పెద్ద పండుగ

సంక్రాంతి లక్ష్మితో కళకళలాడే పల్లెసీమలు

పెద్ద పండుగంటే అచ్చంగా పెద్ద పండుగే. భోగీ, సంక్రాంతి, కనుమ, ముక్కనుమ……

Makar-Sankranti-ఉత్తరాయణ పుణ్యకాలంలో మార్గశిర పుష్యమాసాలలో సంక్రాంతి వస్తుంది. సూర్యుడు ఒక్కో నెలలో ఒక్కో రాశిలోనికి వస్తూ మకర రాశిలో ప్రవేశిస్తాడు. అలా సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశించడాన్ని మకర సంక్రమణం అంటారు. మన పూర్వులు సూర్యుని సంచారాన్ని రెండు భాగాలుగా విభజించారు. సూర్యుడు భూమధ్యరేఖకు ఉత్తర దిశలో ఉన్నప్పుడు ఉత్తరాయణమని, దక్షిణ దిశలో ఉన్నప్పుడు దక్షిణాయణమని అంటారు.

దక్షిణాయణంలో విపరీతంగా కురిసిన వానలు, ప్రకృతిలోని ఒడిదుకులు వల్ల శారీరకంగా అనేక మార్పులు వచ్చి వ్యాధులు వ్యాపించి ప్రజలు ఇబ్బందులకు గురవుతారు.

ఉత్తరాయణంలో వానలు తగ్గి, చలి ఎండ మిశ్రితమైన ఆనందకరమైన వాతావరణం ఏర్పడుతుంది. ప్రకృతిలో నూతన తేజం కనిపిస్తుంది. ఈ మకర సంక్రమణానికి ఎంతో ప్రాధాన్యం ఉంది. ఈ కాలంలోనే సూర్యుని బలం అధికంగా ఉంటుంది. సూర్యుడు తన ప్రచండ కిరణాలతో ప్రపంచంలోని సర్వ ప్రాణుల యొక్క ద్రవరూపమైన సౌమ్య భాగాన్ని ఎండిస్తాడు.

ఎన్ని సంక్రాంతులున్నా సౌరమాన ఖగోళ విజ్ఞాన ప్రశస్తమైనది. ఈ సంక్రాంతి పర్వదినాన సంప్రదాయవాదులందరూ తమ ఇళ్ళల్లో యమ, రుద్ర, ధర్మ దేవతలకు ప్రతీకలుగా మూడు కలశాలు ప్రతిష్టించి బ్రహ్మ విష్ణు మహేశ్వరులకు పూజ చేస్తారు.

ఇంతకూ సంక్రమణం అంటే ఏంటీ….సంక్రమణం అంటే ఒక చోటి నుంచి మరో చోటికి జిరిగే మార్పు అని అర్థం. సూర్యుడు ఒక రాశి నుంచి మరో రాశిలోనికి మారడాన్ని కదలడాన్ని సంక్రమణం అంటారు. జనసామాన్యంలో మకర సంక్రాంతికి బహుళ ప్రాచుర్యం ఉంది. మకర సంక్రాంతి అంటే సూర్యుడు తన నిరంతర కాల ప్రయాణంలో ఏ రోజైతే ధనుస్సురాశిని విడిచిపెట్టి మకరరాశిలోకి ప్రవేశిస్తాడో ఆ రోజును మకర సంక్రాంతిగా జరుపుకోవడం కద్దు.
ఇక అప్పటి వరకూ దక్షిణాయణంగా ఉన్న కాలం సంక్రాంతి సమయంలో ఉత్తరాయణ పుణ్యకాలంగా మారుతుంది. కేవలం మకరరాశి ప్రవేశానికే కాకుండా రవి ప్రతి రాశిలో ప్రవేశించే కాలం ఎంతో ముఖ్యమైందని ప్రాచీన గ్రంథాలు తెలుపుతున్నాయి.

