మన్మధోత్సాహాష్టకం

వాన వలయు నంత కురిసి, వరద బెడద లెడ ములై
బోనములకు కరువులేక , భూమి సస్య భరితమై
తాను పరుల బేధ మింకి , తత్వ చింతలధికమై
మానవాళి శుభము కొరకు, మన్మధమ్మ రాగదే

మనసు “మదన కాము” బారి ,మరుగు యర్ధ మొక్కటే
జనులు తలచు వైనమేగి, మనసుల మధనమ్ముతో
మౌనులయ్యి మానసమున ,మాయ వీడు వెల్గులో
జ్ఞాన నేత్ర వహ్ని తగుల , మన్మధమ్మ బెట్టవే

జన్మ లెన్నొ యె త్తి కూడ , జ్ఞప్తిలేక బొత్తిగా
తన్మయత్వ మొంది దేహ, మాత్మ యంచు భ్రాంతితో
సన్మతులగు వారి మంచి ,సంగములను కోరకన్
జన్మ మృత్యు శృం ఖ లముల, మన్మ్ధధమ్మ కట్టకే

దేవు డేడ ?యేడ ?యంచు దేవులాట చాలులే
తావు లేదు తాను లేని తడవు లేదు తరచినన్
చావు పుటుక కంద కుండ , జగము నిండి మించు యా
” మావి ” వెనుక మాయ పతిని మన్మధా మధించవే

బూడిదైన నేమి నిన్ను బూసు కొనియె ఈశుడై
వీడి యన్ని తపసు చేత విశ్వ రచన జేసెలే
మూడ వాక్షి వాత నోచు ముక్త పురుష పుంగవా !
ఆడ వద్దు ! దహనమయ్యనంగుడా ! తరింపనీ !

చిలుక రధము నీది కాని “చిలుక ” నీ వశమ్మటే !
చిలుక మాయలోబడన్ విజృం భణంబు నీదెలే !
చిలుక “తన్ను తాను” తెలియ చిటికె లోన జారవే
చిలుక లేవు ,చిత్తము శివ చింతనుండ మన్మధా

చెరకు విల్లు , విరుల తూపు, చెలియ రతియె నీబలం
హరుని ధ్యాస ,భృకుటి నడుమ ననవరతము నాబలం
హరితపల్లవములఖాది, ఆమని మదనాశ్రయం
పరమగునటి ప్రణవ రావ భావనమిక నామతం

భ్రమర వళులె వింటి నారి కమరు కుసుమ సాయకా
భ్రమరమాత పతి డమరుక ఢమ ఢమ కది వీగులే
భ్రమ లమోహములను ముంచు భ్రాంతి జనక మారుడా
ప్రమథ నాధ పాద ఘట్ట ప్రహరముల శమించవే

భవదీయుడు
సూర్యనారాయణ సరిపల్లి