ప్రపంచ భాషగా తెలుగు వికసించాలంటె...?

world

ఇంట గెలిచి రచ్చ గెలవాలన్నది పాత తెలుగు సామెత. తెలుగు రాష్ట్రాల్లో పాలకుల పుణ్యమా అని తెలుగుకి తెగులు పడుతున్నా విదేశాల్లోని తెలుగువారు…తమ భాషనీ సంస్కృతీ మూలాలనీ పరిరక్షించుకుంటూ ప్రపంచభాషగా తెలుగుని సంరక్షిస్తున్నారు.

తెలుగు భాషా చరిత్రని పర్యావలోకిస్తే…..
ద్రావిడ భాషల్లో అతి ముఖ్యమైనది తెలుగు. ద్రావిడ భాషా కుటుంబం 4,500 సంవత్సరాల క్రితమే మనుగడలో ఉందని పరిశోధనలు రుజువు చేస్తున్నాయి. ద్రవిడ, ఇండో-యూరోపియన్, సినో-టిబెటన్.. ఇలా ఆరు భాషా కుటుంబాలకు చెందిన 600 భాషలకు దక్షిణాసియా పుట్టినిల్లు అని చెప్పవచ్చు. ద్రవిడ భాషా కుటుంబంలో మొత్తం 80 రకాల భాషలు (భాషలు, యాసలు కలిపి) ఉన్నాయి. దక్షిణ భారతం, మధ్య భారతం, పొరుగు దేశాల్లో ప్రజలు ఈ భాషలు మాట్లాడుతారు. ద్రవిడ కుటుంబంలోని ప్రధాన భాషలైన తెలుగు, తమిళం, కన్నడ, మళయాళ భాషలు అత్యంత ప్రాచీన సాహిత్య సంపదను కూడా కలిగివున్నాయి. ద్రవిడ భాష ఎక్కడ పుట్టింది.. ఎట్లా విస్తరించింది అన్న అంశాల్లో ఇంకా కచ్చితత్వం రాలేదు. కానీ.. ద్రవిడులు భారత ఉపఖండ మూలవాసులేనని, 3,500 సంవత్సరాలకు పూర్వం ఇక్కడికొచ్చిన ఇండో-ఆర్యన్ల కంటే ముందే ఇక్కడ ఉన్నారన్న వాదనతో చాలామంది పరిశోధకులు ఏకాభిప్రాయాన్ని కలిగివున్నారు. ద్రవిడ భాషలు ఎప్పుడు, ఎక్కడ అభివృద్ధి చెందాయి? అన్న ప్రశ్నలను శోధించడానికి.. 20 రకాల ద్రవిడ భాషల మధ్య ఉన్న ప్రాచీన సంబంధాలపై పరిశోధనలు జరిపారు. ద్రవిడ కుటుంబానికి చెందినవిగా భావిస్తున్న భాషలు మాట్లాడే స్థానికుల నుంచి ప్రాథమిక సమాచారాన్ని సేకరించారు. తెలుగుకు కూడా కొన్ని వేల ఏళ్ళ చరిత్ర ఉందని స్పష్టమైంది.

ప్రపంచ వ్యాప్తంగా…
తెలుగువాళ్లు ప్రపంచంలో అభివృద్ధి చెందిన దేశాలన్నిట్లోనూ వున్నారు. అందులోను ఇంగ్లీషు దేశభాషగా వున్న అమెరికా లోను, ఇంగ్లాండు లోను చాలా ఎక్కువమంది వున్నారు. కెనడా లోను, ఆస్ట్రేలియా లోను అంత ఎక్కువమంది కాకపోయినా తగినంతమంది వున్నారు. ఆఫ్రికా దేశాల్లోనూ, చైనా, జపాన్, స్కాండినేవియన్ దేశాల్లోనూ అంత ఎక్కువమంది లేకపోయినా, మొత్తం మీద చెప్పాలంటే తెలుగువాళ్లు ప్రపంచమంతటా వున్నారు. అంచేత ప్రపంచంలో చాలా చోట్ల మాట్లాడబడుతున్న భాష కాబట్టి తెలుగు ప్రపంచ భాషే!

