భాగవతం కథలు - 3

విదురుడు కాలగతిని తెలుసుకుంటాడు. ఆ విషయాన్ని ధృతరాష్ట్రుడికి చెప్తాడు.
“రాజా! నువ్వు పుట్టు అంధుడివి. పైగా పెద్దవాడివైపోయావు. నిన్ను ముసలితనం కప్పుకుంది. నీ బంధువులు మరణించారు. కొడుకులు పోయారు. నువ్వూ, నీ భార్యా దిగాలు పడుతూ ఇతరుల దయా దాక్షిణ్యాలపై ఎవరో ఒకరి మీద బతకడం హీనమైంది. నీ వాళ్ళు పాండవుల భార్య ద్రౌపదిని నానారకాలుగా అవమానించారు. వారిని అడవులపాలు చేశారు. కానీ ఇప్పుడు నువ్వు వారి దాక్షిణ్యం మీద బతకాల్సి ఉంది. అది నీకు అవసరమా…..కన్న కొడుకులకు బుద్ది చెప్పుకోలేక వంశాన్ని నాశనం చేసుకున్న ఈ అంధుడికి పిండం పడేస్తే తిని ఓ మూల కూర్చుంటాడు అని భీముడు ఏవేవో మాటలు అంటూ ఉంటె నువ్వు ఎలా అన్నం తినగలవు? నీ బిడ్డలు ఎవరూ లేరు. మనవళ్ల ముచ్చటలు చూడాలనుకుంటున్నావా? ఎవరికైనా దానం చేసే స్థితిలో ఉన్నావా? ఈ దేహం ఉంది చూశావూ…అది శాశ్వతం కాదు. మోహాలు వీడి మునుల ప్రవర్తన కలవారూ, ఆశ్రమవాసం చేసే వాళ్ళు ముక్తి పొందగలరు” అని విదురుడు ధృతరాష్ట్రునికి నాలుగు వైరాగ్యపు మాటలు చెప్తాడు.
ఆ మాటలకు దృతరాష్ట్రుడు సంసారం మీద మోహం, పాశం వదిలించుకుని నగరం నుంచి వెళ్లిపోవడానికి నిర్ణయించుకుంటాడు.
ఒకానొక రాత్రి దృతరాష్ట్రుడు, గాంధారి, విదురుడు ఎవరికీ చెప్పకుండా తెలియకుండా ఇల్లు విడిచిపెట్టి హిమవత్ పర్వత ప్రాంతానికి వెళ్తారు. దృతరాష్ట్రుడు యోగాగ్నితో శరీరాన్ని దహించుకుంటాడు. గాంధారి కూడా అగ్నిప్రవేశం చేస్తుంది.
మరుసటిరోజు హస్తినలో ధర్మరాజు సంధ్యావందనం కానిచ్చుకుని నిత్య హోమం తర్వాత అలవాటు ప్రకారం పెదనాన్నకు, పెత్తల్లికి నమస్కరిద్దామని వారుండిన మందిరానికి వెళ్తాడు. అక్కడ దృతరాష్ట్రుడు గానీ గాంధారి కానీ విదురుడు కానీ కనిపించరు. సంజయుడు కనిపిస్తాడు. అతనిని అడుగుతాడు పెదనాన్న, పెద్దమ్మ ఏరీ అని…విదురుడు కూడా లేరేమిటి అని అడుగుతాడు ధర్మరాజు.
అప్పుడు సంజయుడు ఇలా చెప్పాడు –
“ధర్మరాజా! నిన్న విదురుడితో సమావేశమై చాలాసేపు మంతనాలు చేశారు. రోజూ రాత్రి పూట నన్ను పిలిపించుకుని ఏవైనా కొత్త విషయాలు ఉంటే చెప్పమనేవారు. కానీ నన్ను పిలిపించుకోలేదు. ఉదయం లేచి చూస్తే విదురుడితో పాటు దృతరాష్ట్ర దంపతులుకూడా లేరు. వాళ్ళ ముగ్గురూ ఎటు వెళ్లారో కూడా తెలీదు” అని విలపిస్తాడు.
ఇంతలో నారదుడు తుంబురుడితో కలిసి అక్కడికి వస్తాడు. నారదుడితో ధర్మరాజు విషయం చెప్పి బాధపడతాడు.
అంతట నారదుడు “ఈ ప్రపంచం ఈశ్వర ఆధీనం. ఈశ్వరుడు సర్వభూతాలను కలిపి మరికొంతకాలానికి వారి మధ్య ఎడబాటు కల్పిస్తాడు. లోకాలన్నీ ఈశ్వర ఆజ్ఞ పాటించాల్సిందే. మనుషులకే కాదు జంతువులకు కూడా ఈ సంయోగ వియోగాలు తప్పవు. ఆనందం, ఆవేదనా తప్పవు. ఈ శుద్ధ బ్రహ్మ రూపంలో రెండూ కలిసే ఉంటాయి. కొండచిలువ మింగేసిన మనిషిని మరొకరు కాపాడలేరు. అలాగే ఈ దేహం పంచభూత మయం. కాల కర్మ గుణ ఆధీనం. ఈ సృష్టిలో బలహీనుడు బలవంతుడికి ఆహారం అవుతాడు. ఏదేమైనా ఈ విశ్వం అంతా ఈశ్వర మయం. అతని నుంచి దేనినీ వేరు చేసి చూడటం అసాధ్యం. కనుక తల్లిదండ్రులు నన్ను విడిచిపెట్టి ఏమైపోతారో అని నువ్వు బాధపడకు. ఆ విషయం ఆలోచించకు. విష్ణువు అసురుల అంతానికి శ్రీకృష్ణుడిగా అవతరించాడు. రాక్షసుల నాశం చేసి అవతార సమాప్తి కోసం చూస్తున్నాడు. కాలానికి ఎవరూ అతీతులు కారు. నువ్వు బాధ పడకు. దృతరాష్ట్రుడు, గాంధారి, విదురుడు ముగ్గురూ కలిసి హిమవత్ పర్వత దక్షిణ ప్రాంతంలో ఉన్న ఒక ఆశ్రమానికి వెళ్లారు. దృతరాష్ట్రుడు ఎప్పటిలాగానే హోమం చేసి సమస్త కర్మలూ విడిచిపెట్టాడు. అతను శరీరాన్ని విడిచిపెట్టాడు. యోగాగ్ని అతని దేహాన్ని దహించించింది. గాంధారి కూడా ఆ అగ్నిలోకి ప్రవేశిస్తుంది. . వారి మరణాలను చూసిన విదురుడు అటు తర్వాత తీర్థయాత్రలకు వెళ్ళాడు” అంటాడు.
అనంతరం తుంబురుడు, నారదుడు కలిసి స్వర్గలోకానికి వెళ్లారు.
———————————–
యామిజాల జగదీశ్