భారత స్టార్ షట్లర్ కిడాంబి శ్రీకాంత్ కెరీర్లో తొలిసారి నెం.1 ర్యాంక్‌ని అందుకున్నాడు. గురువారం ( ఏప్రిల్ 12న) విడుదలైన బీడబ్ల్యూఎఫ్ పురుషుల సింగిల్స్ ర్యాంకింగ్స్‌లో 76,895 పాయింట్లు సాధించిన శ్రీకాంత్ అగ్రస్థానాన్ని కైవసం చేసుకున్నాడు. రెండు రోజుల క్రితం కామన్వెల్త్ గేమ్స్‌లో భారత బ్యాడ్మింటన్ మిక్స్డ్ టీం పసిడి గెలవడంలో కీలక పాత్ర పోషించిన ఈ తెలుగు తేజం.. నెం.1 ర్యాంక్‌ని అందుకున్న రెండో భారత పురుష షట్లర్‌గా రికార్డుల్లో నిలిచాడు. కంప్యూటరైజ్డ్ ర్యాంకింగ్ సిస్టమ్ ప్రవేశపెట్టక ముందు ప్రకాశ్ పదుకొనేను వరల్డ్ నెం.1 గా పరిగణించారు. 1980ల్లో ఆయన మూడు టాప్ టోర్నీలను గెలిచి అగ్రస్థానాన్ని కైవసం చేసుకున్నారు.
ఏడాది కాలంలో నిర్వహించిన 10 అత్యుత్తమ టోర్నీల ఆధారంగా ర్యాంక్‌లను కేటాయిస్తారు. ఇప్పటి వరకూ నెం.1గా ఉన్న అక్సెల్సెన్ తాజాగా 1,660 పాయింట్లు కోల్పోయి 75,470కి పడిపోవడం శ్రీకాంత్‌కు కలిసొచ్చింది. గత ఏడాది ఇండోనేసియా, ఆస్ట్రేలియా, డెన్మార్క్, ఫ్రాన్స్ సూపర్ సిరీస్‌లను గెలుపొందిన శ్రీకాంత్.. సరికొత్త రికార్డులు నెలకొల్పాడు. ఈ ఏడాది ఫిబ్రవరిలో టైమ్స్ ఆఫ్ ఇండియా స్పోర్ట్స్ అవార్ట్స్‌లో ‘స్పోర్ట్స్ పర్సన్ ఆఫ్ ది ఇయర్’గా నిలిచిన శ్రీకాంత్.. సైనా నెహ్వాల్ తర్వాత అగ్రస్థానానికి చేరుకున్న భారత షట్లర్‌గా ఘనత వహించాడు. 2015 మార్చిలో సైనా వరల్డ్ నెం.1గా నిలిచింది.
వ్యక్తిగత వివరాలుః
కిడాంబి శ్రీకాంత్ ఫిబ్రవరి 7, 1993న గుంటూరులో జన్మించాడు. పూర్తిపేరు శ్రీకాంత్ నమ్మాళ్వార్ కిడాంబి. ఇతను ఒక భారతీయ బ్యాడ్మింటన్ ఆటగాడు. ఇతని తల్లిదండ్రులు కేవీఎస్ కృష్ణ, రాధ ముకుంద. కె.వి.యస్ కృష్ణ ఒక భూస్వామి. శ్రీకాంత్ సోదరుడు నంద గోపాల్ కూడా అంతర్జాతీయ ర్యాంక్ కలిగిన బ్యాడ్మింటన్ క్రీడాకారుడు. గోపీచంద్ బ్యాడ్మింటన్ అకాడమీ, హైదరాబాద్ లో శిక్షణ తీసుకున్నాడు. ఇతను ప్రస్తుతం అంతర్జాతీయ వలయంలో నంబర్ వన్ ర్యాంకు కలిగిన భారత పురుషుల ఆటగాడు. శ్రీకాంత్ గోస్పోర్ట్స్ ఫౌండేషన్, బెంగుళూర్ ద్వారా, 2012 నుండి స్కాలర్షిప్ కార్యక్రమం ద్వారా ఆర్థిక సహాయాన్ని పొందుతున్నాడు. ఇతను లి-నింగ్ చే కూడా స్పాన్సర్ షిప్ పొందాడు. ఇతను నవంబరు 16, 2014 న, ప్రపంచ బ్యాడ్మింటన్ లో అత్యుత్తమ క్రీడాకారుడిగా పేరొంది అభిమానులచే “సూపర్ డాన్”గా పిలవబడుతున్న లిన్ డాన్ ను 21-19 21-17 తేడాతో ఓడించి 2014 చైనా ఓపెన్ సూపర్ సిరీస్ ప్రీమియర్ గెలుచుకున్నాడు, ఈ విధంగా సూపర్ సిరీస్ ప్రీమియర్ పురుషుల టైటిల్ ను గెలుచుకున్న మొట్టమొదటి భారతీయునిగా శ్రీకాంత్ పేరుగాంచాడు. తాజాగా బీడబ్ల్యూఎఫ్ పురుషుల సింగిల్స్ ర్యాంకింగ్స్‌లో 76,895 పాయింట్లు సాధించిన శ్రీకాంత్ అగ్రస్థానాన్ని కైవసం చేసుకున్నాడు. గత నెలలోనే అతని ప్రతిభకు పురస్కారంలా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు శ్రీకాంత్ ను డిప్యూటీ కలెక్టర్ గా నియమించారు.