ఇక గొబ్బి దేవతకు కన్నెపిల్లలు స్వాగతం పలుకుతారు. పల్లెపడుచులు పాడుకునే గొబ్బి పాటలు ప్రముఖ వాగ్గేయకారులను సైతం ఆకర్షిస్తాయి. పేడ ముద్దలు చేసి ముగ్గుల మధ్యన గుమ్మాల పక్కన పెట్టి వాటికి పసుపు, కుంకుమ, అద్ది పిండితో ముగ్గు చేసి చామంతి, బంచి, బీర, గుమ్మడి పూలతో అలంకరిస్తారు. వీటినే గొబ్బెమ్మలు అంటే గౌరీదేవిగా పూజిస్తారు. సాయంత్రం వేళల్లో గొబ్బెమ్మలు చుట్టూ చేరి చప్పట్లు కొడుతూ ఎంతో ఉత్సాహంగా పాటలు పాడుతారు. ఈ ఆటపాటలు అయ్యాక పసుపు కుంకుమలతో పాటు పెసరపప్పు, శనగలు, సంక్రాంతి రోజున నువ్వులు దానమివ్వడం ఆచారం.

హేమంతంలోని చల్లదనానికి క్రిమికీటకాలు స్వేచ్ఛగా విహరిస్తాయి. పైగా దక్షిణాయనపు మలి రోజులలో సూర్యుడు భూమికి దూరంగా ఉండడం వల్ల ఆయన వేడిమితో క్రిమికీటకాలు నశించే అవకాశం అంతగా ఉండదు. అందుకే వివిధ ఆచారాలను ఈ పండుగకు అనుసంధానంగా ధనుర్మాసం నుండి ఏర్పాటు చేస్తారు.

ఇక ఈ పండుగ ప్రత్యేకత ఏంటంటే ముగ్గులతో వాకిళ్ళన్నీ కళకళలాడుతాయి. చాలా చోట్ల రంగువల్లల పోటీలు పెడతారు కూడా. సంక్రాంతి నెల ముందు నుంచీ రంగు రంగుల ముగ్గులు వేస్తూ వస్తారు. భోగీ, సంక్రాంతి రోజులలో మాత్రం పద్మాల ముగ్గులు వేస్తారు. మకర సంక్రాంతికి సాదరంగా రథంపై వీడ్కోలు పలికేటట్లుగా ఉండే రథం ముగ్గును కనుమ రోజున వేస్తారు. పేడ నీళ్ళతో గృహ ప్రాంగణాన్ని అలికి శుభ్రం చేసి గుల్ల సున్నపు పిండితో ముగ్గులు వేస్తారు.

ఇలా ఉండగా, కనుమ అంటే రైతన్నలకు అత్యంత ప్రీతికరం. వారి బిడ్డలకు ఏ లోటు లేకుండా పాడిని అందించే గోమాతను వ్యవసాయపనులలో రైతన్నకు చేదోడు వాదోడుగా ఉంటూ చివరకు ధాన్యపుకాశులను ఇంటికి చేరుస్తారు. బసవన్నకు పూజలు చేస్తారు. ఈ రోజున పెద్దలు, పిన్నలు పోటీ పడుతూ వారి వారికి అనుకూలమైన పరిమాణంలో ప్రభలను కట్టి వాటిపై పార్వతీపరమేశ్వరుల ప్రతిమలు ఉంచి ఇరుగు పొరుగు గ్రామాల వారితో కలిసి ఒకచోట చేరుతారు. మరుసటి రోజు ముక్కనుమ నిర్వహిస్తారు. ఈ నాలుగో రోజున కొత్తగా పెళ్ళయిన ఆడపిల్లలు సావిత్రి గౌరీవ్రతం అంటే బొమ్మల నోము పడతారు. దేవిని తొమ్మిది రోజులు పూజించి తొమ్మిది పిండి వంటలతో రోజూ నివేదన చేసి పిదప ఆ మట్టి బొమ్మలను పుణ్య తీర్థంలో నిమజ్జనం చేస్తారు.

ఇంతటి విశిష్టమైన పండుగ వింతశోభలు తిలకించాలంటే పల్లె సీమలకు వెళ్ళవలపసిందే.

కనుక చక్కని ఆనందాన్ని మనకు అందించే సంక్రాంతి పండుగలు మనం జరుపుకుని మహారాణిలా వచ్చే ఈ సంక్రాంతి లక్ష్మికి మనమందరం ఘనంగా ముంగిట్లోకి ఆహ్వానం పలుకుదాం.

Send a Comment

Your email address will not be published.