మన సు'కవి' ఆత్రేయ

మనసు కవి ఆచార్య ‘ఆత్రేయ’ మే 7 ఆత్రేయ శతజయంతి

మనసు కవి ఆచార్య ఆత్రేయ వేదాంతం, తర్కం,మనసు నిలువెత్తు మనిషిగా సాక్షాత్కరిస్తే ..ఆయనే ఆత్రేయ. అందరూ రాసినట్టు గా ఆయన మాటల్ని కలంతో కాకుండా.. హృదయంతో రాస్తాడు. మనసు లోతుల్ని అన్వేషించి… బావోద్వేగాల్ని వెలికితీస్తాడు. అందుకే ఆయన రాసిన సంభాషణలు … ఇప్పటికీ ప్రేక్షకుల గుండెల్లో సజీవంగా ఉన్నాయి. సందర్భమేదైనా సరే .. సన్నివేశం ఎలాంటిదైనా సరే ఆత్రేయ కలం పడితే చాలు… మాటలు ఉద్వేగపు ఊటలూరి జన హ్రుదయాల్ని ఆర్ధ్రంగా తట్టి… అంచనాలకు అందని అనుభూతుల తీరాలకు తీసుకొని వెళతాయి. అందుకే ఆయన రాసిన మాటలు తెలుగు తెరపై వేదాలు గా భాసిల్లుతున్నాయి.

1921, మే 7న…
ఆత్రేయ అసలు పేరు కిళాంబి వెంకట నరసింహాచార్యులు. 1921, మే 7 న సూళ్లూరుపేటలోని మంగళం పాడులో జన్మించారు. 1950లో విడుదలైన ‘దీక్ష’ చిత్రంలో ఆయన గీత రచయితగా సినీ రంగ ప్రవేశం చేశారు. ఆ తర్వాత సంభాషణల రచయితగా, నిర్మాతగా, దర్శకుడిగా సినీ పరిశ్రమకు ఎనలేని సేవలు చేశారు. ఇంద్రధనుస్సు రంగుల హంగులను ప్రేక్షకులకు అందించి, ఆనందభరితులను చేశారు.
ఆచార్య ఆత్రేయగా సినీరంగ ప్రవేశం చేసిన కిళాంబి వెంకట నరసింహాచార్యులు తెలుగులో సుప్రసిద్ధ నాటక, సినిమా పాటల, మాటల రచయిత, నిర్మాత, దర్శకులు. దాదాపు 400 సినిమాలకు మాటలు, పాటలు రాసిన గొప్పకవి. అత్రేయకి ప్రముఖ నటుడు కొంగర జగ్గయ్య ఆప్తమిత్రుడు.ఆత్రేయ వ్రాసిన పాటలు,నాటకాలు,నాటికలు,కథలు మొదలగు రచనలన్నీ ఏడు సంపుటాలలో సమగ్రంగా ప్రచురించి జగ్గయ్య తన మిత్రుడికి గొప్ప నివాళి అర్పించాడు అని చెప్పవచ్చు. ఆచార్య ఆత్రేయ తెలుగు సినిమా గేయరచయితగా, సంభాషణకర్తగా పేరుపొందినా నిజానికి అతను మాతృరంగం నాటకాలే. నాటక రచయితగా అతను స్థానం సుస్థిరం. మనసుకవిగా సినిమా వారు పిలుచుకునే ఆత్రేయ నాటకాల్లో చక్కని ప్రయోగాలు చేసి నాటక రంగాన్ని మలుపుతిప్పారు

