భాగవతం కథలు – 10

ఇదే ముక్తి మార్గం…..
———————————–
శ్రీశుకుడు పరీక్షిత్తుడితో, “రాజా! నీకింకా ఏడు రోజుల జీవితకాలమే మిగిలి ఉంది. కనుక ఈ లోపే నువ్వు పరలోక సాధన ద్వారా ముక్తి పొందవచ్చు. రోజులు దగర పడ్డాయని విచారించకు. ఓ పుణ్య తీర్థంలో స్నానం చేసి శుచిగా ఒక చోట కూర్చుని ఇంఫ్రియాలను బుద్ధి అనే సారథి సాయంతో మనస్సనే పగ్గాన్ని బిగపట్టు. మనసులో భగవంతుడిని నిలిపి ధ్యానం చెయ్యి. నిర్మలమైన చిత్తం కలిగి ఉంటేనే విష్ణుపదం చేరుకోగలవు. ధారణ నియమంతో సుఖాత్మ విషయాన్ని సందర్శించే యోహికే భక్తి యోగం సిద్ధిస్తుంది. సంతానం, దానం తదితర విషయాలపై మొహం పోవాలి. ధ్యానాన్ని ఏకాగ్రతతో చేయాలి. యోగికి భక్తే పరమ యోగం. హరిపైనే మనస్సు నిమగ్నం చేయాలి. అటూ ఇటూ మనస్సుని చెదరిపోనివ్వకూడదు.

శ్రీహరిలో భూత, భవిష్య, వర్తమాన రూపమైన సమస్త విశ్వాన్ని చూడవచ్చు. సర్వమూ శ్రీహరే.

కలలో జీవి అనేక రూపాలు పొందుతాడు. ఇంద్రియాలవల్ల ఎన్నో విషయాలు అనుభవించి చివరికి జాగ్రదావస్థలో తనను తానూ తెలుసుకుంటాడు. అలాగే సర్వ జీవులలోని అంతరాత్మ రూపంలో ఉన్న ఆ పరమేశ్వరుడు సర్వ ప్రాణుల హృదయం లోపల ఉంటూ సాక్షిగా ఉండి చూస్తూ ఉంటాడు. పరమేశ్వరుడు సత్యం. ఆనందమూర్తి. విజ్ఞానమూర్తి. అతనిని సేవించాలీ.

ఒకానొకప్పుడు, బ్రహ్మ సృష్టి కార్యం చాలా కాలం చేయలేక శ్రీహరి ప్రార్ధనతో ఆ పని పూర్తి చేయగలిగాడు.

ఇంకా విను…
మూర్ఖులు స్వర్గ లోకంలో సుఖాన్ని ఇచ్చే వేదప్రోక్తమైన మార్గాన్ని అనుసరిస్తే మాయతో ఆవరించి ఉపాసనామూలంతో, నిద్రించే వారు కలలలో విహరిస్తుంటారు. కానీ దేనికీ సాటి లేని మోక్ష సుఖాన్ని పొందలేరు.
తానూ రక్షిస్తాను అని విష్ణువు ఘోషించినా ఆ మాట పట్టించుకోరు. అవిద్య వల్ల హరికి దూరమవుతారు.

హరినామ స్మరణ చేయకుండా జీవితకాలం వృధా చేసిన వారిని కాలభటులు నానా రకాలుగా దండిస్తారు. హరి పాదపద్మాలకు సేవ చేయని వారు వైతరిణీ నదిలో నిమగ్నులై దహింప బడతారు.
అందుకే ప్రతి క్షణం ధ్యానం చేస్తూ నిశ్చలమైన భక్తి కలిగే వరకు పరిపూర్ణత సాధించే వరకు హరినే స్మరించాలి.

మనస్సు వేగాన్ని బుద్ధితో అరికట్టాలి.
ఆత్మను బ్రహ్మలో మమేకం చేసి సకల కార్యాలు విసర్జించి ప్రశాంతమైన శాంతితో కూడిన నిత్య సుఖాన్ని పొందవచ్చు.

అంతేతప్ప మరెవ్వరికీ పరమాత్మ దక్కే అవకాశం లేదు. పరమపావనమైన హరి పాదపద్మాన్ని అనుక్షణం మనసులో నిలుపుకోవాలి. యోగి అనే అతను మడమతో మూలాధార చక్రాన్ని పీడించి ప్రాణాన్ని నాభి దగ్గరకు తీసుకొచ్చి అక్కడి నుండి మెల్లగా హృదయకమలం మీదకు చేర్చాలి. అక్కడ హృదయంలో హత్తుకునేలా చేసి ఆ తర్వాత దౌడల వద్దకు చేర్చాలి. అనంతరం కనుబొమల మధ్య నిలిపి ఇంద్రియ శక్తులను వీడి ప్రాణాన్ని నడిపించి బ్రహ్మ రంధ్రంలో చేర్చాలి. ఆ తర్వాత దానిని భేదించి బ్రహ్మలో కలుస్తాడు. ఇదే ముక్తి మార్గం.

వేదాలలో ముక్తి మార్గాలు రెండున్నాయి. అవి సద్యోముక్తి. క్రమముక్తి. వీటి గురించి శ్రీహరి నారదుడికి వివరించాడు. సంసారంలో ప్రవేశించిన వ్యక్తి తరించడానికి తపస్సు, యోగాడులైన మోక్ష మార్గాలు లేకపోలేదు. వాటిలో భక్తి మార్గం అత్యంత శ్రేష్టం. బ్రహ్మ కూడా భక్తి మార్గాన్ని అనుసరించే శ్రీహరి అనుగ్రహం పొందాడు.

హరిని సదాసేవిస్తే నిర్మలమైన జ్ఞానం కలుగుతుంది. విరక్తి కలుగుతుంది. ముక్తి లభిస్తుంది. హరినామ కథలు శ్రద్ధగా వినాలి. అలా విన్న వ్యక్తి ఆయువు సార్ధకమవుతుంది. బతికున్నప్పుడే విష్ణు పాదసేవ చేయాలి. అలాంటి భక్తి లేని వారి పుట్టుక నిష్ఫలమే” అన్నాడు.

అనంతరం శ్రీహరి ధరించిన వేర్వేరు అవతారాల కారణాలను చెప్తూ శుకమహర్షి హరికి ప్రార్ధించాడు.
(నారదుడు బ్రహ్మను కలిసి తనకు కలిగిన సందేహాలను అడిగి నివృత్తి చేసుకోవడం తర్వాతి భాగంలో చెప్పుకుందాం)
యామిజాల జగదీశ్