భాగవతం కథలు - 28

ప్రచేతసులకు భగవంతుడి వరాలు

ప్రచేతసులు తండ్రి ఆజ్ఞానుసారం జలం మధ్యలో తపస్సు చేశారు. వారి తపస్సుకి మెచ్చి శ్రీహరి ప్రత్యక్షమయ్యాడు. శ్రీహరిను చూసి వారు ఆనందం పొందారు. వారిని చూసి శ్రీహరి ఇలా చెప్పాడు –

“తపోధనులారా, మీరందరూ కలిసిమెలసి ధర్మమార్గంలో నడవడం నాకు ఆనందంగా ఉంది. మీరు ఏం కోరుకుంటారో కోరుకోండి” అన్నాడు.

“రోజూ మీరు నిద్ర నుంచి లేవడంతోనే మిమ్మల్ని స్మరించే వారికి అన్నీ మంచే జరుగుతాయి. వారికి ముక్తి కూడా కలుగుతుంది. మీకు ఉపదేశించిన నా స్తోత్రం కలిగిన రుద్ర గీతాన్ని పారాయణ చేసే వారికి వారు కోరుకున్నవన్నీ జరుగుతాయి. పితృవాక్య పరిపాలకులు మీరు. మీ కీర్తి ముల్లోకాలలో అందరూ చెప్పుకుంటారు. మీకు వంశవర్ధనుడైన బ్రహ్మ జ్ఞాన పరిపూర్ణుడైన కుమారుడు కలుగుతాడు. పూర్వం కండూ మహర్షి కఠోర తపస్సు చేస్తుంటే అతని తపస్సుకి భంగం కలిగించడానికి ఇంద్రుడు ఓ అప్సరసను పంపాడు. ఆమె పేరు ప్రమోచ. ఆ మహర్షి ఆమెను చూడడంతోనే తపస్సు మానేసి ఆ అప్సరసతో సన్నిహితంగా మెలుగుతాడు. సంగమిస్తాడు. దాంతో ఆమె గర్భవతి అవుతుంది. ఆమెకు ఓ కుమార్తె పుట్టింది. అయితే ఆ అప్సరస ఆ బిడ్డను తీసుకువెళ్ళకుండా ఓ చెట్ల తోపులో విడిచిపెట్టి స్వర్గానికి పోతుంది. ఆ పాపను సోముడు అనే అతను చూసి కనికరించి పెంచుతాడు. ఆ అమ్మాయి పేరు మారిష. మీరు ఆ కన్యను పెళ్ళి చేసుకోండి. ఆమె వల్ల మీ పది మందికి సుఖం కలుగుతుంది. మిమ్మల్ని ఆమె ఎంతో ఆదరంతో చూసుకుంటుంది. సంసార సౌఖ్యం కలిగిన తర్వాత మీకు వైరాగ్యం కలుగుతుంది. అప్పుడు మీరందరూ నా సన్నిధికి చేరుకుంటారు. అంతేకాదు, సంసార జీవితంలోనూ మీకు నా మీదున్న భక్తి ఏ మాత్రం తగ్గిపోదు. కనుక మీరు సంసార మోహంలో చిక్కుకోవడం జరగదు” అని చెప్తాడు.

ఈ వరాలన్నింటిని శ్రీహరి ప్రచేతసులు కోరకుండానే ఇచ్చాడు. దాంతో వారందరూ అమితానందం పొందారు. శ్రీహరికి సద్భక్తితో నమస్కరిస్తారు. మీ సాక్షాత్కారం మాకు లభించడం గొప్ప వరం. నీ మాయ మమ్మల్ని దాటకుండా నీ భక్తులతో సాంగత్యం ఉండేలా వరం ఇప్పించమని కోరుతారు. హరిభక్తుల సాంగత్యంలో కలిగే ఆనందపారవశ్యంలో స్వర్గ సౌఖ్యాల వల్ల కలిగే ఆనందం లక్షో వంతు కూడా అవదు. అలా వరం వేడుకొన్న ప్రచేతసులకు వరం అనుగ్రహించి శ్రీహరి అంతర్థానం అవుతాడు.

ఆ తర్వాత ప్రచేతసులు జల మధ్యం నుంచి బయటకు వస్తారు. అలా బయటకువచ్చిన వారికి అక్కడి సమీపంలో దట్టమైన అరణ్యం కనిపిస్తుంది. వారికి ఎటూ దారి కనిపించదు. తమ మార్గాన్ని అరికట్టిన చెట్లపై వారికి కోపం వస్తుంది. వారి అగ్రహానికి అక్కడి వృక్షాలు ఒక్కొక్కటే కాలి బూడిదవుతాయి. అప్పుడు బ్రహ్మ ప్రత్యక్షమై వారితో ఇలా అంటాడు ….

“ఇదిగో ఈ వృక్షాలేవీ తమంతట తాముగా ఏ అపకారం చేయలేదు. అటువంటి చెట్లను మీరు మీ కోపంతో బుగ్గిపాలు చేయడం సరికాద”ని శాంతింపజేశాడు. దాంతో వారి కోపానికి గురికాని మిగిలిన వృక్షాలు తమ ఆశ్రయంలో ఉన్న ప్రమోచ కుమార్తె మారిషను వారికి అర్పించాయి.

బ్రహ్మ ఆజ్ఞగా వారందరూ మారిషను భార్యగా స్వీకరిస్తారు. దైవసంకల్పంతో పది మందికి భార్య అయిన ఆమె అందరినీ సమభావంతో చూసింది. ప్రచేతసులతో మారిషకు ఓ కుమారుడు పుడతాడు. అతని పేరు దక్షప్రజాపతి. కర్తవ్య నిర్వహణలో దక్షత చూపిన ఆయనకు తర్వాతి కాలంలో దక్షుడు అనే పేరు స్థిరపడింది.

మరికొంతకాలానికి ప్రచేతసులు మోక్ష కాంక్షతో భార్యను. కుమారులను విడిచిపెట్టి ఓ సముద్ర తీరాన మళ్ళీ తపస్సు చేయడం మొదలుపెడతారు. వారి వద్దకు నారదుడు వచ్చి ఆత్మతత్వం గురించి చెప్పమంటారు. అలాగే అని నారదుడు వారికి ఆత్మతత్వం చెప్తాడు. శ్రీహరిని ధ్యానిస్తే సమస్త దేవతలను పూజించిన విశేష ఫలితం దక్కుతుందంటాడు నారదుడు.

వారందరూ అలాగే అని నారాయణుడిని సేవించి అతని అనుగ్రహానికి పాత్రులవుతారు.
– యామిజాల జగదీశ్