భాగవతం కథలు – 9

ముక్తిమార్గం

పరీక్షిత్తుడు శ్రీశుక మహర్షిని మోక్ష మార్గాన్ని చెప్పమని అడుగుతాడు.

అంతట శుకమహర్షి ఇలా చెప్తాడు –
“రాజా! నువ్వు అడిగింది బాగుంది. నువ్విలా అడిగినందుకు ఆత్మవేత్తలు కొనియాడుతారు. చెప్పుకోవడానికి వినడానికి ఎన్నో మంచి విషయాలు ఉన్నాయి. విష్ణుమూర్తి కథలు వినడం, స్మరించడం ఇలా ఎన్నో ఉన్నాయి. కానీ ఇవేవీ పట్టక కాలాన్ని వృధా చేసే వారు బాంధవ దేహాడులన్నీ సత్యమనుకుని గడిపే వారు చివరకు ఓ రోజు జీవితాన్ని అకస్మాత్తుగా చాలిస్తారు.

ద్వాపరయుగంలో నా తండ్రి కృష్ణ ద్వైపాయనుడు వేదాలకు సమానమైన భాగవతాన్ని నాతో చదివించాడు. నేను మహదానందంతో ఆ కృష్ణుడి లీలలను, విలాసాలను చదివాను.
ఇప్పుడు నీకు భాగవతం చెప్తాను. శ్రద్ధగా విను. మోక్షకాముకుడవై వింటే నీకు తప్పక మోక్షం లభిస్తుంది. భవభయం అనేది తొలగిపోతుంది. ఒట్టి సంసార తాపత్రయంతోనే రోజులు గడిపే వెర్రివాడికి ముక్తి అసాధ్యం. మనస్సుని లగ్నం చేసుకుని హరినామస్మరణ ఒక్క ముహూర్త కాలం చేసినా సరిపోతుంది ముక్తి పొందటానికి. లౌకిక సుఖాలతో తృప్తిపడే వారికి ముక్తిమార్గం తెలీదు. మోక్షం పొందిన వారికి పునర్జన్మ ఉండదు.

పూర్వం ఖట్వాంగుడు అని ఓ రాజు ఉండేవాడు. అతను మహారాజు. సమస్త భూలోకాన్ని పాలిస్తున్న రోజులవి. ఓమారు దేవతలు – రాక్షసులకు మధ్య పోరు సాగుతోంది. ఆ పోరులో ఖట్వాంగుడు దేవతల పక్షాన పోరాడాడు. అందులకు దేవతలు సంతోషించి అతనిని వరం కోరుకోమన్నారు. అప్పుడతను తనకింకా ఎంత ఆయువు ఉందో చెప్పమని అడుగుతాడు. దేవతలు సరేనని పరిశీలించి “ఇంకా నీకు ఒక్క ముహూర్త కాలం ఆయువు మాత్రమే మిగిలి ఉంది” అని అంటారు.
ఖట్వాంగుడు వెంటనే భూలోకానికి వచ్చి ఆ మిగిలి ఉన్న ఒక్క ముహూర్త కాలంలోనే హరి నామ కీర్తన చేసి ముక్తి పొందాడు. కనుక నీకు కూడా ముక్తి మార్గం కలిగేలా నేను చేస్తాను. నేను చెప్పబోయే భాగవతాన్ని నువ్వు శ్రద్ధగా విను.
(మిగతా తర్వాతి భాగంలో)