ప్రతి ఓ జ్ఞాపకం.. ఓ చాయా చిత్రం

ప్రతి ఓ జ్ఞాపకం.. ఓ చాయా చిత్రం

ఆగస్టు 19 ప్రపంచ ఫొటోగ్రఫీ దినోత్సవం.

వేల మాటలు చెప్పలేని భావాన్ని ఓ చాయాచిత్రం చెబుతుంది. జ్ఞాపకాల్ని కళ్లముందు నిలబెట్టే అద్భుతం చాయాచిత్రం చిన్నప్పటి నుంచి దిగిన ఫోటోలు కానీ, అందమైన దృష్యాల వెనుక ఓ జ్ఞాపకం, ఓ కథ , ఓ అనుభూతి దాగుంటుంది. ఇన్ని అందమైన గుర్తులను మదిలో ముద్రించే ఈ ఫొటోగ్రఫీ కోసం ప్రపంచవ్యాప్తం గా ఓ ముఖ్యమైన రోజు ఉంది. అదే ఆగస్టు 19 ఈ రోజే ప్రపంచ ఫొటోగ్రఫీ దినోత్సవం…

ఫోటో… వర్తమాన అంశాలని భవిష్యత్ తరాలకు అందిస్తుంది. మధుర జ్ఞాపకాలని తరతరాలకి భద్రపరుస్తుంది. పండుగలు ,పబ్బాలు, వివాహాలు, వేడుకలు, విహారాలు, విషాదాలు, సభలు, సాంస్కృతిక సందర్భాలు, సాహసాలు .. అన్నిటికీ ఫోటో సాక్ష్యంగా నిలుస్తుంది. ఓ ఫోటో చూస్తే ఎంతోకాలం మదిలో ముద్రించుకు పోతుంది. ప్రతి ఫోటో వెనుక ఓ జ్ఞాపకం.. ఓ కథ.. ఓ అనుభూతి.. దాగుంటుంది. అలనాటి జ్ఞాపకాల్ని మళ్ళీ మళ్ళీ తనివితీరా వీక్షించుకునే అవకాశాన్ని ఇచ్చే తీపిగురుతులు ఫొటోలు మాత్రమే. అందుకనే నేటి దైనందిన జీవితంలో ఫొటోగ్రఫీ ఒక భాగంగా మారింది.

శతాబ్ద కాలంగా ఫోటోలు తీయడం ఎన్నో దశలు దాటుతూ వస్తోంది. ఫోటోగ్రఫీకి ప్రధానం గా కావాల్సింది సృజనాత్మకత. కెమెరా కన్ను ఉండాలి. చాలా రోజులు బ్లాక్ అండ్ వైట్ ఫోటోలదే పై చేయి.. ఇప్పటికి కొన్ని ఫోటోలు బ్లాక్ అండ్ వైట్ లోనే బావుంటాయి. ఎప్పటికప్పుడు వస్తున్న అధునాతన టెక్నాలజీ తో ఫోటోగ్రఫీ లో ఎన్నో విప్లవాత్మక మార్పులు వస్తున్నాయి. మార్పులు ఎన్ని వచ్చినా జీవితం లో ఫోటోది విడదీయలేని బంధమే. స్మార్ట్ ఫోన్ లు వచ్చాక ఫోటోగ్రఫీ మరీ తేలిక అయింది. ఇక సెల్ఫీ ఫోటోగ్రఫీ కొత్త పుంతలు తొక్కుతుంది. .కొన్ని సందర్భాలలో సెల్ఫీల విపరీత పోకడల తో ప్రమాదాలు కూడా జరుగుతున్నాయి. ఏది ఏమైనా ఫోటోగ్రఫీ వృత్తి, ప్రవృత్తి గా మారిపోయింది.

ప్రపంచవ్యాప్తంగా ఆగస్టు 19 తేదీన ‘ప్రపంచ ఫొటోగ్రఫీ దినోత్సవాన్ని ఎందుకు జరుపుకొంటారంటే…. ఆధునిక ఫొటోగ్రఫీ ప్రక్రియ అయిన ‘డాగ్యుర్రె టైప్‌’ ను కనుగొనడం ఈ ఫొటోగ్రఫీ దినోత్సవానికి మూలం. ఈ ప్రక్రియను లూయిస్‌ జాకురెస్‌ డాగ్యుర్రె అభివద్ధిపరిచాడు. మొట్టమొదటి సారిగా ఛాయాచిత్రాలను తయారుచేయటానికి శ్రీకారం చుట్టింది ఫ్రాన్స్‌ దేశానికి చెందిన లూయిస్‌ జాకురెస్‌ డాగ్యుర్రె. 1553లో బిఫోర్ట్‌ అనే సాధరణ వ్యక్తి కెమెరాను కనిపెట్టాడు. అయితే లూయిస్‌ డాగ్యుర్రె మొదట గాజు పలకపై కొన్ని రసాయనాలను పోసి, ఛాయాచిత్రాన్ని రూపొందించాడు. అది 1839 ఆగస్టు19న కావడంతో ఆనాటి నుంచి ప్రపంచ వ్యాప్తంగా ‘ఫోటోగ్రఫీ దినోత్సవం’ నిర్వహిస్తున్నారు.

