భాగవతం కథలు - 8

అణగిమణగిన కలి
—————————
కైలాసపర్వతంలా గంభీరంగా ఉన్న వృషభరాజాన్ని కోపంలో యముడిలా ఉండి చేతిలో ఓ దండం కలిగి రాజు వేషంలో క్రూరత్వాన్ని ప్రదర్శిస్తున్న కలి ఏ మాత్రం దయలేని వాడై ఉండి కాళ్లతో బలంగా తన్నాడు. అక్కడితో ఆగలేదు. ధేనువుని కూడా బలంగా తన్నాడు.

అనంతరం ఆ కలిని చూసి బంగారు రథంపై ఉన్న అభిమన్య పుత్రుడు పరీక్షిత్తుడు “ఓరీ! నిన్ను కొమ్ములతో పొడవా…నిన్ను ఏం చేస్తే సరిపోతుంది చెప్పు..? నీ జోలికి రాని వృషభాన్ని, ధేనువునీ నిర్దయగా కాళ్లతో కొట్టావు….ఇంతకీ నువ్వెందుకు కొట్టావో చెప్పు? అవి చేసిన తప్పేమిటి? నేను నా భుజబలంతో రాజ్య పాలన చేస్తున్నాను. నా రాజ్యంలో ఎలాంటి నేరాలు జరగడానికి వీలు లేదు. నీకా విషయం తెలీదా? నువ్వెందుకు ఇంత దుర్మార్గంగా ప్రవర్తించావు? నిన్ను ఇప్పుడే శిక్షిస్తున్నాను. కృష్ణార్జులు లేరనేగా నువ్వు యథేచ్ఛగా వ్యవహరిస్తున్నావు…” అని ఆవు రూపంలో ఉన్న ధర్మదేవత వంక చూసాడు.

“అమ్మా! ఈ భూమండలంలో నువ్వు మాత్రమే కన్నీళ్లు కారుస్తున్నావు…మరే ప్రాణులూ ఇంతగా విలపించడం లేదు…నీ మీదున్న భక్తితో ఇదిగో ఇతనిని ఇప్పుడే దండిస్తాను” అన్నాడు.

అంతట ధర్మదేవత ఇలా చెప్పాడు –
“ఓ రాజా! నువ్వు పౌరవంశానికి చెందిన వాడవు.మీ పూర్వులందరూ క్రూరులను అంతమొందించి సాధువులను రక్షించారు. అందుకే కృష్ణుడు కౌరవులతో రాయబారం నడిపాడు. మా వల్ల ఏ ఇతర ప్రాణులకూ బాధ ఉండదు.మా వల్ల బాధపడుతున్న వాళ్ళెవరూ లేరు. యోగీశ్వరులు మోహంలో కూరుకుపోయి ఆత్మ సుఖమూ శోకమూ కలిగిస్తాయని అంటారు. మీమాంసకులేమో కర్మ వల్లే సుఖమూ శోకమూ కలుగుతుందని అంటారు. కానీ వీరిలో ఎవరికీ సుఖమూ శోకమూ కలిగించే శక్తి లేదు. తర్కించడానికి ఇలాంటి వాడు వీడు అని చెప్పుకోవడానికి ఏ మాత్రం వీలులేని పరమేశ్వరుడి వల్లే సర్వమూ సంభవిస్తూ ఉంటాయి” అని.

అప్పుడు పరీక్షిత్తు “నువ్వు ధర్మమూర్తివి. నీ నోటంట ధర్మమే వస్తుంది.పాపపు పనులు చేయమని చెప్పే వారు కూడా పాపాలు చేసిన వారికి పెట్టె గతే పడుతుంది. దేవ మాయ వల్ల మనస్సుకి ఘాతుక లక్షణాలు అంత తేలికగా తెలియవు. నువ్వు కృతయుగంలో తపస్సు, శౌచం, దయ, సత్యం అనే నాలుగూ నాలుగు పాదాలయ్యాయి. త్రేతాయుగంలో మొదటి మూడూ ఉంది సత్యం లేకుండాపోయింది. ద్వాపర యుగంలో రెండు పాదాలు నశించాయి. ఇక కలియుగం వచ్చేసరికి మూడు పాదాలకు నష్టం వాటిల్లింది. అంతెందుకు కలియుగం చివరలో అధర్మం కూడా పెచ్చుమీరుతుంది. ధర్మదేవత ఆవేదనకు కారణం ఇదే” అంటూ ధర్మదేవతను బుజ్జగించడానికి ప్రయత్నించాడు.
వృషభరాజాన్ని, గోవును తన్నిన కలిపై కత్తి తీశాడు. అయితే అప్పటికే కలి కాళ్లపై పడి మన్నించమని ప్రాధేయపడ్డాడు.

శరణు అన్న వారిని, ఓడిపోయిన వారిని పరీక్షిత్తుడు చంపకుండా వదిలిపెట్టాడు. “ఇప్పటికైనా దుర్జనత్వాన్ని విడిచిపెట్టి వెళ్ళిపో” అన్నాడు.

“నా రాజ్యంలో ఉండడానికి వీలు లేదన్నాడు. అసత్యం, లోభం, చౌర్యం, దౌర్జన్యం, మాయ, కపటం వంటివన్నీ దుర్హునాలు. ఇవి ఉండకూడనివి. బ్రహ్మావర్త దేశంలో యజ్ఞకర్మ నిపుణులు శ్రీహరి కోసం యాగం చేస్తున్నారు. తన కోసం యాగం చేసే వారు సుఖంగా ఉండాలనే అనుకుంటాడు శ్రీహరి. అంతేకాదు వారి మనోభీష్టాలు తీర్చడంలో వెన్నంటే ఉంటాడు. కనుక నువ్వు ఉండడానికి వీల్లేదు” అని కత్తి తీసాడు.

కలి “రాజా! నిన్ను చూస్తుంటే నా గుండె ఇప్పుడే పగిలిపోయేలా ఉంది. నువ్వు నన్ను చంపడానికి వచ్చినట్టే ఉంది. నేను ఎక్కడ ఉండాలో చెప్పు. నువ్వేం చెప్తే అది చేస్తాను” అని కాళ్ళు పట్టుకుంటాడు.

అంతటా అభిమన్యుడు “నీకు నీడ ఇచ్చేవి నాలుగు….అవి …ప్రాణివధ. స్త్రీ.. దూత్యం….పాణం. ఇక బంగారం కారణంగా నువ్వు అసత్యం, మదం, కామం, హింస, వైరం అనే స్థానాలలోనూ నువ్వు ఉండవచ్చు. మరెక్కడా నీ స్పర్శ తగలకూడదు” అని కలిని కట్టడించి ధర్మదేవతకు అప్పటికే కోల్పోయిన తపస్సు, శౌచం, దయ అనే మూడు పాదాలను తిరిగి ఇస్తాడు. ఈ చర్యతో భూమాత సంతోషిస్తుంది.

ఆ తర్వాత పరీక్షిత్తుడు సర్వసంగ పరిత్యాగి అయి గంగాతీరంలో శుకుడికి శిష్యుడిగా చేరాడు.
అందుకే పరీక్షిత్తుడి రాజ్యపాలనలో కలి తన ప్రభావం చూపలేకపోయాడు. అణగిమణగి ఉన్నాడు.
(పరీక్షిత్తుడికి శుకుడు చెప్పిన ముక్తిమార్గాన్ని తదుపరిభాగంలో చూద్దాం)
———————-
యామిజాల జగదీశ్
——————–