బాణాసంచా...దీపావళి...

crackersహిందువుల పండుగలలో దీపావళి అత్యంత వర్ణమయం. దీపావళి అంటేనే దీపాల పండుగ. చీకట్ల చీల్చి వెలుగునిచ్చే పండుగ. ఈ పండుగతోపాటు టపాకాయలు కూడా ముడిపడి ఉన్నాయి. అయితే ఇటీవల భారత దేశ సర్వోన్నత న్యాయస్థానం (సుప్రీంకోర్టు) ఓ తీర్పు వెలువరించింది. దేశ రాజధాని ఢిల్లీ తదితర ప్రాంతాలలో బాణాసంచాను నిషేధిస్తూ ఓ ప్రకటన చేసింది. ఇది కొందరికి ఆశ్చర్యం కలుగజేసింది.

చాలా మంది పర్యావరణాన్ని దృష్టిలో పెట్టుకుని సుప్రీంకోర్టు తీర్పు పట్ల హర్షం వ్యక్తం చేసినా కొన్ని వర్గాలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశాయి. దీపావళిలో బాణాసంచా కాల్చడమనేది ఓ భాగమని, దానిపై నిషేధం విధిస్తే ఎలాగని ప్రశ్నించాయి. హిందువుల మనోభావాలను దెబ్బతీసేదిగా ఉందని దుయ్యబట్టాయి.

దీపావళి విషయానికి వస్తే అది రామాయణం కాలం నాటిదని చరిత్ర పుటలు తిరగేస్తే తెలుస్తుంది. శ్రీరామచంద్రమూర్తి లంకేశ్వరుడైన రావణాసురుడిని ఓడించి అయోధ్యనగరానికి తిరిగి చేరుకోవడంతో ఈ పండగ చేసుకున్నట్టు చెప్తారు. అప్పుడు కూడా బాణాసంచా ఉన్నట్టు ఆ చరిత్ర పుటలు చెప్తాయి. అయితే కొందరు మాత్రం బాణాసంచా కాల్చడమన్నది ఆ రోజుల్లో లేదని అంటున్నారు. హిందూ పౌరాణిక గాథలకు సంబంధించి ఎన్నో కథలు రాసిన కొందరు రచయితలు బాణాసంచా చరిత్ర చైనాతో ముడిపడి ఉందని అంటారు. క్రీస్తుశకం 1000 వరకూ ఈ బాణాసంచా ఊసే లేదని అనేవారున్నారు. దీపావళి అంటే దీపాలకాంతి అనే తప్ప చెవులు చిల్లులు పడేలా టపాకాయలు కాల్చడం కాదని చెప్పేవారున్నారు. కొన్ని ప్రాంతాల్లో అయితే కొందరు ముందుగానే అనుకుని తాము అనుకున్న నిర్దేశిత ప్రదేశానికి వచ్చి టపాకాయలు కాల్చి ఆనందించేవారట. కానీ కాలక్రమంలో అది పోయి ఎవరింట వారు టపాకాయలు కాల్చడంతోపాటు బహిరంగ ప్రదేశాల్లోనూ బాణాసంచా కాల్చడం అనేది ఓ అలవాటైపోయింది. దీపావళి సమయంలోనే కాకుండా మిగిలిన శుభసందర్భాలలోనూ ఇలా టపాకాయలు కాల్చడం అనేది వాడుకలోకి వచ్చింది.

టపాకాయల గురించి ప్రస్తావన కౌతుకచింతామణి అనే గ్రంథంలో ఉందని, గజపతి ప్రతాపరుద్ర దేవ ఈ విషయాన్ని చెప్పినట్టు, బహుశా 1497 – 1539 మధ్యకాలంలో ఈ రచన చేసినట్టు చరిత్రకారులు మాట. ఈ పుస్తకంలో సంస్కృతంలో కొన్ని చోట్ల దీని గురించి ప్రస్తావన ఉన్నట్లు చెప్తుంటారు. బాణాసంచా తయారీకి అసరమైన ముడిసరుకు గురించి ఈ పుస్తకంలో ఉందట. సల్ఫర్, ఛార్ కోల్, క్విక్ సిల్వర్ తదితర ముడిసరుకులు బాణాసంచా తయారీకి అవసరమని ఈ పుస్తకం బట్టి తెలుస్తోంది. అలాగే గోమూత్రం కూడా వాడేవారట. ఇలా ఉండగా రచయిత్రి దివాకరుని చిత్ర ది ప్యాలస్ ఆఫ్ ఇల్యూసన్స్ అనే గ్రంథంలో రామాయణంపై తాను చేసిన పరిశోధనలో దీపావళికి సంబంధించి బాణాసంచా కాల్చడమనేది లేనేలేదని, దీపాలు వెలిగించడం మాత్రమే ఉందని అన్నారు. అయితే ఇప్పటి పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని కాలుష్య నివారణకోసం బాణాసంచా వాడకాన్ని తగ్గిస్తే మంచిదని అంటున్నారు.

ఏదేమైనా చాలా మంది చెప్పేది మాత్రం చైనాలోనే మొదటిసారిగా బాణాసంచా కాల్చారని. ఇలా ఉండగా, పోర్చుగీసుకు చెందిన బార్బోసా అనే యాత్రికుడు 1518లో మన భారత దేశానికి వచ్చినప్పుడు బాణాసంచా గురించి అనేక విషయాలు రాసినట్టు చెప్పేవారున్నారు. పెళ్ళిళ్ళప్పుడు, పండగలప్పుడు బాణాసంచా కాల్చి ఆనందించేవారని ఆయన పేర్కొన్నారు.
– జగదీశ్ యామిజాల

Send a Comment

Your email address will not be published.