భాగవతం కథలు – 25

దక్షప్రజాపతి సంతతి….

సాయంభువ మనువు తన కుమార్తె ప్రసూతిని దక్ష ప్రజాపతికి ఇచ్చి పెళ్లి చేసాడు. దక్షప్రజాపతి దంపతులకు పదహారు మంది కుమార్తెలు పుట్టారు. వారిలో పదమూడు మంది ధర్మువు భార్యలు. స్వాహాదేవి అగ్ని దేవుడికి, మరో భార్య పితృదేవతలకు, ఇకొక కుమార్తె శచీదేవిని దక్షుడికి ఇచ్చి పెళ్లి చేసారు.

ధర్మదేవుడి భార్య శ్రద్ధ వల్ల శ్రుతము, మైత్రి వల్ల ప్రసాదము, దయ వల్ల అభయము, శాంతి వల్ల సుఖము, తుష్టి వల్ల ముదము, పుష్టి వల్ల స్మయము, క్రియ వల్ల యోగము, ఉన్నతి వల్ల దర్పము, బుద్ధి వల్ల అర్ధము, మేధ వల్ల సమతి, తితిక్ష వల్ల క్షేమము, హ్రీ వల్ల ప్రశ్రయము, ఇలా ఎందరో పుట్టారు. చివరగా, మూర్తి వల్ల సకల కళ్యాణ గుణాలకు ఉత్పత్తి స్థానాలుగా నరనారాయణులు అనే ఇద్దరు ఋషులు శ్రీహరి అంశతో జన్మించారు. వారి జన్మ సమయంలో వాయువు మెల్లమెల్లగా అనుకూలమై వీచింది. అన్ని దిక్కులూ స్వచ్చత పొందాయి. లోకాలన్నీ ఆనందం చెందాయి. దేవదుందుభులు మ్రోగాయి. సముద్రాలు కూడా కలకబారి శాంతం అయ్యాయి. నదులు స్వచ్చంగా ప్రవహించాయి. గంధర్వులు, కిన్నరులు మధుర గానం చేసారు.

అప్సరో జనం నాట్యం చేసారు. దేవతలు పుష్ప వర్షం కురిపించారు. మునిజనులు సంతోషం పొందారు. సమస్త విశ్వం మంగళ పూర్వకమై అలరారింది. అప్పుడు బ్రహ్మ తదితర దేవతలు వారి వద్దకు వచ్చి స్తుతించారు….

( ఇంకా ఉంది )

– యామిజాల జగదీశ్