అమెరికాలో తానాలు, ఆటాలు, ఇలా రకరకాల సంస్థలన్నీ తెలుగు భాషకి అపారమైన సేవ చేస్తున్నాయి. ఇది కాక అమెరికా లోనే స్థానికంగా డెట్రాయిట్ లోను, న్యూజర్సీ లోను, డాలస్ లోను తెలుగు సాహిత్యం పట్ల చెప్పుకోదగ్గ ఆసక్తి ఉన్నవాళ్ళు దాదాపుగా ప్రతి నెలా సమావేశమై సాహిత్య చర్చలు, పుస్తక విమర్శలు ఉత్సాహంగా చేస్తున్నారు. ఈ ఔత్సాహికులు ప్రచురణ రంగంలో కూడా తమ సామర్ధ్యాన్ని ప్రదర్శిస్తున్నారు. డెట్రాయిట్ లోని డి.టి.ఎల్.సి. వారు ప్రచురించే పుస్తకాలు, చిట్టెన్ రాజుగారు వంగూరి ఫౌండేషన్ తరపున ప్రచురించే తెలుగు పుస్తకాలు, తానా ఫౌండేషన్ ప్రచురించే తెలుగు పుస్తకాలు సంఖ్యా పరంగా తక్కువేమీ కావు. దీనికి తోడు అమెరికాలో తెలుగు కుటుంబాల చిన్న పిల్లలకి పాటలు, పద్యాలు, ఆటలు, నాటకాలు నేర్పే ప్రయత్నం విస్తృతంగా జరుగుతోంది. కొన్ని వందలమంది, బహుశా వేలమంది తెలుగు పిల్లలు ఇలా తెలుగు నేర్చుకుంటున్నారని పత్రికల నిండా బొమ్మలతో సహా మనకి వార్తలు కనిపిస్తున్నాయి. ఆస్ట్రేలియాలో తెలుగుమల్లి మరియు భువనవిజయ సంస్థలు ఏకంగా పౌరాణిక నాటకాలు ప్రదర్శిస్తూ వుంటారు. వారు కూడా “కవితాస్త్రాలయ” రెండు సంకలనాలు ప్రచురించారు. స్థానికంగా ఉన్న ఎంతోమంది భాషాభిమానులను ప్రోత్సహించి వ్యక్తిగతంగా పుస్తకాలూ ప్రచురించడానికి దోహదపడ్డారు.

ఇది ఒక రకమైన అంతర్జాతీయత. ఈ అంతర్జాతీయతకి కారణం తెలుగు భాష తెలుగు దేశంలో వుండగానే నేర్చేసుకుని, ఆ భాష ఒక్కటే నిజంగా బాగా వచ్చి, ఉద్యోగ రీత్యానో వ్యాపారం కోసమో అవసరమైనంత ఇంగ్లీషు నేర్చుకుని, ఇంగ్లీషు మాతృభాష అయిన దేశాలకి తెలుగు వాళ్లు వెళ్లడం. ఇలా వెళ్లిన వాళ్లు అమెరికా లోనూ ఇంగ్లండ్, కెనడా, ఆస్ట్రేలియాల లోనూ వున్నా వాళ్లు సాంస్కృతికంగా తెలుగువాళ్లే. వీళ్లలో కొంతమందికి కవులుగా, రచయితలుగా, పత్రికా సంపాదకులుగా, సంగీతజ్ఞులుగా పేరు తెచ్చుకోవాలనే కోరిక వుంది. ఇవాళ అమెరికా లోను, ఇంగ్లాండు లోను జరిగే తెలుగు సాహిత్య సమావేశాలన్నీ వీళ్లకి కావలిసిన సదుపాయాలిచ్చాయి. అవసరమైన తెలుగు వాతావరణాన్ని కూడా ఇచ్చాయి. ఆశ్చర్యకరంగా వీళ్ళల్లో కొంతమంది నిజంగా మంచి కవులు, మంచి సంపాదకులు, మంచి సాహిత్యజ్ఞులు కూడా అయ్యారు. అమెరికాలో ఎక్కువమంది మాట్లాడే మాతృభాషల్లో మూడోది తెలుగు. అక్కడ భారతదేశానికి చెందిన భాషల్లో ఎక్కువగా హిందీ మాట్లాడేవారు ఉండగా, రెండో స్థానంలో గుజరాతీ, తెలుగు మూడో స్థానంలో ఉన్నాయి. అమెరికాలో నివసిస్తున్నవారిలో ఇంటివద్ద సుమారు 3,65,566 మంది తెలుగులోనే మాట్లాడుతారని ఓ సర్వే నివేదిక వెల్లడించింది. ఆస్ట్రేలియాలో భారతీయ సంతతివారిని ప్రస్తుతిస్తే తెలుగువారు షుమారు ఒక లక్ష మంది ఉన్నారు. పంజాబీ, గుజరాతీల తరువాత ఎక్కువ సంఖ్యలో వున్నవారు తెలుగువారే.

