ఆస్ట్రేలియా మరియు న్యూ జిలాండ్ తెలుగు వారి జీవనవిధానానికి దర్పణంగా ముఖ చిత్రం తీర్చి దిద్ది స్వయంగా చిత్రీకరించిన నా అర్ధాంగి ప్రత్యూషకు హృదయపూర్వక కృతజ్ఞతలు.

చివరిగా మా ఆప్త మిత్రుడు, రచయిత, కవి శ్రీ శంకు గణపతి రావు గారు అహర్నిశలూ కష్టపడి ఈ సంకలనం కావ్యరూపం దాల్చడానికి ఎంతో సహాయ సహకారాలు అందించారు. వారికీ గౌరవ భావంతో కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాము.

ప్రతులకు: contact@telugumalli.com

మల్లికేశ్వర రావు కొంచాడ
ఆస్ట్రేలియా భువనవిజయ సమన్వయకర్త

Send a Comment

Your email address will not be published.