ఫోటోగ్రఫీ లేదా ఛాయాగ్రహం అనేది కాంతి లేదా ఇతర విద్యుదయస్కాంత వికిరణాలను భద్రపరచటంతో బాటు రసాయనిక చర్యలతో కాంతి సూక్ష్మాలని గుర్తించే ఛాయాగ్రాహక చిత్రం. సాధారణంగా ఒక వస్తువు పై ప్రసరించే కాంతిని గాని, లేదా ఒక వస్తువు నుండి వెలువడుతున్న కాంతిని గానీ ఒక కటకంతో దృష్టిని కేంద్రీకరించి, కెమెరాలో ఉండే కాంతిని గుర్తించే ఉపరితలం పై నిర్దిష్ట సమయం వరకూ బహిర్గతం చేయటంతో ఆ వస్తువుల నిజ ప్రతిబింబం సృష్టించటం జరుగుతుంది.

ఫోటోగ్రఫీ(ఛాయాచిత్రకళ) విభిన్న సాంకేతిక ఆవిష్కారాల కలయికల ఫలితం. ఫోటోగ్రాఫ్ ల తయారీకి చాలా కాలం ముందే చైనీసు తత్త్వవేత్తలు, గ్రీకు గణిత శాస్త్రవేత్తలు అరిస్టాటిల్, యూక్లిడ్ 4వ, 5వ శతాబ్దాలలోనే సూదిబెజ్జం కెమెరా ల గురించి ప్రస్తావించారు. 6వ దశాబ్దంలో బైజాంటీన్ గణిత శాస్త్రవేత్త ఆంథెమియస్ ఆఫ్ ట్రాల్లెస్ తన ప్రయోగాలలో ఒక చీకటి డబ్బాని ఉపయోగించాడు. ఇబ్న్ అల్-హెథం (అల్ హసన్) కూడా చీకటి డబ్బాలని, పిన్ హోల్ కెమెరాలని అధ్యయనం చేశాడు. ఆల్బర్ట్ మ్యాగ్నస్ సిల్వర్ నైట్రేట్ ని కనుగొనగా, జార్జెస్ ఫ్యాబ్రీషియస్ సిల్వర్ క్లోరైడ్ ని కనుగొన్నాడు.

తొలి కెమెరాల ఫోటోగ్రఫి 19 వ శతాబ్దం మధ్యలో కలర్ ఫోటోగ్రఫీ పై పరిశోధనలు జరిగాయి. తొలినాళ్ళలో కలర్ పై ఈ ప్రయోగాలకు చాలా ఎక్కువ నిడివి గల ఎక్స్పోజర్ లు అవసరమయ్యేవి. పైగా తర్వాత ఈ కలర్ ఫోటోలు తెల్లని కాంతికి బహిర్గతం అయిన తర్వాత ఆ రంగు వెలసిపోకుండా అట్టే దీర్ఘకాలం మన్నేలా ఉంచలేకపోయాయి. 1855లో స్కాటిష్ భౌతిక శాస్త్రవేత్త జేంస్ క్లర్క్ మ్యాక్స్వెల్ కనుగొన్న మూడు రంగుల వేర్పాటు సిద్ధాంతాని ఉపయోగించి 1861 లో మొట్టమొదటి శాశ్వత కలర్ ఫోటోని తీశారు. ఒకే వస్తువు యొక్క మూడు వేర్వేరు బ్లాక్ అండ్ వైట్ ఫోటో లని ఎరుపు, ఆకుపచ్చ, నీలం రంగు ఫిల్టర్ ల ద్వారా తీయడంతో వీటిని ఉపయోగించి కలర్ ఫోటోగ్రాఫ్ పునఃసృష్టికి దోహదపడే మూడు ప్రాథమిక ఛానెల్ లు ఏర్పడతాయి.

