బాహ్య సౌందర్యం పట్ల ఏహ్య భావం

బాహ్య సౌందర్యం పట్ల ఏహ్య భావం

శ్రీ రామకృష్ణ పరమ హంస గురించి స్వామీ శారదానంద రాసిన ఎన్నో విషయాల్లో ఇదొకటి.

కామార్పుకూరులో శ్రీ రామక్రిషణ్ పరమహంస బస చేసిన రోజుల్లో జరిగిన విషయం ఇది. ఒకసారి ఆయన అక్కడి నుంచి జయరాంబాటి , సిహోర్ గ్రామాలకు వెళ్ళడానికి యేర్పా ట్లు జరిగాయి. ఎప్పుడూ భావ సమాధిలో ఉండటంతో ఆయన అవ ఆయవాలు పిల్లవాడిలా కోమలంగా ఉన్నాయి. కనుక ఆయన కాస్తంత దూరం కూడా నడిచి వెళ్ళేవారు కాదు. కనుక జయరాంబాటి  మీదుగా సిహోర్ వెళ్ళడానికి ఒక పల్లకీ ఏర్పాటు చేసారు. ఆయనతోపాటు  హ్రుదయి కూడా వెళ్ళడానికి సిద్ధపడ్డారు. మధ్యాన్నం భోజనాలు అయ్యాయి. ఎర్రటి పట్టు వస్త్రం వేసుకుని చేతికి బంగారపు తాయెత్తు కట్టుకుని తమలపాకులు నములుతూ లోపలి నుంచి బయటకు వచ్చారు. పల్లకీ ఎక్కడానికి సిద్ధమవుతుండగా అటూ ఇటూ బోలెడు మంది నిల్చుని ఉండటం చూసారు. వారిలో స్త్రీలు కూడా చాలా మందే ఉన్నారు. వారిని చూసి శ్రీ రామకృష్ణులు ఆశ్చర్య పోయారు.

“ఎందుకు ఇంతమంది ఇలా ఇక్కడ గుమికూడారు” అని ఆయన హ్రుదయిని అడిగారు.

అప్పుడు హ్రుదయి “నువ్వు సిహోర్ వెళ్తున్నావు కదా….అక్కడ ఎన్ని రోజులు ఉంటావో కదా” ఇప్పుడే ఇక్కడ నిన్ను చూడాలని ఇలా ఇంతమంది తరలివచ్చారు” అని చెప్పారు.

“అయితే తనను రోజూ చూస్తూనే ఉన్నారు కదా…ఈరోజు తనను కొత్తగా చూడాల్సింది ఏముంది” అని శ్రీ రామకృష్ణ పరమహంస  మళ్ళీ ప్రశ్నించారు.

అప్పుడు హ్రుదయి “నువ్వు పట్టు వస్త్రంలో చూడటానికి చాలా అందంగా కనిపిస్తున్నావు కదా….పైగా తమలపాకులు వేసుకోవడంతో నీ పెదవులు బాగా ఎరుపెక్కి మరింత అందం వచ్చింది నీ ముఖానికి. ఆ అందాన్ని చూడటానికి వాళ్లు నీకోసం చాలాసేపటి నుంచి నిరీక్షిస్తున్నారు” అని చెప్పారు.

ఆ మాటలు ఆయన్ను ఆలోచనలో పడేశాయి.

“రెండు రోజులుండే ఈ నా బాహ్య్స సౌందర్యాన్ని చూడటానికి వచ్చేరా? నా అంతరాన ఉన్నది చూడాలనుకోవడం లేదా?” అని శ్రీ రామకృష్ణులవారు ఆలోచనలో పడ్డారు. అంతే కాదు ఆయనకు మొదటి నుంచీ బాహ్య సౌందర్యం పట్ల ఏహ్య భావం ఉండేది. ఈ సంఘటనతో ఆయనలో ఆ ఏహ్యభావం మరింత ఎక్కువైంది.

“ఓ మనిషిని ఇలా బాహ్య సౌందర్యంతో చూడటమా? ఛీ ఛీ ” అనుకుని ఆయన ఇంట్లోకి వెళ్లి పట్టు వస్త్రం విప్పేశారు. అంతేకాదు ఆయన మనసు చిన్నబుచ్చుకుంది. ఆరోజు ఆయన తమ పర్యటన మానుకున్నారు. అక్కడున్న వారందరూ ఎంతగానో నచ్చచెప్పడానికి ప్రయత్నించారు. కానీ ఆయన వారెవరి  మాటా వినలేదు.

– యామిజాల

Send a Comment

Your email address will not be published.