ప్రపంచ తెలుగు మహాసభలు

తెలంగాణా ప్రభుత్వం వచ్చే డిశంబరు 15 నుండి 19 వరకూ హైదరాబాదులో ప్రపంచ తెలుగు మహాసభలను నిర్వహించాలని నిర్ణయించింది. ప్రభుత్వ పరంగా నిర్వహిస్తున్న ఈ సభలు వరుస క్రమంలో ఐదవది. తెలంగాణ భాషా సాహిత్య వికాసానికి దేశ విదేశాల్లో ఔన్నత్యం కల్పించాలనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున హైదరాబాద్ నగరంలో ప్రపంచ తెలుగు మహా సభలు తలపెట్టింది. ఈ మహా సభల కోసం వివిధ దేశాల నుంచి 500 మందిని, వివిధ రాష్ట్రాల నుంచి వెయ్యి మందిని ఆహ్వానించాలని ప్రభుత్వం భావిస్తోంది. ఈ ప్రముఖులతో పాటు మొత్తం అయిదు వేల మంది ఈ సభల్లో పాల్గొంటారని అంచనా. ప్రారంభ వేడుకలకు రాష్ట్రపతిని, ముగింపు వేడుకలకు ప్రధానమంత్రిని ఆహ్వానించాలని భావిస్తున్నారు. తెలుగు మహా సభల సందర్బంగా రాష్ట్రమంతా పండుగ వాతావరణం కనిపించాలని రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు అధికారులను ఆదేశించారు.

మహాసభల చరిత్ర:
మొదటి ప్రపంచ తెలుగు మహాసభలు

ప్రపంచ వ్యాప్తంగా విస్తరించి ఉన్న తెలుగు వారందరినీ ఒక వేదికపై సమావేశపరచి ఒకరి అభిప్రాయాలూ ఒకరు అవగాహన చేసుకొని, తెలుగు భాషా సంస్కృతులు, చరిత్ర, కళల ప్రాచీనతను, విశిష్టతను తెలుసుకొని, స్నేహ సంబంధాలను విస్తృత పరచి, భారతదేశం విదేశాల మధ్య సన్నిహిత సంబంధాలను పటిష్టం చేసుకోవాలనే లక్ష్యంతో అప్పటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం 1975లో మొదటి ప్రపంచ మహా సభలను నిర్వహించింది. 1975 ఏప్రిల్ 12వ తేదీ ఉగాది పర్వదినం నుండి 18వ తేదీ వరకు వారం రోజుల పాటు హైదరాబాద్ లోని లాల్ బహదూర్ స్టేడియంలో ఈ మొదటి ప్రపంచ తెలుగు మహా సభలు భారీ ఎత్తున జరిగాయి. ఈ ప్రాంగణానికి ‘కాకతీయ నగరం’ అని పేరు పెట్టడమైంది. దేశ, విదేశాల నుండి ప్రముఖ సాహితీవేత్తలు, ప్రసిద్ధ కళాకారులు, రాజకీయ ప్రముఖులు, స్వాతంత్ర్య సమరయోధులు, మేధావులు, పండితులు, సినీరంగ ప్రముఖులు, విద్యావేత్తలు, శాస్త్రజ్ఞులు, పాత్రికేయులు మరియు సమాజంలోని అన్ని రంగాల వారు ఈ సభల్లో పాల్గొన్నారు.

రెండవ ప్రపంచ తెలుగు మహాసభలు

మొదటి ప్రపంచ మహాసభలను స్పూర్తిగా తీసుకొని 1981 ఏప్రిల్ 14 నుండి 18 వరకు మలేషియా రాజధాని కౌలాలంపూర్ లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ అంతర్జాతీయ తెలుగు సంస్థ మరియు మలేషియా ఆంధ్ర సంఘం సంయుక్త నిర్వహణలో జరిగాయి. ఈ సభలలో అప్పటి రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ టంగుటూరి అంజయ్య, సాంస్కృతిక శాఖామాత్యులు శ్రీ భాట్టం శ్రీరామమూర్తి ఇతర అధికారులు పాల్గొన్నారు. మలేషియా ప్రధాని డా.మహతీర్ మహమ్మద్ ముఖ్య అతిధిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆంధ్ర దేశం నుండి మలేషియాకు తరలి వెళ్ళిన తెలుగువారి మూలాలకు సంబందించిన చిత్రాలు కూడా ప్రదర్శించబడ్డాయి. అప్పటి భారత రాష్ట్రపతి తెలుగుతేజం డా.నీలం సంజీవరెడ్డి సందేశం ఇస్తూ “విదేశాలలో నివసిస్తున్న తెలుగువారు కురిపించే ప్రేమానురాగాలకు మనమందరం సంపూర్ణంగా స్పందించాలి” అనటం ఈ సభలకు ఎంతో స్పూర్తినిచ్చాయి. మొదటి ప్రపంచ మహాసభల నిర్వహణలో కీలక పాత్ర పోషించిన శ్రీ మండలి వెంకట కృష్ణారావు, అంతర్జాతీయ తెలుగు సంస్థ సంచాలకులు డా.పి.యస్.ఆర్.అప్పారావు మొదలైన వారు ఈ సభలకు రూపురేఖలు దిద్ది విజయవంతంగా నిర్వహించడానికి దోహదపడ్డారు.

