ప‌క్ష‌వాతాన్ని నివారించడమే మార్గం

చాలా కుటుంబాల్లో అంతవరకూ అనందంగా సాగుతున్న జీవితాన్ని ఒక్కసారిగా కష్టాల్లోకి నెట్టేసే వాటిలో పక్షవాతం ముఖ్యమైనది. ఇది ఎవరికైనా వస్తే కేవలం దీని బారిన పడినవారు మాత్రమే కాదు.. మిగిలిన కుటుంబసభ్యులకూ కష్టాలు అనుభవించక తప్పదు. అందువల్లే గుండెపోటుకు భయపడనివారూ పక్షవాతం అంటే వణికిపోతుంటారు. ప్రపంచవ్యాప్తంగా ప్రతి ఆరుగురిలో ఒకరు పక్షవాతం బారిన పడుతున్నారు. పక్షవాతానికి సమర్థమైన చికిత్స నివారణే.

Paralysisమెదడు చైతన్యంగా ఉంటేనే జీవక్రియలు సజావుగా జరగడంతో పాటు సమాజంలో వ్యక్తిగా తగిన గుర్తింపూ లభిస్తుంది. అటువంటి అతి ముఖ్యమైన మెదడులోని కణాలకు, రక్తనాళాలకు నష్టం జరిగి శరీరంలోని అవయవాలకు, మిగిలిన భాగాలకు రక్తం సరఫరా కాకపోవడం వంటి సందర్భాలలో శరీరంలో కుడిగానీ, ఎడమవైపుగానీ ఉన్న అవయవాలు చచ్చుబడిపోతాయి. దీన్నే పక్షవాతం అంటారు. పక్షవాతం వస్తే శాశ్వత అంగవైకల్యం తప్పదు. శరీరంలో ఏదైనా కణం దెబ్బతిన్నా లేదా చనిపోయినా ఆ కణం స్థానంలో కొత్త కణాలు పెరిగే అవకాశం ఉంది. కానీ మెదడు కణాలు మాత్రం అలా కాదు. అవి ఒకసారి నశించాయంటే ఇక అక్కడ కొత్త కణాలు పెరగవు. అందువల్ల పక్షవాతం వచ్చి, కాళ్లూ చేతులు చచ్చుబడిపోతే అవి సాధారణ స్థితికి రావడం చాలా కష్టం. ఈ లక్షణాలు కనిపించగానే రోగిని వీలైనంత త్వరగా ఆసుపత్రికి తీసుకెళ్లాలి.

మెదడుకి రక్త సరఫరా అగితే
శరీరంలోని ప్రతి అవయవానికీ ఎల్లప్పుడూ రక్తం సరఫరా జరుగుతూ ఉంటుంది. అదే విధంగా మెదడుకూ రక్తం సరఫరా జరుగుతుంది. కొన్నిసార్లు ఏదైనా కారణం వల్ల మెదడుకు రక్తసరఫరాలో అంతరాయం కలిగితే వెంటనే అక్కడి కణాలు నశిస్తాయి. రక్తసరఫరాలో అంతరాయాలు ఏర్పడడడానికి మెదడులోని ఆ రక్తనాళాలు సరఫరా చేసే భాగానికి తగిన పోషకాలు, ఆక్సిజన్‌ అందక ఆ ప్రాంతంలోని కణాలు నశిస్తాయి. దాంతో వాటి నియంత్రణలో ఉన్న శరీర భాగాలలో చలనం మందగించి, చచ్చుబడిపోతాయి. మెదడులో కణితులు, రక్తంలో కొవ్వు పదార్థాల వల్ల, మెదడువాపు వంటి వ్యాధుల వల్ల, గుండెజబ్బుల వల్ల, స్థూలకాయుల్లోనూ ఈ పక్షవాతం వచ్చే అవకాశం ఉంది. పక్షవాతానికి దారితీసే పరిస్థితుల్లో హైబీపీ (అధిక రక్తపోటు) చాలా సాధారణమైనదీ.. ఇదే ప్రధానమైనదీ. పొగతాగడం, మితిమీరిన మద్యపానం, మధుమేహం, ఆహారంలో కొవ్వు ఎక్కువగా ఉండే పదార్థాలను తీసుకోవడం, మానసిక ఒత్తిడి, శారీరకంగా తగినంత వ్యాయామం లేకపోవడం, కొద్దిమేరకు కుటుంబ చరిత్ర వంటివీ పక్షవాతానికి కారణాలే.

