భోగి పళ్ళు

అప్పాలు, పప్పన్నం, కూరగాయల పులుసు
పాయసం, ఫలహారం, పాల సరిపెల వరస
సకినాలు, చలిమిడి, చక్ర పొంగలంట
సంక్రాంతి వంటలై వెలిగెనూ తెలిగింట

నిండుగా భోంచేసి దాన ధర్మాలిచ్చి
రోజంత ఎడతెగని సందల్లంట
రాజభోగాలోలుకు రైతన్నలంట
అవనిలో లేదంట ఇట్లాంటి పండగంట

సుర దేవ గణాలు శుభం శుభమ్మనగా
అమ్మ గోదాదేవి భోగియై కీర్తింప
చలి పులికి భాస్వరుడు వణికొణికి రావంగ

వనితలందరు గూడి రంగవల్లులు దిద్ద
గొబ్బమ్మ పాటలూ గుమ్మడి పూలూ
రావమ్మ మహాలక్ష్మి సాదరమ్ముగ మాఇంట
హరిదాసు గానాల గంగిరెద్దులు గూడి
నట్టింట తారాడు ధాన్యలక్ష్మి సిరులు
వాకిట్లో సింగారి జోడెడ్ల బండ్లు

ఆడపడుచుల తోడ అరుదెంచే అల్లుళ్ళు
బావమరదులు గూడి పేకాట రాయుళ్ళు
సురకత్తి చిందులతో కోడె పందేలు

మూడు తరాల వారికి పితృ తర్పణలు
పిల్లలందరికీ భోగి పళ్ళ దీవెనలు

భోగిమంటల తోడు చలికాచుకుంటుంది
సంకురేతిరి నాడు సంబరపడిపోతుంది
కనుమ పండగ రోజు కధ కంచి కెల్తుంది
నా పల్లె నిండుగా తెలిగింటి సాక్షిగా

కవితలా కధనాల కరదీపికంట
పల్లె మల్లె లాంటి తెలుగు మల్లంట
తెలుగువారికెపుడూ తోడుంటదంట
సిరుల పంటల కూడు సుభాశీస్సులంట

—-మల్లికేశ్వర రావు కొంచాడ