మనిషి - మతము

ఆత్మనెరుగని వాడు అమితభక్తి తోడ
ఎన్ని రాళ్లకు మ్రొక్కి ఏమి ఫలము?
అంతరాత్మ మాట నాలకించని నాడు
ఎన్ని వేదములు చదివి ఏమి సుఖము??

మూడు గీతలు నిలువు వైకుంఠనీతి
అడ్డముగ ఆ మూడే శివుని రీతి
పరమాత్మ దాల్చినవి పదివేల రూపాలు
అభిమతము మేలైన మతము ఒక్కటి చాలు

గడుసరి గోపాలుడేమో గొల్లవాడు
రఘువంశ నందనుడేమో క్షత్రియపుత్రుడు
సగము మనిషే కాదు ఉగ్రనరసింహుడు
గుణము గొల్చితిమేగాని కులము కాదు

మనసు మలినమును కడుగునది మతము
మనిషికి మనిషికి నడుమ వారథి మతము
జననమరణ చక్రబంధనము విడిపించు
మోక్షమార్గమున దివ్యరథము మతము