చిత్రాల పారదర్శక ప్రింటులను అదే విధమైన ఫిల్టర్ ల ద్వారా ప్రొజెక్షన్ స్క్రీన్ పై ఒక దాని పై ఒకటి వేయడంతో వాటి పై రంగు పునరుత్పత్తి అయ్యేది. దీనినే అడిటివ్ మెథడ్ ఆఫ్ కలర్ రీప్రొడక్షన్ అని అంటారు. కాగితం పై చిత్రం యొక్క కార్బన్ కాపీలని కాంప్లిమెంటరీ కలర్ లలో ఒకదాని పై మరొకటి ముద్రించటం 1860లో లూయీస్ డుకోస్ డు హారోన్ అనే ఫ్రెంచి ఫోటోగ్రఫర్ కనుగొన్నాడు. దీనినే సబ్ట్రాక్టివ్ మెథడ్ ఆఫ్ కలర్ రీప్రొడక్షన్ అని అంటారు. రష్యన్ ఫోటోగ్రఫర్ సెర్గేయ్ మిఖాయిలోవిఖ్ ప్రోకుడిన్ – గోర్స్కి ఈ పద్ధతిని విరివిగా ఉపయోగించాడు. దీనితో బాటు మూడు కలర్ ఫిల్టర్డ్ చిత్రాలని ఒకదాని తర్వాత ఒకటి అబ్లాంగ్ ప్లేట్ యొక్క వేర్వేరు ప్రదేశాలపై బహిర్గతం చేసే ఒక ప్రత్యేకమైన కెమెరాని వినియోగించి కలర్ ఫోటోలని సృష్టించే ప్రయత్నం చేశాడు. కానీ నిలకడ లేని వస్తువుల వలన ఫోటోలు ముద్రించిన తర్వాత సరిగా వచ్చేవి కావు. ముందుగా లభ్యమయ్యే ఫోటోగ్రాఫిక్ ఉపకరణాలలో ఫోటో సెన్సిటివిటీలో ఉన్న పరిమితుల వలన కలర్ ఫోటోగ్రఫీ ముందుకు సాగటంలో అడ్డంకులు ఏర్పడ్డాయి.

1873 లో జర్మను ఫోటోకెమిస్ట్ హెర్మన్ వోగెల్ ఆకుపచ్చ, పసుపుపచ్చ, ఎరుపు రంగులని గుర్తించగలిగే డై సెన్సిటైజేషన్ అనే ప్రక్రియను కనుగొన్నాడు. ఫోటోగ్రఫిక్ మిశ్రమాలలో, కలర్ సెన్సిటైజర్ లలో వచ్చిన పురోగతి దీర్ఘ కాలిక ఎక్స్పోజర్ అవసరాన్ని తగ్గించి కలర్ ఫోటోగ్రఫీని క్రమంగా వాణిజ్య రంగం వైపు మరల్చింది. 1907 లో లూమియర్ సోదరులచే కనుగొనబడ్డ ఆటోక్రోం అనే కలర్ ఫోటోగ్రఫీ ప్రక్రియ వాణిజ్యపరంగా విజయవంతమైనది. ఈ ప్లేట్లలో రంగులు అద్దిన బంగాళాదుంపల గంజితో చేసిన గింజలని మొజాయిక్ కలర్ ఫిల్టర్ గా ఉపయోగించటం వలన, మూడు రంగులలోని వివిధ భాగాలని సూక్ష్మ చిత్ర కణాలుగా ఒకదాని ప్రక్కన ఇంకొకటిగా బంధించేలా చేసేది. రివర్సల్ ప్రాసెస్ అనే చర్యని ఆటోక్రోం ప్లేట్లపై జరిపిన తర్వాత పాజిటివ్ ట్రాన్స్పరెన్సీ ఉత్పత్తి అయ్యి ఈ గింజలు ప్రతియొక్క కణాన్ని సరియైన రంగుతో, ఏకీకరించిన చిన్న చిన్న బిందువులుగా కంటికి కనబడి సబ్జెక్టు యొక్క రంగును సంకలిత పద్ధతి ద్వారా సంశ్లేషించేవి. 1890 నుండి 1950 వరకు సంకలిత పద్ధతిలో అమ్మకాలు జరిగిన అనేక రకాలైన స్క్రీన్ ప్లేట్లు, ఫిలింలలో ఆటోక్రోం ప్లేట్లు ఒక రకం.