అమెరికాలో సాహిత్య సమావేశాలు డెట్రాయిట్‌లో జరిగినా, న్యూయార్క్‌లో జరిగినా, వాషింగ్టన్‌లో జరిగినా, అట్లాంటాలో జరిగినా, ఇంకే ఊరిలో జరిగినా కూడా విజయవాడలో జరిగినట్లే ఉంటాయి. లేదా హైదరాబాదులో జరిగినట్లు ఉంటాయి. తమ చుట్టూ వున్న ఇంగ్లీషు ప్రపంచం మీద ఇవి ఏ రకమైన ప్రభావాన్నీ కలిగించవు. ఆ ప్రపంచ ప్రభావం కూడా వీటి మీద ఏమీ వుండదు. తెలుగు సినిమాలు, తెలుగు రాజకీయాలు, తెలుగు భోజనాలు, కూరలో కరివేపాకు లాగా కాస్త సాహిత్యము, ఇవే తెలుగు తనమైతే ఇవి ఈ సమావేశాల్లో పుష్కలంగా కనిపిస్తాయి. ఇది కాక ఇంకా ముందుకు వెళితే తెలుగుదేశంలో వున్న రాజకీయ పార్టీల అనుబంధ సంస్థలు, వాటి అనుయాయ నాయకులు ఈ సమావేశాల వల్ల మరి కొంచెం బలపడతారు. వ్యాపారమూ, వ్యాపారానికి కావలిసిన రాజకీయ ప్రాబల్యమూ పుంజుకుంటాయి. పైకి కనిపించే స్పష్టమైన విషయమేమిటంటే ఇక్కడ తెలుగు కుటుంబాలలో తల్లిదండ్రులు తెలుగు వాళ్లు, వాళ్ల పిల్లలు అమెరికా వాళ్లు. తల్లిదండ్రుల ఆసక్తి కొద్దీ వాళ్ల తాతల, అమ్మమ్మల ముచ్చట కొద్దీ ఇక్కడి పిల్లలు నాలుగు తెలుగు మాటలు మాట్లాడొచ్చు. అంతకు మించి తెలుగు పాటలు పాడొచ్చు. కూచిపూడి, భరతనాట్యం ఇలాంటివి కొంత సమర్ధంగానే నేర్చుకోవచ్చు కూడా. కాని, ఈ విద్యలు వీళ్ళ ప్రపంచంలో సాంస్కృతిక వాతావరణాన్ని మారుస్తాయా? అనే అంశాపై చర్చ జరగాల్సి ఉంది.