జీవిత తత్వాన్ని గుట్టువిప్పే సంభాషణలు..
ఆత్రేయ తాత్విక ధోరణితో రాసిన సంభాషణలు జీవిత తత్వాన్ని గుట్టువిప్పుతాయి. జీవితాన్ని కాచి వడబోసిన నగ్నసత్యాలు. ప్రతి వ్యక్తి జీవితానికి మార్గ దర్శకాలు. “వెలుగు నీడలు” చిత్రంలో ఇటువంటి ఓ అద్భుత సంభాషణ తనదైన శైలిలో రాసి ఓ సన్నివేశానికి ఆత్రేయ జీవం పోసారు. సెంటిమెంటల్ అనే పదానికి భావగర్భితమైన, కరుణ రసముగల, శృంగార భావములుగల అర్థాలున్నాయి. సినిమా పరిభాషలో సెంటిమెంటల్ డైలాగ్స్ అంటే పరస్పర ప్రేమానురాగాలను, ఆత్మీయానుబంధాలతో, కరుణరస భరితంగా ఒకరికొకరు సంభాషించు కోవడం. సెంటిమెంటల్ డైలాగ్స్ రాయడంలో ఆత్రేయది అందెవేసిన చెయ్యి. ఆత్రేయకు లేడీస్ సెంటిమెంట్లు లేకపోయినా లేడీస్ సెంటిమెంట్ డైలాగ్స్ బాగా రాస్తారని చెప్పుకుంటారు.

గొప్ప వేదాంతి..
ఆత్రేయ గొప్ప వేదాంతి. ప్రతివిషయాన్ని వాస్తవిక దృష్టితో ఆలోచించి సంభాషణలను సమకూరుస్తారు. “వేదాంతం, వైరాగ్యం ఒంటపడితే చాలా ప్రమాదం. వాటి జోలికిపోకుండా ఉంటే చాలా మంచిది. అవి మనిషిలోని కార్య దీక్షను, గట్టి విశ్వాసాలను దెబ్బతీస్తాయి” అని ఆత్రేయ అంటారు. శృంగార రసం శృతి మించితే అశ్లీలం అవుతుంది. ఇటువంటి కొన్ని సన్నివేశాలకు రచయిత పచ్చిగా రాయక తప్పదు. నేను రాయను అని మడికట్టుకు కూర్చుంటే సినీ రచయితగా చిత్ర పరిశ్రమలో ఏ రచయితా నిలబడ లేడు. ఈ కారణమే ఆత్రేయను బూత్రేయ అని కూడా పేరు మూట గట్టుకునేలా చేసింది.

1400కిపైగా సినిమా పాటలు
‘దీక్ష’ (1950) చిత్రానికి తొలిసారి అతను పాటలు రాశారు. “పోరా బాబు పో..” అంటూ సాగే పాట ప్రేక్షకులను, సినీ మేకర్స్‌ని బాగా ఆకట్టుకోవడం ఆత్రేయ పాటల్లోని మాధుర్యం ఏంటో సినిమా పరిశ్రమకు తెలిసింది. అదే ఏడాదిలో విడుదలైన ‘సంసారం’ చిత్రానికి తొలిసారి కథా రచన కూడా చేశారు. దీంతో దర్శక, నిర్మాతలంతా ఆత్రేయతో పాటలు రాయించేందుకు క్యూ కట్టారు. ‘అర్థాంగి’ చిత్రంలో ‘రాక రాక వచ్చావు చందమామా..’, ‘తోడి కోడళ్ళు’ చిత్రంలో ‘కారులో షికారుకెళ్లి…’, ‘శ్రీ వెంకటేశ్వర మహాత్మ్యం’లో ‘శీశైలవాసా శ్రీ వెంకటేషా…’, ‘మంచి మనసులు’ల్లో ‘శిలలపై శిల్పాలు చెక్కినారు…’, ‘మూగ మనసులు’ చిత్రంలో ‘ముద్దబంతి పువ్వులో…’ ‘డాక్టర్‌ చక్రవర్తి’లో ‘నీవులేక వీణ …’, ‘అంతస్తులు’లో ‘తెల్ల చీర కట్టుకున్నది ఎవరి కోసము…’, ‘ప్రేమ్‌నగర్‌’లో ‘నేను పుట్టాను ఈ లోకం మెచ్చింది. నేను ఏడ్చాను ఈ లోకం నవ్వింది. నేను నవ్వాను ఈ లోకం ఏడ్చింది…’, ‘మరోచరిత్ర’లో ‘ఏ తీగ పువ్వునో ఏ కొమ్మ తేటినో…’, ‘ఇంద్రధనస్సు’లో ‘నేనొక ప్రేమ పిపాసిని నీవొక ఆశ్రమ వాసివి…’, ‘అంతులేని కథ’లో ‘కళ్ళల్లో ఉన్నదేదో కన్నులకు తెలుసు…’, ‘మరోచరిత్ర’లో ‘విధి చేయు వింతలన్నీ…’, ‘ఇది కథ కాదు’లో ‘సరిగమలు గలగలలు…’, ‘స్వాతిముత్యం’లో ‘చిన్నారి పొన్నారి కిట్టయ్య…’ తోపాటు ‘తేనే మనసులు’, ‘ప్రైవేట్‌ మాస్టర్‌’, ‘బ్రహ్మాచారి’, ‘మట్టిలో మాణిక్యం’, ‘బడి పంతులు’, ‘పాపం పసివాడు’, ‘భక్త తుకారం’, ‘బాబు’, ‘జ్యోతి’, ‘అందమైన అనుబంధం’, ‘గుప్పెడు మనసు’, ‘ఆకలి రాజ్యం’, ‘అభిలాష’, ‘కోకిలమ్మ’, ‘అభినందన’, ‘ప్రేమ’ వంటి చిత్రాల్లో 1400లకుపైగా పాటలు రాసి తెలుగు ప్రేక్షకుల మనసులో చెరగని ముద్ర వేసుకున్నారు.

