భాగవతం - 6

పరీక్షిత్తుడి పట్టాభిషేకం
—————————-
కలి ప్రవేశంతో అధర్మ గుణాలైన క్రౌర్యం, హింస, అసత్యం, కుటిల మనసు వంటివన్నీ జడలు విప్పాయి. ఒక్క పట్టణాలలోనే కాకుండా పల్లెల్లోకూడా అధర్మం ఏదో రూపంలో కనిపించసాగాయి. అప్పుడు ధర్మరాజు మనవడైన పరీక్షిత్తుడిని రాజుగా పట్టాభిషిక్తుడిని చేసాడు. ధర్మబద్ధంగా రాజ్య పాలన చేసి కీర్తిమంతుడివిగా పేరుప్రఖ్యాతులు పొందాలని ధర్మరాజు దీవించాడు.

ఇదంతా అయిన తర్వాత గజరాజులను, అశ్వాలను, ఆభరణాలను, ధన కనకాదులను, వాస్తు వాహనాలను పరీక్షిత్తుడికి అప్పగించారు.

ధర్మరాజు వైరాగ్య భావంతో నిత్యాగ్నులను ఆత్మారోపణం చేసుకున్నాడు. అహంకారాన్ని విడిచిపెట్టాడు. సకల బంధనాలను విడిచేసాడు. సకల ఇంద్రియాలను మనస్సులో ఉంచి ఆ మనస్సును ప్రాణంతోనూ, ప్రాణాన్ని ఆపణంతోనూ, ఆ ఆపానాన్ని మృత్యువుతోను, మృత్యువుని పంచ భూతాలకు ఐక్యమైన దేహంలోని, ఆ శరీరాన్ని గుణత్రయంలోనూ చేర్చాడు ధర్మరాజు. అనంతరం నార వస్త్రాలు ధరించి ధర్మరాజు మౌనం పాటించాడు. నిరాహారుడయ్యాడు. జుత్తు విరబోసుకున్నాడు. చూడటానికి ఓ పిచ్చివాడిలా కనిపించాడు. అతని స్థితి చూసి భీమార్జున సోదరులు సైతం సకల ధర్మాలు ఆచరించి శ్రీహరి పాదపద్మాలను లగ్నమైన మనస్సుతో సద్భక్తితో నిర్మలత్వాన్ని పొందారు. విషయేంద్రియాలను జయించారు. పాపముక్తులయ్యారు. నారాయణుడి పరమపదానికి పరిపూర్ణమైన ఆత్మతో చేరుకున్నారు.

ఉదాసీన బుద్దితో భర్తలు వెళ్లిపోవడంతో ద్రౌపది కూడా పరమాత్ముడైన వాసుదేవుడిలో చిత్తాన్ని చేర్చి పరమపదం చేరుకుంది.

ఆ సమయంలోనే విదురుడు కూడా ప్రభాస తీర్ధానికి వెళ్లి శ్రీహరికి తన చిత్తాన్ని అప్పగించి శరీరత్యాగం చేసాడు. దండధరుడి అంశ కావడంతో తన అధికార స్థానానికి చేరుకున్నాడు.
పంచపాండవులు, శ్రీకృష్ణుల జీవన వృత్తం పరిశుద్ధమైన మనస్సుతో చదివిన వారు హరిభక్తి కలిగిన వారుగా కైవల్యపదం పొందుతారన్నది ఫలశ్రుతి.

పరీక్షిత్తు పెద్దల కనుసన్నల్లో పెరుగుతాడు. మహాభక్తుడవుతాడు. ప్రజలకు ఏ మాత్రం కష్టం కలుగకుండా రాజ్యపాలన చేస్తాడు. ఉత్తరకుమారుడి కుమార్తె ఐరావతిని పెళ్లి చేసుకుంటాడు. పరీక్షిత్తు దంపతులకు నలుగురు కుమారులు పుట్టారు. వారి పేర్లు – జనమేజయుడు. శ్రుతసేనుడు. భీమసేనుడు. ఉగ్రసేనుడు.

పరీక్షిత్తుడి గురువు కృపాచార్యుడు. గంగా నాదీ తీరాన యాగ భాగాలు గ్రహించడానికి వచ్చిన దేవతలను ప్రత్యక్షంగా చూసిన పరీక్షిత్తు మూడు అశ్వమేధ యాగాలు చేస్తాడు. కలిని నిగ్రహించాడు.
(పరీక్షిత్తుడు, భూధర్మదేవతల సంవాదం తదుపరి భాగంలో చూద్దాం)
——————-
యామిజాల జగదీశ్
——————-