భాగవతం కథలు – 21

జీవుడి స్తుతి

దేవహూతి కొడుకు కపిలుడితో చెప్పింది –

“ఓ ప్రశ్న….ఎవరైతే మాయతో మోహితులై సంసార మార్గంలో పడి కొట్టుకుని ధైర్యం కోల్పోయి దిక్కు లేకుండా శ్రీహరిని ధ్యానించడం మరణించిన వారికి, ఏ ఉపాయం లేకుండా శ్రీహరి అనుగ్రహానికి నోచుకోని వారికి ఆ పరమపురుషుడి దర్శనం ఎలా కలుగుతుందో చెప్పు?” అని.

అప్పుడు కపిలుడు “ జీవ కర్మ మార్గాలలో ప్రవర్తించే వారు తాపత్రయ నివారణ కోసం భజిస్తూ ఉంటారు…..మాతృ గర్భంలో పురీష మూత్రాలలోను, రక్తంలోనూ మునిగి తేలుతూ శరీరం దహింపబడుతూ ఉండగా ఈ మాతృ దేహం నుంచి ఎప్పుడు బయట పడతామా అని దీనంగా విలపిస్తూ గడచినా నెలలు లెక్క పెడుతూ ఆ పుండరీకాక్షుడు నన్ను ఈ గర్భ నరకం నుండి వెలికి పంపితే ప్రత్యుపకారం ఏమీ చేయలేని నేను కృతజ్ఞతా పూర్వకంగా అంజలిఘటిస్తాను. అలాంటి దీన జీవుడిన నేను శమదమాదులతో కూడిన శరీరంలో విజ్ఞాన దీపాంకురం అయిన పురాణ పురుషుడిని నిరీక్షిస్తూ ఉంటాను….కానీ ఈ సంసార చక్రంలో నిరంతరం భ్రమణం చెందుతూ ఉండాలి…కనుక ఆత్మకు సారధి వంటి విజ్ఞానంతో టమో రూపం అయిన ఈ సంసార సాగరాన్ని తరించి ఈ ఆత్మను జాగర్తగా రక్షించుకుంటాను…..తల్లి గర్భం నుండి వెలువడి విగత జ్ఞానుడై రక్త మాంసాలతో కలిసి బయల్వడి నేలపై పడి తనకు కావలసింది చెప్పలేక ఇతరుల దయా దాక్షిణ్యాలపై ఆధార పడి జీవిస్తాడు. కొన్ని సార్లు నల్లులూ, దోమలూ శరీరాన్ని కుడుతూ ఉంటే శయ్యలో పడి ఉంటూ ప్రతిక్రియ ఏమీ చెయ్యలేక రోదిస్తాడు. యవ్వనం రావడంతోనే తాను కోరుకున్న వాటికోసం తరచూ అహంకార మమకారాలు ప్రదర్శిస్తాడు….అజ్ఞానంతో దుష్కర్మలు చేస్తాడు. సత్యం, శౌచం, దయ, ధృతి, మౌనం, బుద్ధి, సిగ్గు, క్షమా, కీర్తి తదితర సుగుణాలు దుర్జనుల వల్ల నశిస్తాయి. మూర్ఖులు శాంతిని కోల్పోతారు. స్త్రీ వ్యామోహంతో అడ్డదిడ్డంగా వ్యవహరిస్తారు. ఇందుకు ఒక ఉదాహరణ చెప్తాను. దుర్జనుల సాంగత్యం తగదు. ఎందుకంటె అంగనా సంగమం దోషం అని పెద్దల అభిప్రాయం….

(ఆ కథ తదుపరి భాగంలో చూద్దాం)
– యామిజాల జగదీశ్