మూడవ ప్రపంచ తెలుగు మహాసభలు

మూడవ ప్రపంచ తెలుగు మహాసభలు 1990 డిశంబరు 10 నుండి 13 వరకు మారిషస్ దేశంలో పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం, అంతర్జాతీయ తెలుగు కేంద్రం సంయుక్త అధ్వర్యంలో నిర్వహించింది. ఈ సభలకు మారిషస్ గవర్నర్ జనరల్ సర్ వీరాస్వామి రింగడు, ఆ దేశ ప్రధాని అనిరుద్ జగన్నాధ్ ముఖ్య అతిధులుగా పాల్గొని ఉత్సవాల ప్రారంభోత్సవంలో తెలుగువారు మారిషస్ దేశ ప్రగతికి, ఉన్నతికి కృషి చేసారని ప్రశంసించారు. అప్పటి తెలుగు విశ్వవిద్యాలయం ఉపాధ్యక్షులు జ్ఞానపీఠ అవార్డు గ్రహీత, పద్మ భూషణ్ డా.సి.నారాయణ రెడ్డి నేతృత్వంలో ఆంధ్ర ప్రదేశ్ నుండి విద్యావేత్తలు, కవులు, కళాకారులు, చలనచిత్ర నటులు, అధికారులు ఈ సభలకు హాజరై వీటిని జయప్రదంగా నిర్వహింపజేసారు. ఈ సభల్లో శ్రీ మండలి వెంకట కృష్ణారావు గారిని సన్మానించడం గమనార్హమే కాదు గర్వకారణం కూడాను. వారి కుమారులు శ్రీ మండలి బుద్దప్రసాద్ (ప్రస్తుత ఆంధ్ర ప్రదేశ్ శాసన సభ ఉపాధ్యక్షులు) కూడా ఈ సభల్లో పాల్గొన్నారు.
సుమారు 200 సంవత్సరాలకు పూర్వం తెలుగునాట తీర ప్రాంతాల నుంచి వెళ్ళిన తెలుగువారు కొన్ని తరాలుగా ఆ దేశంలో స్థిరపడిపోయారు. వారికి ఎటువంటి రాకపోకలు లేకపోవడం వలన ఇన్నాళ్ళుగా తెలుగు భాషా సంస్కృతులకు దూరంగా జీవిస్తున్నారు. అయినప్పటికీ వీటిని తమ తాత ముత్తాతల సంపదగా భావించి, ఆరాధిస్తూ దానిని తరువాతి తరాలకు అందిస్తూ తెలుగు ఉనికిని కాపాడుకుంటున్నారు. అటువంటి తెలుగు వారికి ఈ సభలు తెలుగు భాషపై నరనరాలలో ఉన్న మమకారాన్ని వెల్లువెత్తించాయి. ఈ సందర్భంగా ఉత్తమ రచనలతో కూడిన ఒక ప్రత్యేక సంచిక ఆవిష్కృతమయ్యింది.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం స్వయంగా ఈ మూడు మహాసభలను నిర్వహించింది. అనంతరం ఈ చైతన్యంతో దేశ విదేశాలలోని తెలుగువారు ఎందరో తెలుగు మహాసభలను నిర్వహించారు.

నాల్గవ ప్రపంచ తెలుగు మహాసభలు
నాల్గవ ప్రపంచ తెలుగు మహాసభలు డిశంబరు 27 నుండి 29 వరకు తిరుపతిలో శ్రీ కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నపుడు జరిగాయి. అప్పటి రాష్ట్రపతి శ్రీ ప్రణభ్ ముఖర్జీ ముఖ్య అతిధిగా పాల్గొన్నారు. ఈ సభల్లో తెలుగువారి చరిత్ర, సౌరభాలతో కూడిన 1100 పుటలు గల ప్రత్యెక సంచిక అవిష్క్రుతంయ్యింది. ఆంధ్రప్రదేశ్ లోని అన్ని జిల్లాలలోనూ అధికారికంగా సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది.

Send a Comment

Your email address will not be published.