బహుముఖ ప్రజ్ఞాశాలి భరణి

బహుముఖ ప్రజ్ఞాశాలి భరణి

బహుముఖ ప్రజ్ఞాశాలి తనికెళ్ళ భరణి
– జూలై 14 భరణి పుట్టిన రోజు

సాహిత్య, సినీ, కళా రంగాల్లో బహుముఖ ప్రజ్ఞని కనబరుస్తున్నవారిని వేళ్ళపై లెక్కపెట్టొచ్చు. అటువంటివారిలో అందరికన్న ముందుంటారు తనికెళ్ళ భరణి. ఈ నెల 14 ఆయన పుట్టిన రోజు. ఈ సందర్భంగా ఆయన గురించి ముచ్చటించుకుందాం.

తనికెళ్ళ భరణి సకల కళా వల్లభుడనే చెప్పాలి. ఆయన రంగస్థల, సినిమా రచయిత, నటుడు, దర్శకుడు, తెలుగు భాషాభిమాని…ఇలా ఎన్నో..జులై 14, 1956న జన్మించిన భరణి స్వస్థలం పశ్చిమ గోదావరి జిల్లా, పోడూరు మండలంలోని జగన్నాధపురం. తెలుగు సినిమాలలో హాస్య ప్రధాన పాత్రలు అనేకం పోషించారు. ఈయన సకల కళాకోవిదుడు. ఇతనికి దర్శకుడు వంశీ మిత్రుడు. వంశీ దర్శకత్వంలో వచ్చిన శ్రీ కనక మహాలక్ష్మి రికార్డింగ్ డాన్స్ ట్రూప్ సినిమాకు మంచి సంభాషణలు అందివ్వడమే కాక ఒక మంచి పాత్రను కూడా పోషించారు. ఇప్పటిదాకా దాదాపు 300 సినిమాలలో నటించారు.

తొలిరాతల్లో
తనికెళ్ళ భరణి ఇంటర్మీడియట్ వరకు ఏమీ రాయలేదు. హైదరాబాద్‌లోని రైల్వే కాలేజీలో ఓ నాటకం వేయాల్సివచ్చినపుడు ‘అద్దె కొంప’ అనే నాటకం రాసి ప్రదర్శించగా ఆ నాటకానికి మొదటి బహుమతి వచ్చింది. ఇంటర్ చదివే సమయంలో ఆయన మిత్రుడు శ్రేయోభిలాషి అయిన దేవరకొండ నరసింహ ప్రసాద్ ప్రేరణతో వ్రాసిన “అగ్గిపుల్ల ఆత్మహత్య”, “కొత్త కలాలు” కవితలు ఆంధ్రజ్యోతి పత్రికలో ప్రచురితమైంది. తరువాత బి. కాం చదివే సమయంలో రాళ్ళపల్లితో పరిచయం అయింది. రాళ్ళపల్లి రాసిన “ముగింపు లేని కథ” నాటకంలో తనికెళ్ళ భరణి 70 సంవత్సరాల వయోధిక పాత్ర ధరించారు. ఆ నాటకం విజయం సాధించిన తరువాత భరణికి నాటకరంగంలో స్థిరమైన స్థానం లభించింది. రాళ్ళపల్లి నాటక సంస్థ పేరు “శ్రీ మురళీ కళానిలయం”. రాళ్ళపల్లి మద్రాసు వెళ్ళిన తరువాత “శ్రీ మురళీ కళానిలయం” సంస్థకు రచయిత కొరత ఎదురైంది. అది భరణికి నాటక రచయితగా నిలదొక్కుకోవడానికి సహకరించింది. ఆయన ఆ సంస్థ కొరకు 10 నాటకాలు రచించారు. ఆ నాటకాలకు తల్లావఝుల సుందరం దర్శకత్వం వహించారు. అందులో స్త్రీవాదాన్ని బలపరుస్తూ వ్రాసిన ” గోగ్రహణం ” నాటకం సాహిత్య అకాడమీ పురస్కారం అందుకోవడం విశేషం. ప్రయోగాత్మకంగా ప్రదర్శించబడిన ఆ నాటకాలకు ప్రజల ఆదరణ లభించింది.

