భాగవతం కథలు - 5

అర్జునుడిని ధర్మరాజు దగ్గరకు తీసుకుని మాతామహులు, మేనమామ వాసుదేవుడు, మేనత్తలు, పిల్లలు, శ్రీకృష్ణుడి సోదరులు తదితరులందరూ క్షేమమేనా అని అడుగుతాడు. ఇంద్రుడిని జయించి పారిజాతంతో వచ్చి సత్యభామ పెరట్లో నాటిన మన ఆప్తుడు క్షేమమేనా? బలరామకృష్ణులు పట్ల నీ భక్తి చెక్కు చెదరలేదుగా? పూర్వం కౌరవేంద్రుడిని విడిపించడానికి గంధర్వులతో పోరాడినప్పుడు రాని కన్నీరు ఇప్పుడెందుకు వస్తోంది? ఎవరి మనసునైనా కష్టపెట్టేవా? ఏదైనా పాపానికి ఒడిగట్టినట్టు భాదపడుతున్నావా? ఏమైందో చెప్పు అర్జునా అని ధర్మరాజు అడగ్గా అర్జునుడు కన్నీళ్లు తుడుచుకుంటూ శ్రీకృష్ణుడు చాలించిన అవతార ఘడియలను వివరిస్తాడు. శ్రీకృష్ణుడి వాళ్ళ పొందిన మేలుని చెప్తాడు.

“శత్రు రాజులు మన పట్ల గుర్రుగా ఉన్నప్పుడు ఆకాశంలో మత్స్య యంత్రాన్ని కొట్టి ద్రౌపదిని మనకు దేవేరిగా చేయించిన చక్రితోనేగా మనం అన్నింటా విజయం సాధించాం. సభలో ద్రౌపది వీడిన శిరోజాలతో రోదిస్తున్నప్పుడు అభయమిచ్చి ఆదుకున్నది అతనే కదా? శత్రువు ద్రౌపది వలువలు విప్పడానికి చేసిన ప్రయత్నానికి అడ్డుపడి అభయమిచ్చి అక్షయ వస్త్రాలు ఇచ్చి మర్యాదను కాపాడింది అతనే కదా? నాకు శివుడితో పాశుపతాస్త్రం ఇప్పించడంలో ప్రధాన కారకుడు అతనే కదా? అతని దయతోనేగా నేను ఇంద్రుడితోపాటు స్వర్గంలో అర్ధ సింహాసనం పొందగలిగాను. అతని తోడ్పాటుతోనేగా నేను కౌరవుల తలపాగాలు కత్తిరించి ద్రౌపదికి ఇవ్వగలిగాను. అతని దయా దృష్టితోనేగా రణరంగంలో శత్రువుల ఆయుధాలు నన్ను ఏమీ చేయలేకపోయాయి. నన్ను ఎంతో ప్రేమగా చూసుకున్న శ్రీకృష్ణుడు లేకుండాపోయాడు. అతను లేని లోటు పూడ్చలేనిది. కానీ ఈ దేహం ఇంకా ఎందుకు ఉందా అని బాధపడుతున్నాను. కృష్ణుడి భార్యలను అడవి మధ్యలో బోయలు ముట్టడించినప్పుడు నేను ఏమీచేయలేకపోయాను. ఇప్పుడు నేను బూడిదలో పోసిన పన్నీరైపోయాను. మునీశ్వరులు శాపాలతో యదు వీరులు పరస్పర ద్వేషంతో ఒకరినొకరు తగువులాడుకుని చనిపోయారు. శ్రీహరి చెప్పిన మాటలు నన్ను తోచుకోనివ్వడం లేదు” అని.

శ్రీకృష్ణుడు అవతారం చాలించిన తీరుని అర్జునుడు ఇలా ముగించాడు.

అంతలోనే యుద్ధరంగంలో శ్రీకృష్ణుడు చేసిన గీతోపదేశాన్ని గుర్తు చేసుకుని మళ్ళీ యధాస్థితికి వస్తాడు అర్జునుడు. గుణాలకు కారణం ప్రకృతి అని, ఆ ప్రకృతి బ్రహ్మాహం అనే జ్ఞానంలో లీనమై అణగిపోతుందని ప్రకృతిని విడిచి మళ్ళీ స్థూల శరీరాన్ని పొందకుండా పురుషుడు సమ్యక్ భోగం అనుభవిస్తాడు అని నిశ్చయించుకుని అర్జునుడు విరక్తి భావం పొందాడు.

మరోవైపు ధర్మరాజు కూడా నారదుడి మాటలు తలచుకుని స్థిరమైన చిత్తంతో స్వర్గానికి సిద్ధపడతాడు. ఇక కుంతీ కూడా కృష్ణుడు తనువూ చాలించడం తెలుసుకుని వైరాగ్యంలో పడిపోతుంది.

సంహార దృష్టిలో నిజ శరీరం పర శరీరం అంటూ భేదాలు ఈశ్వరుడికి ఉండదు. నిజ రూపంలో ఉంటూనే శ్రీహరి అవతారాలు ధరించి దుష్టులను శిక్షిస్తూ ఉంటాడు శిష్టులను రక్షిస్తాడు.

———————

యామిజాల జగదీశ్