1935 లో కోడాక్ మొట్టమొదటి కలర్ ఫిలిం (ఇంటెగ్రల్ ట్రైప్యాక్ లేదా మోనోప్యాక్) ని కోడాక్రోం పేరుతో పరిచయం చేసింది. కలర్ లోని మూడు వివిధ భాగాలని పలు పొరల మిశ్రమం ద్వారా పంపి చిత్రాన్ని బంధించేది. మొదటి పొర వర్ణ విశ్లేషణము లోని ఎరుపు ఆధిక్యతని, మిగిలిన రెండు పొరలు ఆకుపచ్చ, నీలం లని మాత్రం బంధించేవి. ఫలితంగా ప్రత్యేకమైన ఏ ఫిలిం ప్రాసెసింగ్ అవసరం లేకుండానే మూడు బ్లాక్-అండ్-వైట్ చిత్రాలు ఒక దాని పై ఒకటి పడేవి. అయితే వీటిని పరిపూర్ణం చేసే సయాన్, మజెంటా, పసుపుపచ్చ వర్ణ చిత్రాలు, ఈ పొరల్లో కలర్ కప్లర్ లని చేర్చే క్లిష్టమైన ప్రాసెసింగ్ విధానాలతో సృష్టించబడేవి. ఇదే విధంగా అగ్ఫా యొక్క అగ్ఫా కలర్ న్యూ 1936 లో రూపొందించబడింది. అయితే ఫిలిం తయారీ సమయంలోనే పొరల మిశ్రమంలో కలర్ కప్లర్ లని చొప్పించడంతో ఫోటోలకి రంగులు అద్దే ప్రకియ మరింత సులభం అయినది. ప్రస్తుతం లభించే కలర్ ఫిలింలు ఇప్పటికీ అగ్ఫా పలు పొరల నియమావళిని ఇంచు మించుగా అనుసరించి ఉత్పత్తి అవుతున్నాయి. ఒక ప్రత్యేకమైన కెమెరాలో ఎక్స్పోజరు తర్వాత ఒకటి లేదా రెండు నిముషాల వ్యవధి లోనే పూర్తి స్థాయి కలర్ ప్రింటుని ఇచ్చే ఇన్స్టంట్ కలర్ ఫిలింని 1963 లో పోలరాయిడ్ కనుగొన్నది.

ఇలా ఫోటోగ్రఫీ రోజుకో కొత్త పుంతలు తొక్కుతూ అధునిక రంగంలో దూసుకెళ్తోంది. 1901లో మార్కెట్లోకి ”కొడక్‌ బ్రౌనీ” రావడంతో ఎవరైనా ఫోటోలు తీసుకోవడానికి వీలైన పరిజ్ఞానం అందుబాటులోకి వచ్చేసింది. తొలి డిజిటల్‌ స్కానింగ్‌ ఫోటోగ్రాఫ్‌ 1957లో మొదలైంది. డిజిటల్‌ స్కానింగ్‌ ప్రక్రియను ‘రస్కెల్‌ ఎ కిర్స్చ్‌’ అనే కంప్యూటర్‌ పరిజ్ఞాని కనుగొన్నాడు. కెమేరా ఇమేజ్‌లను కంప్యూటర్‌లోకి ఫీడ్‌ చేశాడు. తొలి కలర్‌ ఇమేజ్‌ను 1861లో ఫోటోగ్రాఫ్‌ చేసినా, కలర్‌ ఫోటోగ్రఫీపై 19వ శతాబ్ధి అంతా పరిశోధన కొనసాగింది. దశాబ్ధాలు గడిచేకొద్దీ రకరకాల కెమేరాలు అందుబాటులోకి వచ్చేశాయి. ఇలా నేడు అరచేతిలో ఇమిడిపోయి, కనురెప్ప పాటులో ‘క్లిక్‌’ అనిపించే ఫోటోగ్రఫీ వెనుక ఎందరో శాస్త్రవేత్తల శ్రమ దాగి ఉంది. ప్రస్తుతం ఫోటోగ్రఫీ చేయితిరిగిన ఫోటోగ్రాఫర్లకే పరిమితం కావడం లేదు. అందర్నీ సామాజిక కోణంలో ఆలోచింపజేసే ఫొటోగ్రాఫర్లుగా తీర్చిదిద్దుతోంది. తమ ఫొటోలు తామే తీసుకునే ”సెల్ఫీ” ల ట్రెండ్‌ ప్రస్తుతం నడుస్తోంది. సెల్ఫీ ఫొటోలు క్షణాల్లోనే సోషల్‌ మీడియా ద్వారా అందరికీ చేరుతున్నాయి. ఇలా ఫొటోచిత్రణ ఎప్పటికప్పుడు ఆధునికతను సంతరించుకుంటూ ప్రపంచవ్యాప్తంగా తన ప్రత్యేకతను చాటుకుంటోంది.