ఒక భాషలో వున్న విజ్ఞానం ప్రపంచం విజ్ఞానంలో భాగం అయి, ప్రపంచంలో విజ్ఞానులు దానిని గుర్తించవలసిన అవసరం కలిగితే, అప్పుడు అది ప్రపంచ భాష అవుతుంది. ఆ రకంగా ప్రపంచ భాషలయినవి గ్రీకు, రోమన్, లాటిన్, చైనీస్, జపనీస్, ఫ్రెంచ్, జర్మన్, ఇటాలియన్, …ఇలాంటి భాషలు. తను పుట్టి పెరిగింది ఏ భాషలోనైనా సరే ఈ భాషల్లో వున్న విజ్ఞానం తన భాష లోకి అనువదించుకుని చదివి తీరాలి. సాధ్యమైతే ఆ భాషలు నేర్చుకుని, ఆ పుస్తకాలు మూలంలో చదివి ఆ విజ్ఞానం మీద పట్టు సంపాదించాలి. గ్రీకు భాష రాకుండా లేదా ఆ భాషలో నుంచి అనువదించబడిన పుస్తకాలు చదవకుండా సాహిత్య శాస్త్రంలో, రాజకీయ శాస్త్రంలో, నీతి శాస్త్రంలో చెప్పుకోదగ్గ పాండిత్యాన్ని ఎవరూ పొందలేరు. ప్లేటోని, అరిస్టోటిల్‌ని, పైథాగరస్‌ని చదవని, వాళ్ళ గురించి వినని, విజ్ఞానులు వుండడానికి వీల్లేదు. సంస్కృతం యూరోప్‌లో ప్రవేశించిన నాటి నుంచి, అంటే పందొమ్మిదవ శతాబ్దపు తొలిరోజుల నుంచి, ప్రపంచ జ్ఞానం ఎంత పెద్దదయిందో కొంచెం చూచాయగా చూసినా తెలుస్తుంది. ప్రపంచం లోని భాషావేత్తలకి పాణిని కొత్తవాడు కాదు. అభినవగుప్తుడు, అశ్వఘోషుడు అపరిచితమైన పేర్లు కావు. ఈ రకంగా చూస్తే సంస్కృతం ప్రపంచభాష. భారతదేశంలో సంస్కృతం అంతరించి పోయినా కూడా ప్రపంచ విజ్ఞానంలో ఇమిడిపోయిన భాషగా అది ప్రపంచంలో బతుకుతుంది. సంస్కృత విజ్ఞానవేత్తలు రాసిన పుస్తకాలు ఇంగ్లీషు లోను, జర్మన్‌ లోను, ఫ్రెంచ్‌ లోను, ఇంకొంచెం ముందుకి వెళితే ఇటాలియన్‌ లోను క్రమక్రమంగా పెరుగుతాయి. ఇలాంటి విజ్ఞానం తెలుగులో పెరగాల్సిన అవసరం ఉంది. తెలుగు నేర్చుకోవడం మూలంగా తెలుగులో వున్న పుస్తకాలు చదవడం మూలంగా ప్రపంచ విజ్ఞానాన్ని పెంచే ప్రయత్నాలు జరగాలి. నువ్వు ఏ భాష వాడివైనా తెలుగులో రాసిన పుస్తకాలు చదవకపోతే ఇదిగో నీ విజ్ఞానానికి ఈ రకంగా లోపం వస్తుంది, అని మనం చెప్పగలిగిన రోజున, ఆ మాట ప్రపంచం లోని విజ్ఞానులు విన్న రోజున, ఆ మాట విని వాళ్లు తెలుగు నేర్చుకున్న రోజున, లేదా తెలుగు పుస్తకాల అనువాదాలు వాళ్లు చదివిన రోజున, చదివి అందువల్ల వాళ్లు గ్రహించిన విజ్ఞానాన్ని ప్రపంచ విజ్ఞానంలో భాగం చేసిన రోజున — అప్పుడు తెలుగు ప్రపంచ భాషగా నిలుస్తుంది. అందుకు ఎంతో కృషి అవసరం. అంతేగానీ తెలుగు ఇలాంటి ప్రపంచ భాష కావాలంటే తెలుగు వాళ్ళు పది మంది తెలుగు వాళ్ల మధ్య కూర్చుని తెలుగు చాలా అందమైన భాష అని, చాలా మృదువైన భాష అని, చాల తియ్యని భాష అని సరదాగా పొగుడుకుంటే చాలదు. విదేశాల్లో ఉన్న తెలుగు సాంస్కృతిక సంఘాలు ప్రతి సంవత్సరం ఎక్కడో ఒకచోట కొన్ని లక్షల డాలర్లు ఖర్చు పెట్టి సమావేశమై, సరదాగా కబుర్లు చెప్పుకుని, తెలుగు భోజనాలు చేసి, ఇంటికెళ్లి తమ ఉద్యోగాల్లో పడిపోతే తెలుగు ప్రపంచ భాష అవదు.

తెలుగు రాష్ట్రాలలో వున్న తెలుగు శాఖలు దాదాపుగా నిర్జీవంగా వున్నాయి. వీళ్లు చెప్తున్న పాఠాలు, ఇస్తున్న పిహెచ్‌.డి. డిగ్రీలు ఎవరికీ ఏ రకంగాను పనికిరాని స్థితిలో వున్నాయి. కష్టంగా తోచవచ్చు కానీ తెలుగు శాఖలకి అంతర్జాతీయ ప్రమాణాలలో పిహెచ్.డి సిద్ధాంత గ్రంథం రాయించగలగడం ఇప్పటికీ సాధ్యం కావడం లేదు. పైగా గత 50ఏళ్ళలో ఈ శాఖలు చేసిన పని స్థూలంగానైనా అంచనా వేయాలని, దాన్ని బిరుదులు, డిగ్రీలు, ఉద్యోగాలు ప్రధానంగా కాకుండా విజ్ఞానాన్ని ఎంత ముందుకు తీసుకుని వెళ్లాయి అని చూడాలని, ఎవరూ ఆలోచించడం లేదు.

