బ్రహ్మరథం

మనం బ్రహ్మరథం అనే మాట తరచూ మనం వింటూ ఉంటాం. అయితే ఈ మాట మూలాల్లోకి వెళదాం…

ఒకసారి ఇంద్రుడికి, బృహస్పతికి మధ్య విభేదం తలెత్తింది. ఇంద్రుడు కించపరుస్తాడు. దాంతో బృహస్పతి స్వర్గం నుంచి వెళ్ళిపోతాడు. అప్పుడు ఇంద్రుడు బృహస్పతి స్థానంలో త్వష్ట ప్రజాపతి పుత్రుడైన విశ్వరూపుడిని నియమిస్తాడు. అయితే విశ్వరూపుడు అసురులపై బంధుప్రీతి కాస్త ఎక్కువగా చూపిస్తూ ఉంటాడు. అసురులకు హవిర్భాగాలు ఇస్తాడు. అది ఇంద్రుడికి నచ్చదు. కోపం వస్తుంది. విశ్వరూపుడిని సంహరిస్తాడు.
ఈ సంహారంతో ఇంద్రుడి మెడకు బ్రహ్మహత్యాపాతకం చుట్టుకుంటుంది. ఇక ఇంద్రుడు ఆ దోషం పోగొట్టుకోవడానికి స్వర్గం నుంచి వెళ్ళిపోతాడు.

అప్పుడు దేవతలందరూ కట్టకట్టుకుని భూలోకానికి వస్తారు. నహుష మహారాజుని కలిసి విషయం చెప్పి ఇంద్ర ఆధిపత్యాన్ని ఇస్తారు. నహుషుడు సామాన్యుడు కాడు. తనకు ఇంద్ర పదవి దక్కడంతోనే నహుషుడిలో గర్వం పెరిగిపోతుంది. అంతా తానే అనుకుంటాడు. దేవతలను, మహర్షులను, అష్ట దిక్పాలకులను కించపరుస్తాడు. నా మాటలు అంటాడు. అంతేకాదు శచీదేవిని కూడా కోరుతాడు.

అంతట శచీదేవి “నన్ను కోరుతున్నావు కనుక నీకో షరతు విధిస్తున్న. నువ్వు బ్రహ్మరథం మీద ఊరేగి రా చూద్దాం” అని అంటుంది.

నహుషుడు సరేనని సప్తఋషులతో పల్లకీని మోయిస్తూ అందులో కూర్చుని బయలుదేరుతాడు. ఆ పల్లకీ మామూలు పల్లకీ కాదు. అది బ్రహ్మరథం…ఆ రధాన్ని మోస్తున్న వారిలో అగస్త్య మహర్షి కూడా ఉన్నాడు. అగస్త్యుడు పొట్టి వాడవడంతో అతను మోస్తున్న వైపు పల్లకీ కాస్త ఒరిగి ఉంటుంది. దానితో నహుషుడికి చిర్రెత్తుకొస్తుంది. అగస్త్యుణ్ణి కాలితో కొడుతూ సర్ప సర్ప అని అవమానం చేస్తాడు. సర్ప సర్ప అంటే అర్ధం త్వరత్వరగా ముందుకు కదులు అని. నహుషుడు తనను కించపరచడాన్ని సహించలేక వెంటనే అగస్త్యుడు అతనిని శపిస్తాడు. సర్పోభావ అని. అంటే అర్ధం పామువైపో అని.

అగస్త్యుడి శాపంతో నహుషుడు వెంటనే పామై భూలోకానికి వెళ్లి పడతాడు. ఈ సంఘటనతో నహుషుడిలో ఉన్న గర్వమంతా పోతుంది. తన తప్పుని మన్నించమని, శాపవిముక్తుడిని చేయమని అగస్త్యుడిని కోరుతాడు.
అంతటా అగస్త్యుడు దయతలచి ఇలా అంటాడు – “నువ్వు పాము రూపంలో ఉండి అడిగే ప్రశ్నలకు ఎవరు జవాబులు చెప్తారో వారి వల్లే నీకు ఈ రూపం పోతుంది. అప్పుడే మళ్ళీ నీకు పూర్వరూపం వస్తుంది. శాపం నుంచి విముక్తుడివి అవుతావు” అని.

ఆ తర్వాత, అరణ్యంలో ఓ చోట భీముడు నహుషుడికి దొరుకుతాడు.

ఎంతసేపటికీ భీముడు తిరిగి రాకపోవడంతో ధర్మరాజు తమ్ముడు ఏమయ్యాడో చూడటానికి బయలుదేరుతాడు. నహుషుడి దగ్గరున్న భీముడిని చూస్తాడు. అయితే నహుషుడు “నీకు నీ తమ్ముడు కావాలంటే నేను అడిగే ప్రశ్నలకు జవాబులు చెప్పు. అప్పుడు వేడిని విడిచిపెడతాను” అంటాడు.

సరేనని ధర్మరాజు నహుషుడు అడిగిన అన్ని ప్రశ్నలకు జవాబు చెప్తాడు. దానితో నహుషుడికి శాప విముక్తి కలుగుతుంది. నహుషుడు ఆ క్షణమే మళ్ళీ మనిషి రూపంలోకి వస్తాడు.
నహుషుడి ఉదంతం ఇదే.

బ్రహ్మవంశీయులు గానీ లేక బ్రహ్మవేత్తలు కానీ మోసే వాహనాన్ని బ్రహ్మరథం అంటారు.
——————–
జయా