ఫేస్‌బుక్‌, గూగుల్‌కు వార్తా సంస్థలు‌‌ విజ్ఞప్తి

ఫేస్‌బుక్‌, గూగుల్‌కు వార్తా సంస్థలు‌‌ విజ్ఞప్తి

ఫేస్‌బుక్‌, గూగుల్‌కు ఆస్ట్రేలియా వార్తా సంస్థలు‌‌ విజ్ఞప్తి

తమ కంటెంట్‌ను వినియోగించుకున్నందుకు గానూ తమకు నగదు చెల్లింపులు జరపాలని ఆస్ట్రేలియా వార్తా సంస్థలు ఏబీసీ(ఆస్ట్రేలియన్‌ బ్రాడ్‌కాస్టింగ్‌ కార్పొరేషన్‌), ఎస్‌బీఎస్‌(స్పెషల్‌ బ్రాడ్‌కాస్టింగ్‌ సర్వీస్‌) సోషల్‌ మీడియా దిగ్గజం ఫేస్‌బుక్‌, గూగుల్‌ను కోరాయి. ఆన్‌లైన్‌ ప్లాట్‌ఫాం ప్రవర్తనా నియమావళి, నిబంధనలు త్వరలో అమల్లోకి రానున్న నేపథ్యంలో ఈ మేరకు చర్చలు జరగాల్పిన ఆవశ్యకత ఉందని అభిప్రాయపడ్డాయి. గూగుల్‌, ఫేస్‌బుక్‌ సెర్చింగ్‌ ఫలితాల్లో తమ వార్త సంస్థలు, పత్రికల కథనాలను ఉపయోగించుకున్నందుకు డబ్బు చెల్లించాలని ఆస్ట్రేలియా ప్రభుత్వం ఇటీవల స్పష్టం చేసిన విషయం తెలిసిందే.

ఈ నేపథ్యంలోలో మీడియా సమాచారం వల్ల ఆన్‌లైన్‌ ప్లాట్‌ఫాంలకు ప్రకటనల ద్వారా వచ్చే లాభాలలో కొంతమొత్తం వార్తా సంస్థలకు చెల్లించే విధంగా కృషి చేయాలని ఆస్ట్రేలియన్ కాంపిటీషన్ అండ్ కన్స్యూమర్ కమిషన్ (ఏసీసీసీ)ను ఆదేశించింది. ఇక ఈ విషయంపై స్పందించిన ఫేస్‌బుక్‌.. మీడియా ద్వారా సేకరిస్తున్న సమాచారం వల్ల తమకు వాణిజ్య పరంగా ఎలాంటి ఉపయోగం లేదని.. ఒకవేళ తప్పనిసరిగా డబ్బు చెల్లించాల్సి వస్తే ఆ కంటెంట్‌ను తాము ఉపయోగించబోమని ప్రభుత్వానికి స్పష్తం చేసింది.

ఈ నేపథ్యంలో తాజాగా ఏబీసీ, ఎస్‌బీఎస్‌ మరోసారి సోషల్‌ మీడియా దిగ్గజాలకు ఈ విషయమై విజ్ఞప్తి చేయడం గమనార్హం. దీని గురించి ఎస్‌బీఎస్‌ అధికార ప్రతినిధి సిడ్నీలో మార్నింగ్‌ హెరాల్డ్‌తో మాట్లాడుతూ.. ‘‘ప్రముఖ డిజిటల్‌ ప్లాట్‌ఫాం ఆపరేటర్లు, మీడియా సంస్థల మధ్య చర్చలు జరగాలి. అప్పుడే వార్తా సంస్థలకు తమ కంటెంట్‌కు తగిన మొత్తం లభిస్తుంది. అదే విధంగా పాఠకులకు తమ సమాచారాన్ని పెద్ద ఎత్తున చేరవేసే అవకాశం లభిస్తుంది’’ అని అన్నారు. కాగా జూలై చివరి నాటికి అమల్లోకి రానున్న నిబంధనల ప్రకారం సోషల్‌ మీడియా దిగ్గజాలు ఏడాదికి దాదాపు 600 మిలియన్‌ ఆస్ట్రేలియన్‌ డాలర్లు చెల్లించాల్సి ఉంటుంది.

ఈ విషయంపై ఇది వరకే స్పందించిన గూగుల్‌.. న్యూస్‌ కంటెంట్‌ కారణంగా తమకు వచ్చే ఆదాయం చాలా తక్కువని స్పష్టం చేసింది. తద్వారా తాము సైతం ఫేస్‌బుక్‌ బాటలో నడిచే అవకాశాలు ఉన్నట్లు సంకేతాలు ఇచ్చింది. కాగా గత కొంత కాలంగా ఆన్‌లైన్‌ ప్రకటనల ద్వారా మీడియా సమాచారాన్ని వాడుకొని ఫేస్‌బుక్‌ సంస్థ లాభాలను అర్జిస్తుందని ఇటీవల ఆసీస్‌ దిగ్గజ మీడియా సంస్థలు రూపెర్ట్ ముర్డోచ్, న్యూస్ కార్ప్ సంస్థలు ఆరోపించిన విషయం తెలిసిందే. కరోనా సంక్షోభంలో పత్రికా రంగాన్ని కాపాడాలంటే సంస్థలకు వాటిల్లుతున్న నష్టాలను అధ్యయనం చేసి, పరిష్కారం చూపాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాయి. ఇందుకు ఆసీస్‌ సమాచార శాఖ మంత్రి పాల్‌ ఫ్లెచర్‌ సానుకూలంగా స్పందించి.. ప్రజా శ్రేయస్సు దృష్ట్యా వార్తా మాధ్యమాలను కాపాడుకుంటామని హామీ ఇచ్చారు.

Send a Comment

Your email address will not be published.