పక్షవాత లక్షణాలు
పక్షవాత లక్షణాలు మెదడులో రక్తసరఫరా ఆగిన చోటుపై ఆధారపడుంటాయి. మెదడులోని కాళ్లూ, చేతులను నియంత్రించే భాగాలకు రక్తసరఫరాకు అంతరాయం కలిగితే ఆ భాగాలు చచ్చుబడతాయి. ముఖం, నోరు, కన్ను, ఒక్కోసారి శరీరానికి ఇరువైపులా ఉన్న భాగాలు పక్షవాతం వల్ల ప్రభావితం కావచ్చు. దీనివల్ల మాట పడిపోవడం, నిలకడగా / స్థిమితంగా నిలవలేకపోవడం, చూపుకోల్పోవడం, స్పృహ కోల్పోవడమూ జరుగుతాయి. దాదాపు 90 శాతం కేసుల్లో అకస్మాత్తుగా శరీరంలోని ఒకవైపు సగభాగంపై నియంత్రణ కోల్పోవడం వల్ల ఈ లక్షణాలు బయటపడతాయి. అకస్మాత్తుగా ఇలా జరగడాన్ని తప్పనిసరిగా ‘పక్షవాతం’ (స్ట్రోక్‌) గానే పరిగణించాలి. ఒకవైపు శరీర భాగాలు చచ్చుబడిపోవడం వల్ల రోగి నిరాశ, నిస్పృహల్లోకి కూరుకపోవడం, ఫిట్స్‌ రావడం, కొన్ని శరీరభాగాల్లో నొప్పి, మలమూత్ర విసర్జనపై నియంత్రణ కోల్పోవడం, ఎదుటివారితో సరిగా మాట్లాడలేక పోవడం, జ్ఞాపకశక్తి కోల్పోవడం.. అయోమయం, ఒకే వస్తువు రెండుగా కనబడటం..ఏదీ మింగుడు పడకపోవడం, కళ్లు, తల తిరగడం.. అకస్మాత్తుగా తీవ్రమైన తలనొప్పి, వాంతులు, నడకలో తూలుడు, మూతి ఒకవైపునకు ఒంకరపోవడం.. దృష్టి మందగించడం, కాళ్లూచేతులు ఉన్నట్టుండి బలహీనం కావడం.. వంటి లక్షణాలూ ఉంటాయి. దీనివల్ల కుటుంబసభ్యుల మధ్య సంబంధాలూ తీవ్రంగా ప్రభావితమవుతాయి.

