భాగవతం కథలు - 29

ప్రియవ్రతుడు పరమ భాగవతోత్తముడు. నిరంతరం ఆత్మారామ తత్పరుడు.

శ్రీహరి పాదపద్మాలలోని మకరందాన్ని ఆస్వాదించి తన్మయత్వం పొందిన భక్తుడికి ఎన్ని ఆటంకాలు ఎదురైనా తన భక్తి మార్గాన్ని విడవడు. అదే అతని వల్ల తెలుసుకోగల విషయం.

స్వాయంభువ మనువు హరిసేనా తత్పురుడు అయిన తన కొడుకు ప్రియవ్రతుడిని రాజ్యపాలన చేయమని చెప్తాడు.

అయితే ప్రియవ్రతుడు రాజ్యపాలనలో ఉండిపోతే తన భక్తి జ్ఞానానికి ఆటంకం ఎదురవుతుందని అందుకు అంగీకరించడు.

అప్పుడు బ్రహ్మదేవుడు స్వయంగా దేవతలతో వచ్చి ప్రియవ్రతుడికి నచ్చచెప్పడానికి ప్రయత్నిస్తాడు.

“ఓ ప్రియవ్రతుడా….నేను ఉత్తినే రాలేదు. సాక్షాత్తు ఆ శ్రీహరి సందేశం చెప్పడానికి వచ్చాను. నువ్వు సావధానంగా విను. ఆయన మాట వినడమే కాదు పాటించు. ఆయన ఆదేశం వల్ల నువ్వు కొంతకాలమైనా రాజ్యాన్ని పాలించక తప్పదు. ఆ పాలన వల్ల నీ జ్ఞానానికేమీ అంతరాయం కలగదు” అని బ్రహ్మ అనడంతో చేసేదేమీ లేక ప్రియవ్రతుడు అలాగేనని రాజ్యపాలనకు అంగీకరిస్తాడు.

అనంతరం ప్రియవ్రతుడు కంటికిరెప్పలా కన్నతండ్రిలా రాజ్యపాలన చేస్తాడు. ప్రజలకు ఏ కష్టం రానివ్వకుండా చూసుకుంటాడు.

అంతేకాదు, విశ్వకర్మ కుమార్తె బర్హిష్మతిని పెళ్ళాడతాడు. వారికి పది మంది కుమారులు, ఒక కుమార్తె పుడతారు. కుమార్తె పేరు ఊర్జస్వతి. కుమారుల విషయానికి వచ్చేసరికి వారిలో కవి, మహావీరుడు, సవనుడు ఆత్మతత్వ సంపన్నులు. భక్తియోగాన్ని సాధించిన వారుగా ఈశ్వర తాదాత్మ్యం పొందారు.

ప్రియవ్రతుడికి మరొక భార్య వల్ల ఉత్తముడు, తామసుడు, రైవతుడు అని ముగ్గురు కొడుకులు పుడతారు. వీరు ముగ్గురూ కఠోర తపస్సు చేసి మన్వంతర అధిపతులయ్యారు. ఇక కూతురు ఊర్జస్వతి భార్గవుడిని పెళ్ళాడుతుంది. భార్గవుడు ఒక ముని. వీరికి దేవయాని అనే కూతురు పుడుతుంది.

ప్రియవ్రతుడు తన శౌర్యంతో పరాక్రమంతో సామ్రాట్ అనిపించుకుంటాడు. తనతో యుద్ధం చేసి గెలిచేవారే లేకపోవడంతో అతనేమీ ఉత్తినే కూర్చోలేదు. సోమరిపోతుగా ఉండడం ఇష్టం లేక సూర్యుడికి మరుగున ఉండిపోయిన లోకాలలో చీకటిని పోగొట్టడానికి సంకల్పించుకుంటాడు. సూర్యుడి రథ వేగానికి ధీటుగా గల రథాన్ని ఎక్కి సూర్యుడికి ప్రతిగా సూర్యుడిలా ప్రకాశిస్తూ ప్రయాణం చేస్తాడు. తాను ప్రయాణం చేసిన చోట్లల్లా పగటి వెలుగు ఉండేలా చూస్తాడు. అతని రథం వెళ్లిన చోటల్లా సప్తసముద్రాలకూ గల భూసంధులుగానూ, సప్త ద్వీపాలుగానూ తయారవుతాయి. ఆ ద్వీపాలలో జంబూ ద్వీపం లక్ష యోజనాల పరిమితి కలది. అంతేకాదు, తన కొడుకులను ఏడు ద్వీపాలకు అధిపతులుగా చేస్తాడు.

ఆ తర్వాత ప్రియవ్రతుడు విరక్తి చెంది రాజ్యాన్ని విడిచిపెట్టి నారదుడి ఉపదేశాన్ని అనుసరించి విష్ణుసాన్నిధ్యం పొందుతాడు.

– యామిజాల జగదీశ్