ఇప్పుడున్న విశ్వవిద్యాలయాలు పాశ్చాత్య వ్యవస్థలకి ప్రతిరూపాలే కాబట్టి అవి ఎలా పని చేస్తున్నాయో అక్కడి పరీక్షా విధానాలు, పఠన పాఠన పద్ధతులు, డిగ్రీల వ్యవస్థలు ఎలా నడుస్తున్నాయో సాధ్యమైనంత స్పష్టంగా అర్థం చేసుకోవాలి. మన రాష్ట్రాల్లో ఎన్నో విశ్వవిద్యాలయాలు ఎక్కువశాతం రాజకీయ అవసరాల కోసం యేర్పడ్డవి. అవి విద్యావసరాలకోసం పని చేసే పరిస్థితి కల్పించాలంటే ఆ పని లోపలి నుంచే జరగాలి. తెలుగు శాఖల్లో ప్రస్తుతం ప్రధాన స్థానాల్లో వున్నవాళ్లు ఒక స్వఛ్ఛంద కూటమిగా యేర్పడి, ఏ ప్రభుత్వ సహాయం, ఏ రాజకీయ ప్రబోధం అక్కర లేకుండా, ఇంగ్లండ్ లోను, అమెరికా లోను, కెనడా లోను ఉన్న ఇండియన్ స్టడీస్ డిపార్ట్‌మెంట్లలో పని ఎట్లా జరుగుతోందో, వాళ్లు విద్యార్ధుల్ని ఎలా ఎంపిక చేసుకుని చేర్చుకుంటున్నారో, ఆ విద్యార్ధులకి ఏ రకమైన ప్రోత్సాహాలు కల్పిస్తున్నారో – ఆ సమాచారం సంపాందించాలి. ఆ విద్యార్ధులు పిహెచ్.డి. కోసం పరిశోధన చేసే ముందు ఏ విధమైన శిక్షణ పొందుతారో, ఏ ఏ విధానాలు, భాషలు నేర్చుకుంటారో, వాళ్లు తమ పరిశోధన ప్రణాళికని ప్రతిపాదించడం కోసం ఏ రకమైన పరిశ్రమ చేస్తారో, ఎలా తర్ఫీదు పొందుతారో తెలుసుకోవాలి. పరిశోధన ప్రణాళిక తయారు చేసిన తరువాత ఆ విద్యార్ధులు తమ పథకాన్ని అధ్యాపకుల ముందు ఎట్లా సమర్ధించుకుంటారో, వాళ్ల ప్రశ్నలకి ఎలా సమాధానాలు చెప్తారో గమనించాలి. ఆ శాఖల్లో తెలుగు ఉండకపోవచ్చు. తరుచూ ఉండదు కూడా. కానీ వాళ్ల విధానాలు, శిక్షణలు తెలుసుకోవడానికి తెలుగే అక్కర్లేదు. అది అంత తేలికయిన పని కాదు కానీ, తెలుగుని నిజంగా అంతర్జాతీయ భాషగా చేయాలన్న పట్టుదల వుంటే ఏదయినా సాధ్యమే.