నిర్ధారణ
పక్షవాతం వల్ల ప్రభావితమైన మెదడులోని ప్రాంతాలను సీటీ స్కాన్‌, ఎంఆర్‌ఐ ద్వారా గుర్తించవచ్చు. రక్తస్రావం జరిగినా, రక్తనాళాల్లో రక్తపుగడ్డలు అడ్డుపడినా ఈ పరీక్షలో తెలుస్తుంది. దానిని అనుసరించి చేయాల్సిన చికిత్స, రోగి కోలుకోగలిగే అవకాశాలు ఎంతవరకూ ఉన్నాయో నిర్ధారించవచ్చు. పక్షవాతం వచ్చిందని నిర్ధారణ జరిగితే, దానికి కారణమేమిటో తెలుసుకోవాలి. ఇందుకోసం సీబీపీ, రక్తంలో చక్కెర స్థాయిలు (బ్లడ్‌ షుగర్‌), క్రియాటినిన్‌ వంటి రక్షపరీక్షలు, ఈసీజీ, టూ- డి- ఎకో వంటి గుండె పరీక్షలు, డాప్లర్‌ నెక్‌ వెసెల్స్‌, లిపిడ్‌ ప్రొఫైల్‌ వంటి పరీక్షలు, మూత్ర పరీక్ష వంటి వాటిని చేయాలి. రక్తంలో ఒక రకం ప్రొటీన్లయిన హోమోసిస్టిన్‌ వంటి వాటిని అంచనా వేసే పరీక్ష, ప్రో-కోయాగ్యులెంట్‌ ఫాక్టర్స్‌ (రక్తం గడ్డకట్టడానికి దోహదపడే అంశాల) పరీక్షలూ చేయించాలి. ఇలా నిర్దిష్టంగా పక్షవాతానికి కారణాన్ని కనుగొంటే దాన్నిబట్టి చికిత్స చేయడం సులభం. ఒక్కోసారి పక్షవాతానికి సంబంధించిన కొన్ని లక్షణాలు తాత్కాలికంగా కనబడితే.. త్వరలోనే మరింత తీవ్రస్థాయిలో పక్షవాతం వచ్చే అవకాశం ఉందని తెలుసుకోడానికీ ఈ పరీక్షలు ఉపయోగపడతాయి. ఇలాంటి లక్షణాలున్న ఎక్కువమందిలో ఏడాదిలోపే మరింత తీవ్రంగా మళ్లీ పక్షవాతం వచ్చే అవకాశం ఉంటుంది. దీనిని దృష్టిలో పెట్టుకుని ముందే చికిత్సకు సిద్ధం కావాలి.

చికిత్స
ఎవరిలోనైనా పక్షవాత లక్షణాలు కన్పించిన వెంటనే ఆ వ్యక్తిని మూడు గంటల నుంచి నాలుగు గంటల లోపలే నరాలవ్యాధుల డాక్టర్‌ (న్యూరాలజిస్ట్‌) దగ్గరకు తీసుకెళ్లాలి. ఈ సమయాన్ని గోల్డెన్‌ అవర్‌ అంటారు. పక్షవాతం వచ్చినవారికి థ్రాంబోలైటిక్‌ థెరపీ అనే చికిత్స చేస్తారు. ఈ చికిత్స ప్రక్రియలో టిష్యూ ప్లాస్మినోజెన్‌ యాక్టివేటర్‌ (టీ.పీ.ఏ) అనే ఇంజెక్షన్‌ ఇస్తారు. అది రక్తనాళాల్లో ఉన్న గడ్డలను నాశనం చేస్తుంది. మళ్లీ మెదడులోని ఆ భాగానికి రక్త సరఫరా పునరుద్ధరణ జరుగుతుంది. అయితే పక్షవాతం లక్షణాలు కనిపించాక ఎంత త్వరగా ఈ ఇంజెక్షన్‌ ఇస్తే ఫలితం అంత ఎక్కువగా ఉంటుంది. వ్యాధి లక్షణాలు బయటపడిన నాలుగు గంటలలోపే ఈ ఇంజెక్షన్‌ ఇవ్వడం వల్ల మెరుగైన ఫలితాలు ఉంటాయి. ఒకసారి పక్షవాతం రావడం అంటూ జరిగితే ఇక రెండోసారి రాకుండా నివారించడమే దీనికి చికిత్సగా పరిగణించవచ్చు. ఒకసారి పక్షవాతం కనిపిస్తే రక్తాన్ని పలచన చేసే మందులైన ఆస్పిరిన్‌, క్లోపిడోగ్రెల్‌, రక్తంలో కొవ్వులు పేరుకోకుండా వాడే స్టాటిన్స్‌ వంటి మందులు జీవితాంతం వాడాల్సి ఉంటుంది. అయితే రోగికి హైబీపీ, డయాబెటిస్‌ వంటివి ఉంటే ఆ వ్యాధుల మందులూ వాడాలి. కొన్నిసార్లు గుండె సమస్యలు, మెదడు రక్తనాళాల్లో ఏదైనా సమస్యలు గుర్తిస్తే, ఒకవేళ ఆ రక్తనాళాల్లో 70 శాతం కంటే ఎక్కువ అడ్డంకి (బ్లాక్‌) ఉంటే స్టెంటింగ్‌ లేదా శస్త్రచికిత్స అవసరమవుతుంది.

