ప్రేమ

తొలి తొలి తూరుపు తెల్లదనంలో
తరణి అద్దిన అరుణిమ గాంచి
ధరణికి పుట్టిన పులకింత – ప్రేమ

నీ మనోకుసుమ పరిమళమేఘం
నా హృదయాంతర హృదయంలో
చిలిపిగ చిలికిన చినుకుల తొలకరి – ప్రేమ

ఎడతెరిపి లేకుండా వెన్నెలవాన కురుస్తుంటే
ముద్దు ముచ్చటల గారెలు, వెచ్చగా వలపు తేనీరు
నీ ప్రతిస్మృతిలో పరిఢవిల్లే ప్రణయాగంధం – ప్రేమ

మన చూపుల కలయికలో, నీ కన్నుల్లో నా కన్నుల్లో
కమ్ముకున్న మమకారపు మబ్బులు చూసి
పురివిప్పి ఆడే అనురాగశిఖితాండవం – ప్రేమ!

–రమాకాంత్ రెడ్డి మెల్బోర్న్