వీధినాటకాలలో
ఔత్సాహిక నాటకాలు వేయడానికి వేదికగా ఉన్న రవీంద్రభారతి, నారద గానసభ వంటి నాటకరంగాలలో నాటకం వేయడానికి అధికంగా వ్యయం కావడం అది భరించే అవకాశాలు లేని కారణంగా భరణి పనిచేస్తున్న సంస్థ వారు బెంగాలీ నాటకకర్త “బాదల్ సర్కార్”ను ప్రేరణగా తీసుకుని వీధినాటకాలు వేయడం ప్రారంభించారు. ఇలా ప్రదర్శించిన నాటకాలలో మొదటిది “పెద్దబాలశిక్ష” నాటకం. తలావఝుల సుందరం ప్రారంభించిన ఈ నాటకాలకు మంచి ఆదరణ లభించింది. భరణి వీటిలో నటించడమే కాక నాటకాల నటనా బాధ్యత కూడా వహించాడు. భరణి రచించిన “గోగ్రహణం, కొక్కరకో, గొయ్యి” నాటకాలు తల్లవఝుల సుందరం దర్శకత్వంలో ప్రదర్శించబడ్డాయి. నాటకాలలో భరణి అత్యధికంగా విలన్ పాత్రలు ధరించారు.

సినిమాలలో ప్రవేశం
తనికెళ్ళ భరణి రాసిన “చల్ చల్ గుర్రం” నాటకం చూసిన రామరాజు హనుమంతరావుకు, రాళ్ళపల్లి ద్వారా వంశీకి పరిచయమై కంచు కవచం చిత్రానికి ఆ సినిమాకు రచయితగా, నటుడిగా చేశారు. తరువాత ” లేడీస్ టైలర్” చిత్రానికి గుర్తింపు వచ్చింది. ఆ తరువాత ” శివ ” చిత్రంలో నటుడిగా అవకాశం అలాగే పేరూ వచ్చింది. ఆ వెంట వెంతనే దాదాపు 60 చిత్రాలకు పనిచేసే అవకాశం లభించింది. ఆయన తెలంగాణా యాసలో మాటలు రాయడంలో సిద్ధహస్థుడు. ” మొండి మొగుడు – పెంకి పెళ్ళాం” చిత్రంలో కథానాయికకు పూర్తిగా తెలంగాణ యాసలో రాశారు.

నటుడిగా
తనికెళ్ళభరణి చలనచిత్ర నటుడిగా ప్రత్యేక గుర్తింపు పొందారు. సొగసు చూడతరమా, ఎగిరేపావురమా, మావిచిగురు, పరదేశి చిత్రాలలో భరణి ఉదాత్తమైన నటన ప్రదర్శించారు. కామెడీ, విలన్, ఉదాత్తమైన వైవిధ్యమైన పాత్రధారణతో భరణి ప్రజాదరణ పొందిన నటులలో ఒకడయ్యారు. ఆయన దాదాపు 300 పైచిలుకు చిత్రాలలో నటించాడు.
దర్శకుడిగా మిథునం (2012)సినిమాకు పనిచేశారు. ఈ సినిమా చిత్రీకరణ అంతా శ్రీకాకుళం జిల్లాలోనే జరిగింది.

కుటుంబం
తనికెళ్ళ భరణి తండ్రి టి. వి. ఎస్. ఎస్ రామలింగేశ్వర రావు, తల్లి లక్ష్మీ నరసమ్మ. భార్య దుర్గాభవాని. ఒక కుమారుడు, ఒక కుమార్తె పేరు సౌందర్యలహరి. ఆయన నిర్మించిన నివాసగృహానికి కుమార్తె పేరు పెట్టుకున్నారు.

రచయితగా..
తనికెళ్ళ భరణి సమాజంలో జరుగుతున్న సంఘటలనపై నాటకాలు రాశారు. వీటిలో..కొక్కొరోకో, గార్థభాండం, గోగ్రహణం, చల్ చల్ గుర్రం, జంబూద్వీపం మంచి గుర్తింపు పొందాయి.
శీను వాసంతి లక్ష్మి (2004), గాయం (1993), చెట్టుకింద ప్లీడర్ (1989), స్వరకల్పన (1989), వారసుడొచ్చాడు (1988), శ్రీ కనక మహాలక్ష్మి రికార్డింగ్ డాన్స్ ట్రూప్ (1987), అన్వేషణ (1985),
లేడీస్ టైలర్ (1985)..తదితర సినిమాలకు కథలు, సంభాషణలు రాశారు.
సాహితీవేత్త గా.. నక్షత్ర దర్శనం, పరికిణీ, ఎందరో మహానుభావులు, ఆటగదరా శివ, శబ్బాష్‌రా శంకరా తదితర రచనలు చేశారు.