ఫిజియోథెరఫీ ఎంతో మేలు
పక్షవాతంతో బాధపడే రోగులకు ఫిజియోథెరపీ, స్పీచ్‌థెరపీ వంటివి ఎంతో ఉపయోగపడతాయి. ఈ వ్యాధితో పడిపోయిన కాలు, చెయ్యిని తిరిగి సాధారణ స్థితికి తీసుకురావటంలో ఫిజియోథెరపీ ఎంతగానో ఉపయోగపడుతుంది. రోగికి క్రమం తప్పకుండా ఫిజియోథెరఫీ అందించడానికి కుటుంబసభ్యులు తమ పూర్తి సహకారాన్ని అందించాలి.

పక్షవాతాన్ని దూరంగా ఉంచాలంటే ?!
పక్షవాతం వస్తే చికిత్స గురించి ఆలోచించడం కంటే రాకుండా నివారణ ఎంతో అవసరం. ఇది చిన్నప్పట్నుంచే మొదలుకావాలి. నివారణ మార్గాలూ చాలా సులభమైనవే. పక్షవాతాన్ని దూరంగా ఉంచాలంటే కొన్ని జాగ్రత్తలు జీవితంలో భాగంగా మార్చుకోవాల్సిందే.
– మంచి ఆరోగ్యకరమైన జీవనశైలిని పాటించాలి.
– ఆహారంలో కొవ్వులు, నూనెలు, మసాలాలు అతి తక్కువగా ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాలి.
– రోజూ తినే ఆహారంలో ఉప్పు బాగా తగ్గించాలి. ఒకసారి అన్నం పెట్టుకున్న తర్వాత మళ్లీ ఉప్పు వేసుకునే అలవాటును పూర్తిగా మానుకోవాలి.
– పోషక విలువలున్న తాజా ఆకుకూరలు, కూరగాయలు, పండ్లు వంటి వాటిని తీసుకోవాలి.
– కూరల్లో పసుపు ఎక్కువగా వాడితే అది పక్షవాతం నివారిణిగా మారుతుంది.
– మానసిక ఒత్తిడిని దూరం చేసుకునేందుకు తగిన నియమాలు పాటించాలి.
– శరీరానికి తగినంత శ్రమ ఉండాలి. క్రమం తప్పకుండా వ్యాయామం చేయాలి.
– రక్తపోటును, షుగర్‌ను అదుపులో పెట్టుకోవాలి. స్థూలకాయం ఉంటే తగ్గించుకోవాలి.
– వంటల్లో ఆలివ్‌ నూనె వాడడం, ముదురు రంగులో ఉండే చాక్లెట్లు పక్షవాతం నివారణకు ఉపయోగపడతాయి.
– మద్యం తాగడం, ధూమపానం వంటి వ్యసనాలు ఉంటే ఏ వయసులోనైనా పక్షవాతం రావచ్చు.
– పక్షవాతానికి గురైన శరీర భాగానికి మసాజ్‌ వల్ల ఉండే ఉపయోగం పరిమితమే. డాక్టర్‌ సలహామేరకే మందులు వాడాలి.
– ఎట్టి పరిస్థితిలోనూ నాటు వైద్యం జోలికి వెళ్లకూడదు.
– పక్షవాతం తగ్గడానికి ఆకుపసర్లు మింగుతూ కాలయాపన చేస్తే శాశ్వతంగా వికలాంగులుగా ఉండిపోయే ప్రమాదం ఉంది.