భాగవతం కథలు - 4

ధర్మరాజు చింత
—————————
ధర్మరాజు తమ్ముడు భీముడిని పిలిచి మాట్లాడుతాడు.

“పంటలూ, ఔషధాలూ ఏక కాలంలో పండుతున్నాయి. మరో కాలంలో అసలు పండటం లేదు. ప్రజలు కోపం, లోభం, క్రూరత్వం, అబద్ధాలు చెప్తూ ప్రవర్తిస్తున్నారు. స్నేహంలో వంచనే ఎక్కువగా చోటుచేసుకుంటోంది. భర్తలతో భార్యలు గొడవపడుతున్నారు. కొడుకులేమో తండ్రులు చస్తే చాలని ఎదురుచూస్తున్నారు. శిష్యులేమో గురువులను నిందిస్తున్నారు. పైగా వారితో ఉండటానికి ఇష్టపడక వెళ్లిపోతున్నారు. ఎవరూ శాస్త్రాలను పట్టించుకోవడం లేదు. ఈనాటి కాల పరిస్థితులు చూస్తుంటే బాధ కలుగుతోంది.

పైగా శ్రీకృష్ణుడిని చూసి యిట్టె వస్తానని చెప్పి వెళ్లిన అర్జునుడు నెలరోజులైనా ఇంకా తిరిగిరాలేదు. యాదవులు అందరూ సుఖసంతోషాలతో ఉన్నారంటావా? చారులెవ్వరూ రావడం లేదు….ఏ విషయమూ తెలియడం లేదు….మనస్సు ఏదో కీడుని శంకిస్తోంది. ఈశ్వరుడి నిర్ణయం ఏమిటో మనకు తెలీదు కదా? మనసంతా వికలమై ఉంది. ఎటు చూసినా ఏమిటోగా అనిపిస్తోంది. శ్రీహరి నిన్నమొన్నటి వరకు మనలను కాపాడుతూ వచ్చాడు. ఇప్పుడు శ్రీహరి ఎలా ఉన్నాడో ? ఏమనుకుంటున్నాడో? తెలియడం లేదు. నారదుడు చెప్పినట్లు కాలం అనుకూలంగా లేదనిపిస్తోంది. ఇంతకుముందే ఓ కుక్క నా ముందు మొరిగింది. సూర్యోదయం అవుతున్న సమయంలో నక్క ఎదురు వెళ్తోంది. ఆవులు నాకు అప్రదక్షిణంగా తిరుగుతున్నాయి. ఏనుగులు తమ సహజ మదాన్ని కోల్పోయి నీరసంగా ఉన్నాయి. వాటి దీనత అర్ధం కావడం లేదు. ఓ పావురం యముడి దూతలా ఎగురుకుంటూ వచ్చింది.

అగ్నిహోత్ర మందిరంలో అగ్ని జ్వలించడం లేదు. పొగలు కమ్ముకున్నాయి. భూమి కూడా తన సోంపుని కోల్పోయింది. గాలికి ఇసుకపైకెగిసిపడుతోంది. మేఘాలు రక్తాన్ని కురిపిస్తున్నాయి. గ్రహాలన్నీ తమలో తాము గొడవపడుతున్న శబ్దాలు వినిపిస్తున్నాయి. నింగీ నేలా మధ్య మంటలు వ్యాపించినట్టు కనిపిస్తోంది. బిడ్డలు తమ తల్లి పాలు తాగడం లేదు. ఒకవేళ దూడలు పాలు తాగడానికి వస్తే గోమాతలు కాలితో తంతున్నాయి. ఆలయాలలో ఉన్న ప్రతిమలు కన్నీటిని కార్చుతున్నట్లు కనిపిస్తున్నాయి. గుడ్లగూబలు పగటి పూట గూట్లో నుంచి బయటకు వచ్చి అరుస్తున్నాయి. ఎటు చూసినా తేజస్సు కనిపించడం లేదు. చూడకూడనివి చూస్తున్నట్టు అనిపిస్తోంది. ఎడమకన్ను అదురుతూనే ఉంది. ఎడమ భుజం కూడా అదురుతోంది. ఇవన్నీ చూస్తుంటే ఇంకా ఏం ఘోరాలు చూడాల్సి వస్తుందో అని భయమేస్తోంది. శ్రీకృష్ణుడి వార్తలు ఏవీ తెలియడం లేదు” అని ధర్మరాజు బాధపడుతున్న సమయంలో అర్జునుడు విచార వదనంతో తిరిగొస్తాడు.

అర్జునుడు ధర్మరాజు కాళ్లపై పడి విలపిస్తాడు.
(మిగిలిన కధ ఐదవ భాగంలో…)
———————
యామిజాల జగదీశ్