విదేశాల్లో పరిశోధనలు
పాశ్చాత్య దేశాలలో ఒక విజ్ఞానానికి సంబంధించిన వాళ్లందరికి తమ తమ విశ్వవిద్యాలయాలతో, కళాశాలలతో సంబంధం లేకుండా ఒక వైజ్ఞానిక సంస్థ ఉంటుంది. ఉదాహరణకి, అమెరికన్ ఆంత్రొపాలజికల్ సొసైటీ , అమెరికన్ హిస్టారికల్ సొసైటీ , అసోసియేషన్ ఫర్ ఏషియన్ స్టడీస్(A.E.S.), జెర్మన్ ఓరియంటల్ సొసైటీ, రాయల్ ఏషియాటిక్ సొసైటీ ఇలా. ఇలాంటి సంస్థ ఒకటి తెలుగు పరిశోధన కోసం వేరేగా ఏర్పడాలి. ఇందులో ఆంధ్రప్రదేశ్‌ లోను, తెలంగాణా లోను, భారతదేశం లోని ఇతర ప్రాంతాల లోను తెలుగు చెప్పే ఉద్యోగాలు చేస్తున్నవాళ్లు అందరూ సభ్యులుగా చేరాలి. వాళ్లు కట్టే సభ్యత్వ రుసుముతో ఈ సంస్థ ముఖ్యంగా రెండు పనులు చేయాలి.
1. సంవత్సరానికొకసారి తెలుగు వైజ్ఞానిక సదస్సు నిర్వహించాలి.
2. ఈ సదస్సుల్లో వివిధ విద్యాసంస్థల్లో తెలుగు చెప్పేవాళ్లు తాము చేసే పరిశోధనల మీద ప్రామాణికమైన పత్రాలు సమర్పించాలి.
ఈ పని తెలుగు దేశంలో అప్పుడప్పుడు యు.జి.సి (University Grants Commission) ఇచ్చిన డబ్బులతో జరగడం, అక్కడి పత్రాలు పుస్తకంగా బయటకు రావడం కూడా కనిపిస్తుంది. కానీ ఈ పని ప్రతి సంవత్సరం జరగాలి, ఆ సదస్సుల్లో ప్రొఫెసర్లు, రీడర్లు, లెక్చరర్లు అందరూ పాల్గోవాలి, అలా పాల్గోవడం వాళ్ల పరిశోధనా సామర్ధ్యానికి ఒక ప్రమాణం ఏర్పడడం సాధ్యమౌతుంది.

ప్రపంచంలోని ప్రముఖ దేశాలలో, ముఖ్యంగా అమెరికా, ఫ్రాన్స్, ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా, జర్మనీ వంటి దేశాలలో భారతదేశాన్ని గురించి చెప్పుకోదగ్గ పరిశ్రమ జరుగుతోంది. ఈ దేశాల విశ్వవిద్యాలయాలలో ఇప్పుడిప్పుడే తెలుగు గురించి జిజ్ఞాస మొదలవుతోంది. అమెరికా లోని ఎమరీ విశ్వవిద్యాలయంలో తెలుగుకి ఒక ఆచార్య స్థానం ఏర్పడింది కూడా. ఇది తెలుగుకి ప్రపంచంలో మొదటి ఆచార్య స్థానం. మరికొన్ని సంవత్సరాలలో ఇంకా కొన్ని విశ్వవిద్యాలయాలలో తెలుగు ఆచార్య స్థానాలు ఏర్పడతాయి. అప్పుడు తెలుగు పేరుతో ఊకదంపుడు ఉపన్యాసాలు చెప్పి ఆ పని ముగిశాక ఎవరిళ్లకి వారు వెళ్లిపోయే ఆటాలు, తానాలు మనసు మార్చుకొని తమ డబ్బుని అమెరికా లోని విశ్వవిద్యాలయాలకి ఇవ్వడం మంచిదని గ్రహిస్తారు. అలా అక్కడ ఏర్పడబోయే ఆచార్య స్థానాలకి తగిన వారిని తయారు చేసే పని ఆంధ్రప్రదేశ్‌ లోను, తెలంగాణా లోను వున్న విశ్వవిద్యాలయాల మీద పడుతుంది. తెలుగు దేశంలోని విశ్వవిద్యాలయాలు అంతర్జాతీయ ప్రమాణాలకి అనుగుణంగా తయారు కాకుండా ఒట్టి డొల్ల పిహెచ్.డి.లు ఇచ్చి కాలం గడుపుతామంటే తెలుగుకి అంతర్జాతీయత ఏర్పడదు.

ఆస్ట్రేలియాలో తెలుగు…
ఆస్ట్రేలియాలో ప్రతీ రాష్ట్రంలోనూ తెలుగు సంఘాలున్నాయి. ప్రతీ పండగకు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నాయి. కొన్ని సంఘాలు రేడియో కార్యక్రమాలు కూడా నిర్వహిస్తున్నాయి. తెలుగు బడులు కూడా నిర్వహిస్తున్నాయి. తెలుగు సంఘాలే కాకుండా భాషను అభివృద్ధి చేయాలన్న ఆకాంక్షతో భువన విజయం లాంటి కొన్ని సాహితీ సంస్థలు స్థానిక కవులు వ్రాసిన కవితలు, గేయాలు, పద్యాలూ, కధలతో పుస్తకాలను కూడా ప్రచురించారు. పౌరాణిక నాటకాలను కూడా ప్రదర్శించడం జరిగింది. ప్రస్తుతం తెలుగు భాషనూ ఆస్ట్రేలియాలో కమ్యూనిటీ భాషగా గుర్తించాలని కేంద్ర ప్రభుత్వానికి అర్జీ పెట్టడం జరిగింది. దీనిద్వారా ప్రతీ ఉన్నత పాఠశాలలో తెలుగు మాధ్యమాన్ని బోధించే అవకాశం ఉంటుంది. కొన్ని రాష్ట్రాలలో స్థానికులు తెలుగు భాషపై మక్కువతో తెలుగు సంఘాలు నిర్వహించే తెలుగు బడుల్లో మన భాషని అధ్యయనం చేస్తున్నారు.

