భాగవతం కథలు - 30

అగ్నీధ్రుడి చరిత్ర

ప్రియవ్రతుడు కుమారుడు అగ్నీధ్రుడు. తండ్రి రాజ్యాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయిన తర్వాత అగ్నీధ్రుడు జంబూద్వీపానికి రాజై ప్రజలందరినీ కన్నబిడ్డలుగా పరిపాలించాడు. అతని పాలనలో ప్రజలు ఆనందంగా ఉన్నారు. తమ రాజు అగ్నీధ్రుడంటే వారందరికీ ఎంతో అభిమానం. అంతా బాగానే ఉంది. కానీ అతనికి చాలాకాలం వరకు పిల్లలు కలగలేదు. దాంతో అతను సంతతి కోసం మందరపర్వతశ్రేణులను చేరుకుని అక్కడ బ్రహ్మ అనుగ్రహం కోసం తపస్సు చేయడం మొదలుపెడతాడు. అతని తపస్సుకు మెచ్చి బ్రహ్మ పూర్వచిత్తి అనే అప్సరసను అగ్నీధ్రుడు దగ్గరకు పంపుతాడు. ఆమె సౌందర్యవతి. ఆమె వస్తూంటేనే పరిసరాలన్నీ ప్రకాశవంతమై వెలిగిపోతుంటాయి. ఆమె హావభావాలు చూసి అగ్నీధ్రుడు సంతోషిస్తాడు. ఆమెను దగ్గరకు పిలిచి వివరాలు అడుగుతాడు. వనదేవతవా లేక ఎవరివో చెప్పమంటాడు. తనతో కలిసి తపస్సు చేయమని కోరుతాడు. ఇద్దరం కలిసి చేస్తే ప్రజావృద్ధి కలుగుతుందంటాడు.

“ప్రజాపతి బ్రహ్మ అందుకోసమే నిన్ను ఇక్కడకు పంపా”డని చెప్తాడు.

ఇంకా ఇలా అంటాడు…
“కనుక నిన్ను విడిచిపెట్టే ప్రసక్తే లేదు. నువ్వు నాతో కలిస్తే చెలికత్తెలు కూడా ఏమీ అనరం” టాడు.

అగ్నీధ్రుడి మాటలకు ఆమె తృప్తి చెందుతుంది. అంతేకాదు, అతని అందాన్ని తెగపొగుడుతుంది.

వీరిద్దరి పెళ్ళి మన్మథుడు దగ్గరుండి జరిపిస్తాడు.

అనంతరం రాజు ఆమెతో కలిసి నగరానికి వస్తాడు.

అతను పూర్వచిత్తితో సర్వసుఖాలు అనుభవిస్తాడు. జంబూద్వీపాన్ని అతను లక్ష సంవత్సరాలు పాలిస్తాడు. ఇతనికి పూర్వచిత్తి వల్ల తొమ్మిదిమంది పిల్లల పుడతారు.
దీంతో తాను భూలోకానికి వచ్చిన పని పూర్తయినట్టు నిర్థారించుకుని ఆమె బ్రహ్మలోకానికి వెళ్లిపోతుంది.

ఆ తర్వాత అగ్నీధ్రుడు కొడుకులైన నాభి తదితర సాహసవంతులు జంబూద్వీపాన్ని పాలించి మేరు కుమార్తెలయిన మేరుదేవి తదితరులను పెళ్ళాడతారు.
– యామిజాల జగదీశ్