భాగవతం కథలు - 17

హిరణ్యాక్షుడి వధ

హిరణ్యకశిపుడిని ఎదుర్కొనే ధైర్యం లేక దేవతలందరూ పారిపోయారు. సాధారణ మానవులు మరో దారిలేక రాక్షసులకు లొంగిపోయారు. వాళ్ళు ఏం చెప్తే అవి పాటించసాగారు.

హిరణ్యాక్షుడు పశ్చిమ దిశను పాలించే వరుణుడిని యుద్ధానికి రమ్మనమని రెచ్చగొట్టాడు. అయితే వరుణుడు అతనితో యుద్ధం చేయడానికి ఇష్టం లేక తాను దీక్షలో ఉన్నట్టు చెప్పాడు. తాను ఇప్పుడు ఆయుధం పట్టకూడదని చెప్పాడు. పైపెచ్చు వైకుంఠం వెళ్లి శ్రీహరితో యుద్ధం చేసి నీ కోరిక తీర్చుకో అన్నాడు. హిరణ్యాక్షుడు సరేనని వైకుంఠం బయలుదేరాడు. మార్గమధ్యంలో హిరణ్యాక్షుడికి నారదుడు కనిపిస్తాడు. శ్రీహరి వైకుంఠంలో లేదని, పాతాళానికి వెళ్ళాడని చెప్తాడు. అలాగా అనుకుని హిరాణ్యాక్షుడు నేరుగా పాతాళానికి బయలుదేరుతాడు. భూమండలాన్ని కోరలపై ఉంచుకుని భీకరుడిలా కనిపించిన వరాహస్వామిని కోపంగా చూస్తాడు. దిక్కులు పిక్కటిల్లేలా గర్జిస్తాడు.
“ఓ మూర్ఖుడా! నేను బ్రహ్మ వరం పొందినవాడిని. బలవంతుడిని. ఆ బలంతోనే భూమిని తీసుకొచ్చి పాతాళంలో దాచాను. ఇదంతా నా స్వాధీనంలోనిది. నువ్వెలా తీసుకుపోగలవు? దానిని వదిలేసే. లేకుంటే నీ ప్రాణాలు తీస్తాను” అని హిరణ్యాక్షుడు అని హెచ్చరించినా వరాహస్వామి లెక్క చేయడు. ఒక్క మాటా మాట్లాడకుండా భూమాతను వరాహస్వామి తీసుకుపోతుంటాడు. అయితే హిరణ్యాక్షుడు వరాహస్వామి తనను చూసి భయపడ్డాడని తలచి వెంబడిస్తాడు.

కానీ వరాహస్వామి ఏదీ పట్టనట్టుగా భూమండలాన్ని తీసుకుని నీటి ఉపరితలం మీద నిలబెట్టి హిరణ్యాక్షుదితో యుద్ధానికి దిగుతాడు.

ఇద్దరి మధ్య యుద్ధం భీకరంగా జరుగుతుంది. చాలాసేపు యుద్ధం జరుగుతుంది. ఇంతలో బ్రహ్మదేవుడు దేవతల గణంతో వచ్చి ఆకాశంలో నిల్చుని శ్రీహరి వంక చూస్తాడు.
“శ్రీహరీ….ఈ రాక్షసుడు తానిచ్చిన వరంతో విర్రవీగుతున్నాడని, వాడిని సంహరించుకుండా ఇంకా యుద్ధం చేయడమేమిటి? ఆలస్యం చేయకుండా అంతమొందించు అభిజిత్ ముహూర్తమే వాడిని సంహరించడానికి తగిన సమయం” అని బ్రహ్మ అంటాడు.

ఆ మాటలు విన్న శ్రీహరి ఏ మాత్రం ఆగకుండా పిడికిలితో హిరణ్యాక్షుడి చెక్కిలి మీద గుద్దుతాడు. ఆ దెబ్బకు హిరణ్యాక్షుడు రక్తం కక్కుకుంటూ నేలకొరిగి ప్రాణాలు విడుస్తాడు. హిరణ్యాక్షుడి మరణంతో బ్రహ్మ తదితర దేవతలు సంతోషిస్తారు. శ్రీహరికి కృతజ్ఞతలు చెప్తారు.

ఈ ఘట్టాన్ని మైత్రేయుడు విదురుడికి వినిపించినట్లు శుకమహర్షి పరీక్షిత్తుడికి చెప్తాడు.

——————————-
….. యామిజాల జగదీశ్