తెలుగు రాష్ట్రాల్లో భాషకు తెగులు
కొన్ని వందల సంవత్సరాలుగా తెలుగు ఆధునిక విద్యని తయారుచేసే స్థానం కోల్పోయింది. చేతనైనంతవరకూ ఆధునిక విజ్ఞానులకి సమాచారాన్ని అందించే స్థానంలోనే వుంది. ఈ పరిస్థితికి ఒక ముఖ్యమైన కారణం మనలో వున్న బుద్ద్ధిమంతులు, మేధాశక్తి కలవాళ్ళు, ఊహశాలులు, చాలామంది తెలుగుకి దూరమై, ఇంగ్లీషు చదువులకి ఎగబాకడం. తెలివైన వాళ్ళందరు, ఇంజినీరింగో, మెడిసినో, బిజినెస్ అడ్మినిస్ట్రేషనో, కంపుటర్ సైన్సో తీసుకుంటూంటే, తెలుగు శాఖల్లో అంత తెలివైన వాళ్ళు కాని వాళ్ళే చేరేవాళ్ళు. ఇది ఒకరకమైన మేధోవలస. ఈ స్థితి ఎలా మారుతుందో ఒక్క మాటలో చెప్పడం సాధ్యం కాదు కాని, తెలుగు విద్యార్థులు ఇంగ్లీషు చదవకుండా ఆధునికులం కాగలమని అనుకోడానికి ఇప్పుడు వీల్లేదు. తెలుగులొ పిహెచ్.డి. చేసే విద్యార్థులు ఇంగ్లీషు కూడా బాగా నేర్చుకుని వుండాలి. వ్యాపారానికీ, ప్రభుత్వ ఉద్యోగాలకీ సరిపడే ఇంగ్లీషుతో ఆపకుండా, ఇంగ్లీషులో కొత్త ఆలొచనలూ, సైద్ధాంతిక విధానాలూ నిర్మించే పుస్తకాలు చదివి, వాటినీ విశ్లేషించి, వాటిని విమర్శించే స్థాయికి ఉద్యమించాలి. ప్రపంచ విజ్ఞానం పశ్చిమ దేశాల్లో ఎలానూ తయారవుతుంది కదా, మనం దానిని ఎరువు తెచ్చుకుని వాడుకుంటే చాలు, అదే గొప్ప! అనే స్థాయి నుంచి, మన దగ్గిర ఆధునిక ప్రపంచం నేర్చుకోవలసిన ఆలోచనలూ, విధానాలూ ఉన్నాయని మనం వారికి చెప్పగలిగేలా ఎదగాలి. ప్రపంచీకరణ అంటే ఎరువు తెచ్చుకోవడమే కాదు, ఎరువు ఇవ్వడం కూడా అని తెలుగు విద్యార్థులూ, విశ్వవిద్యాలయాల తెలుగు శాఖలూ గుర్తించాలి.

2 Comments

  1. చాల బాగా రాసారు. ఈ విషయమై తెలుగు ప్రభుత్వాలు పెద్దగా పట్టించుకోవటం లేదు. ప్రజలకే తెలుగు అంటే ఇష్టం లేదు అని అవి అంటున్నాయి. ఈ పరిస్థితి మారాలంటే భాషోద్యమకారులు పెద్ద ఎత్తున కదలాల్సిందే. ప్రజలందరికీ తెలుగు భాష ప్రాముఖ్యతను వివరించాలి. ఆ భాషే మన జాతి మనుగడను నిర్ణయిస్తుంది అని తెలియజెప్పాలి.
    ఈ విషయమై ప్రజలందరికీ చైతన్యం వస్తే ప్రభుత్వాలు కూడ దారికొస్తాయి.

Send a Comment

Your email address will not be published.