‘మనసు కవి’గా
రాసిన పాటలన్ని భావోద్వేగాల సమాహారంగా ఉండటంతో ఆత్రేయను ‘మనసు కవి’గా ప్రేక్షకులు, అభిమానులు అభివర్ణించారు. మనసు అనే ముడి పదార్ధంతో ఆత్రేయ రాసినన్ని పాటలు ఏ ఇతర కవీ రాయలేదు. మౌనం మనసు భాష అంటూ మొదలుపెట్టి… ”మనిషికి మనసే తీరని శిక్ష.. దేవుడిలా తీర్చుకున్నాడు కక్ష.” అంటూ మాట్లాడి… మనసొక మధుకలశం..అంటూ ఎన్నో రకాల విశ్లేషణలు చేశారు ఆత్రేయ.

ఎంతటి బరువైన భావాలనైనా అర్థవంతమైన తేలికైన పదాలతో పలికించడంతో ఆత్రేయ దిట్ట. మూడున్నర దశాబ్దాల సినీ జీవితంలో ఎన్నో ఒడిదుడుకులను చవిచూశారు. పాటల్లో తన అనుభవాలను పొదిగి, గుండె బరువును దించుకునేవారని అతను సన్నిహితులు పలు సందర్భాల్లో చెప్పారు. ఆత్రేయ రాయడం లేట్ చేసినా… ఎంతో మంది దర్శకులకు తమ సన్నివేశాలు పండాలంటే ఆయనే ఉండాలని ఫీలయ్యేవారు. అందుకే ఆత్రేయ జాప్యాన్ని హృదయ పూర్వకంగానే భరించే దర్శకనిర్మాతలు చాలా మంది ఉండేవారు. అలాంటి వాళ్ళలో ముఖ్యంగా చెప్పుకోదగ్గ దర్శకులు ఆదుర్తి సుబ్బారావు, కె.యస్ .ప్రకాశరావు . వీరిద్దరికీ ఆత్రేయ దాదాపు అన్ని చిత్రాలకు అద్భుతమైన సంభాషణలు అందించారు.

