భాగవతం కథలు – 13

నారదుడి పూర్వజన్మ వృత్తాంతం

నారదుడు తన పూర్వజన్మ వృత్తాంతం ఇలా చెప్పుకొచ్చాడు.

నేను పూర్వజన్మలో మా అమ్మ ఓ దాసి. ఆమె పని చేస్తున్న ఇంటి యజమానులైన వేదవిదులు నేను చిన్న వాడుగా ఉన్నప్పుడు అ చాతుర్మాస్య వ్రతం జరిగే చోటుకి పంపారు. ఆ యాగాన్ని చేస్తున్న వారికి సపర్యలు చేయమని ఆజ్ఞాపించారు. ఆజ్ఞ మేరకు నేను ఎంతో శ్రద్ధగా వారికి అవసరమైనవన్నీ చేసాను. వాళ్లకు నేను చేసిన సేవలు ఎంతో నచ్చాయి. దానితో వాళ్ళు వ్రతం తర్వాత వెళ్తూ వెళ్తూ నాకు విష్ణు తత్త్వం బోధించారు. వారి దయ వల్లే నేను వాసుదేవుడి గురించి తెలుసుకోగలిగాను. ఈశ్వరుడు అర్పించిన బుద్ధితో చక్కగా మన కర్మలు చేసినప్పుడు ఈశ్వర సంతోషం, భక్తి యోగం కలుగుతాయి. ఓంకారంతో కలిపి వాసుదేవుడు, ప్రద్యుమ్నుడు, సంకర్షణుడు, అనిరుద్ధమూర్తి మాటలని భక్తితో స్మరించి నమస్కారం చేస్తే శ్రద్ధ పుట్టి యగ్నపురుషుడిని పూజించిన వాడు సంయగ్దర్శనుడు అవుతాడు.

ఆరోజు రాత్రి చీకట్లో మా అమ్మ పాలు పితకడానికి వెళ్లి చూసుకోకుండా ఓ పాముని తొక్కింది. అప్పుడు ఆ పాము మా అమ్మ పాదం మీద కాటేసింది. ఆ కాటుకు మా అమ్మ చనిపోయింది. అయితే అమ్మ పోయిన విచారం మనసులోకి రానివ్వకుండా ఉత్తర దిక్కులో ప్రయాణం చేసి ఓ అడవిలోకి ప్రవేశించాను. అక్కడ ఓ చెరువు కనిపించింది. ఆ చెరువు నీటిని తాగాను. అనంతరం పరమాత్ముడిని ధ్యానిస్తూ ఆనందంతో నన్ను నేను మరిచాను. అప్పుడు నా మనసులో పరమాత్ముడు ప్రత్యక్షమయ్యాడు. వెంటనే నేను ధ్యానం నుంచి లేచి చూడగా పరమాత్మ కనిపించలేదు. దానితో తెగ బాధ పడ్డాను. ఆ బాధతోనే అడవి అంతటా తిరిగాను. ఇంతలో ఓ చోట హరి తన గొంతు వినిపించాడు. అది అదృశ్య రూపమే కానీ మాటలు స్పష్టంగా వినిపించాయి.

హరి నన్ను ఇలా ఆదేశించాడు –

“ఓ బాలుడా! ఎందుకు విచారం? ఈ జన్మలో నువ్వు నన్ను చూడలేవు. కామాది అరిషడ్వర్గాలను జయించి ఎల్లప్పుడూ ధ్యానం చేసే యోగులు మాత్రమే నన్ను చూడగలరు. అయితే ఇప్పుడు నీ కోరిక తీర్చడానికే నీ మనసులో నేనొక్క క్షణం కనిపించాను. అంతేకాదు, నా మీద నీకున్న భక్తి చెదరిపోకుండా ఉండేలా చేసాను. నువ్వు ఈ దేహం విడిచిపెట్టు. సృష్టి లయం పొందిన ఆ రాత్రి గడిచి మళ్ళీ సృష్టి ఆరంభమైనప్పుడు నువ్వు ఇప్పుడున్న జ్ఞానంతో ఏ దోషమూ లేకుండా జన్మిస్తావు. సద్భక్తితో శుద్ధ సాత్వికులలో అందరికన్నా పైన ఉంటావు” అని.

ఈ మాటలు నాకెంతో తృప్తినిచ్చాయి. ఆ తర్వాత నేను హరి నామాలు జపిస్తూ హరి చెప్పిన సమయం కోసం నిరీక్షించాను. ఓ రోజు మృత్యువు చేరువయ్యింది. అప్పుడు హరి చెప్పినట్టు ఆ దేహాన్ని విడిచిపెట్టాను. కాసేపటికే ప్రళయం సమీపించింది. ఒక సముద్రంలాంటి జలరాశిలో నిద్రపోతున్న బ్రహ్మ శ్వాసలోకి ప్రవేశించాను.

అనంతరం వేయి యుగాల కాలం గడిచింది. బ్రహ్మ లేచి లోకాలను సృజించడానికి పూనుకున్నాడు. అప్పుడు నేను మరికొందరు మునులతో కలిసి పుట్టాను. ఆ కారణంగానే నన్ను బ్రహ్మ మానసపుత్రుడు అంటారు. విష్ణువు అనుగ్రహంతో ముల్లోకాలూ సంచరించాను. నాదగ్గర ఉన్న వీణ సామాన్యమైనది కాదు. ఈశ్వరుడి ప్రసాదం. సప్తస్వరాలను ఆ వీణ తనకు తానుగా మోగేలా ఉండటం విశేషం. ఎల్లప్పుడూ నారాయణ కథా గానంతో లోకాలను సంచరిస్తూ హరి నామస్మరణ చేస్తూ ఉండేవాడిని. శ్రీమన్నారాయణుడు నా మనసులో ఎప్పుడూ ఉంటూనే ఉంటాడు. నా మనస్సు హరికథా గానంతో సదా శాంతిమయమే. అది ఒక యోగమే. ఇదీ నా పూర్వజన్మ చరిత్ర. అందుకే అంటున్నాను, సంసార సాగరాన్ని తరించాలి అనుకునే వారందరికీ శ్రీహరే రక్ష. మరో మార్గం లేదు” అని నారదుడు వెళ్ళిపోయాడు.

నారదుడు చెప్పిందంతా విన్న వ్యాసుడికి మనో వ్యథ తీరింది. హరిని స్మరించి ఓ సద్గ్రంథం రాయించమని కోరాడు. ఆ వెంటనే ఓం నమో నారాయణాయ అనే అష్టాక్షరి మంత్రం జపించి మహాభాగవతం రాయడం మొదలు పెడతాడు.
(అశ్వత్థామ పరాభవం తదుపరి భాగంలో చదువుదాం)
యామిజాల జగదీశ్
——————-