భారత్ లో ఎన్నికల సందడి

భారత్ లో ఎన్నికల సందడి
సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్‌ విడుదల
ఏడు దశల్లో ఎన్నికలు: మే 23న ఫ‌లితాలు

general election

భారత్ లో దేశవ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికల నగారా మోగింది. లోక్ సభతో పాటు త్వరలోనే పదవీ కాలం ముగుస్తున్న ఆంధ్రప్రదేశ్, ఒడిశా, సిక్కిం, అరుణాచల్ ప్రదేశ్‌ రాష్ట్రాల అసెంబ్లీలకు కూడా ఎన్నికల నిర్వహణకు కేంద్ర ఎన్నికల సంఘం ఆదివారం షెడ్యూలును విడుదల చేసింది. గత ఎన్నికల తరహాలోనే ఈసారి కూడా దేశవ్యాప్తంగా విడతల వారీగా ఎన్నికల ప్రక్రియ ముగించనుంది. చీఫ్ ఎన్నికల కమిషనర్ సునీల్ అరోరా, కమిషనర్లు అశోక్ లావాసా, సుశీల్ చంద్ర ఆదివారం సాయంత్రం ఏర్పాటు చేసిన మీడియా సమావేశం సార్వత్రిక ఎన్నికల షెడ్యూలు ప్రకటించారు. షెడ్యూలు ప్రకటించిన మరుక్షణం నుంచి దేశవాప్తంగా ఎన్నికల కోడ్ అమలులోకి వచ్చింది. లోక్ సభ 543 స్థానాలతో పాటు ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ 175, ఒడిశా 147, సిక్కిం 32, అరుణాచల్ ప్రదేశ్ 60 స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. నాలుగు రాష్ట్రాల అసెంబ్లీలతో పాటు లోక్‌సభ ఎన్నికల షెడ్యూల్‌ను కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. మొత్తం ఏడు దశల్లో ఈ ఎన్నికలు జరగనున్నాయి. ఏప్రిల్‌ 11న తొలి దశ ఎన్నికలు నిర్వహించనున్నారు. రెండో దశ ఏప్రిల్‌ 18, మూడో దశ ఏప్రిల్‌ 23, నాలుగో దశ ఏప్రిల్‌ 29, ఐదు, ఆరు దశలు మే 12, ఏడో దశ మే19న నిర్వహించనున్నట్లు అరోడా తెలిపారు. మే 23న ఎన్నికల ఫలితాలను వెల్లడించనున్నట్లు అరోడా పేర్కొన్నారు. షెడ్యూల్‌ ప్రకటనతో తక్షణమే దేశవ్యాప్తంగా ఎన్నికల కోడ్‌ అమల్లోకి వచ్చింది. ఆంధ్రప్రదేశ్‌లో 175, ఒడిశాలో 147, అరుణాచల్‌ ప్రదేశ్‌లో 60, సిక్కింలో 32 శాసనసభ స్థానాలకు ఎన్నికలు నిర్వహించనున్నారు

ఏపీలో ఏప్రిల్ 11న ఎన్ని‌క‌లు
ఆంధ్రప్రదేశ్‌లో సార్వత్రిక ఎన్నికలు ఒకే విడతలో జరుగుతాయని కేంద్ర ఎన్నికల కమిషనర్ సునీల్ అరోరా స్పష్టం చేశారు. మొత్తం 22 రాష్ట్రాల్లో ఒకే దశలో పార్లమెంట్ ఎన్నికలు జరగనుండగా.. తెలుగు రాష్ట్రాల్లో మాత్రం ఒకే దశలోనే జరగనున్నాయి. ఏపీలోని 25 లోక్‌సభ స్థానాలకు గాను ఏప్రిల్ 11న ఎన్నికలు జరగనున్నాయి. కాగా మే 23న కౌంటింగ్ జరగనుంది.

నోటిఫికేషన్ వివరాలు..
– మార్చి 18న తొలి విడత ఎన్నికల గెజిట్‌ నోటిఫికేషన్‌
– మార్చి 18 నుంచి 25వ తేదీ వరకు నామినేషన్ల ప్రక్రియ
– మార్చి 26న నామినేషన్ల పరిశీలన
– నామినేషన్ల ఉపసంహరణకు మార్చి 28 గడువు
– మే 23న ఓట్ల లెక్కింపు

అభ్యర్థులకు ఈసారి కొత్త రూల్స్
ప్రస్తుతం సోషల్ మీడియా ఎంతటి విశ్వరూపం చూపిస్తుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. సోషల్ నెట్వర్కింగ్ సైట్ల కారణంగా ఎన్నికలు సైతం ప్రభావితమవుతున్న ఉదంతాలు ఎక్కువవుతున్నాయి. ముఖ్యంగా, ఓటర్ నాడి పట్టడానికి, అతడిని ఆకర్షించడానికి సామాజిక మాధ్యమాన్ని మించింది లేదని ఆయా పార్టీలు ప్రత్యేకంగా విభాగాలు ఏర్పాటు చేసుకోవడం ఈ కోవలోకే వస్తుంది. అందుకే, కేంద్ర ఎన్నికల సంఘం ఓటరును ప్రలోభపెట్టే పార్టీలు, వ్యక్తులను నియంత్రించేందుకు కొత్త నియమావళి రూపొందించింది. తాజాగా విడుదల చేసిన ఎన్నికల షెడ్యూల్ సందర్భంగా అభ్యర్థులకు కొన్ని సూచనలు చేసింది. ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు నామినేషన్ పత్రాల్లో తప్పనిసరిగా తమ సోషల్ మీడియా అకౌంట్ల వివరాలను కూడా పొందుపరచాలని స్పష్టం చేసింది. అంతేకాదు, ఆన్ లైన్ లో దర్శనమిచ్చే రాజకీయ ప్రకటనలకు ఇకమీదట ముందస్తు ధృవీకరణ తప్పనిసరి అని, ఈ మేరకు గూగుల్, ఫేస్ బుక్, ట్విట్టర్, యూట్యూబ్ సంస్థలు రాజకీయ ప్రకటనను పూర్తిగా పరిశీలించిన మీదటే అనుమతించాలని కేంద్ర ఎన్నికల సంఘం మార్గదర్శకాలు జారీచేసింది. ఇలాంటి రాజకీయ ప్రకటనలకు సంబంధించిన ఫిర్యాదుల కోసం ప్రత్యేకంగా గ్రీవెన్స్ ఆఫీసర్ ను కూడా నియమిస్తున్నట్టు ఈసీ పేర్కొంది. అంతేకాదు, ఓ అభ్యర్థి సామాజిక మాధ్యమాల్లో చేసే రాజకీయ ప్రచారానికి అయిన ఖర్చును కూడా ఎన్నికల ఖర్చుల పట్టికలో రాయాల్సిందేనని స్పష్టం చేసింది.

Send a Comment

Your email address will not be published.