ఇళయరాజా ట్యూన్‌కి ఒక్క అక్షరం కూడ పొల్లుపోకుండా
1988లో ఒకసారి ఆత్రేయ ‘అభినందన’ సినిమా పాటల రికార్డింగ్ సమయంలో ఇళయరాజా తన ట్యూన్‌ను ఆత్రేయకు వినిపించారు. ఆ ట్యూన్‌ను తకారంలో తీసుకుంటే… ‘తాన నాననననా తరతాన నాననననా’ ఇంత వరకు బాగానే ఉందినిపిస్తోంది. ఆ తర్వాత ఇళయరాజా ఇచ్చిన ట్యూన్ ‘తారి తాన తాన తాన తాననా తానా…’ విని, ఎన్ని తానాలు రా… అని ఆత్రేయ అన్నారు. అప్పుడు ఇళయరాజా ‘చూడండి గురువుగారు’ మీరు నా మ్యూజిక్‌కి తగ్గట్టు ఒక్క అక్షరం మిస్‌కాకుండా పాట రాయండి. లేకపోతే మీరు పాట రాసి ఇవ్వండి నేను ట్యూన్ చేసుకుంటాను అన్నారు. అప్పుడు ఇళయరాజా ట్యూన్‌కి ఒక్క అక్షరం కూడ పొల్లుపోకుండా ‘ప్రేమ ఎంత మధురం, ప్రియురాలు అంత కఠినం…’ అని అద్భుతమైన సాహిత్యాన్ని రాశారు. ఆత్రేయగారి కెరీర్‌లో వెనక్కి చూస్తే… ఆయన ట్యూన్‌కి పాటలు రాయడం చాలా అరుదు. అలాంటిది అభినందన సినిమా పాటలన్నీ ఆయన ట్యూన్స్‌కి రాయడం విశేషం. అందులో ప్రతీ పాట ఇప్పటికీ శ్రోతల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోయాయి. సినిమా హిట్ కావడంలో ఆత్రేయ హస్తం ఉందనడానికి ఎటువంటి సందేహం లేదు.

ఆత్రేయ గురించి రావి కొండలరావు మాటల్లో….
నాకు తెలిసి, ఆత్రేయ ఒక డబ్బింగ్ సినిమాకు రాశారు. ఆ సినిమా తమిళం. దాని పేరు ‘అళగి’ అంటే సుందరి. ఆత్రేయగారికి తమిళం వచ్చు. తెలుగులో మరి, ఏం పేరు పెట్టారో! నేను డబ్బింగ్‌లు చెబుతూ, ఆ అవకాశాల కోసం తిరుగుతున్నప్పుడు ఆత్రేయ గారిని కలిశాను. మద్రాసు రాయిపేటలో వున్న ఒక హోటల్ గదిలో వున్నారాయన. గదిలోకి వెళ్లగానే నేలమీద దిండు తలకింద పెట్టుకుని పడుకుని తమిళంలో వున్న దృశ్యాలు చదువుతూ పక్కన వున్న ఇద్దరు సహాయకులకి డిక్టేట్ చేస్తున్నారు. నేను నిలబడివుండగా నన్ను చూసి, ‘ఎవరు?’ అన్నారు. చెప్పుకున్నాను. ఎప్పుడు డబ్బింగ్ మొదలవుతుందో తెలీదు. మొదలైన తర్వాత వస్తే ఏదో పాత్రకి చెబుదురుగాని అని చెప్పి పంపించేశారు. ఐతే అది ఎప్పుడు మొదలైందో, అసలు మొదలైందో లేదో కూడా నాకు తెలిసి రాలేదు. నేను వెళ్ళలేదు. (ఈ సంఘటన 1954వ సంవత్సరంలో అని గుర్తు) అంతకు ముందొకసారి, రాజా అన్నాతమలైపురంలో అతను అద్దెకి వున్న పెద్ద ఇంటికి వెళ్ళి కలిశాను. ఉద్యోగార్థం. నేనొక రచయితనని, అతను దగ్గర అవకాశం ఇస్తే సహాయకుడిగా చేస్థాననీ అడిగాను. నేనే సహాయకుడిని. దర్శకుడు, నిర్మాత ఏం చెబితే అది రాస్తాను. నాకు మళ్ళీ సహాయకుడెందుకు? అనేశారు. అతను వీధి గుమ్మం ముందున్న పోర్టికోలో కూచున్నారు. నేను నిలబడే వున్నాను. నన్ను అతను కూచోమనలేదు, నేను కూచోలేదు. అతను ఆ మాట చెప్పగానే నమస్కారం పెట్టి వచ్చేశాను.

ఆదుర్తిగారు ‘తేనె మనసులు’ (1965) తీస్తున్నప్పుడు పరిచయం అయింది ఆత్రేయ గారితో. ఐతే, అంతకు ముందు నేను కలిసిన సందర్భాలు అతనుకి గుర్తులేవు. నేనూ గుర్తు చెయ్యలేదు. తేనేమనసులులో నాకు వేషం లేదు. కాని, నా భార్య రాధాకుమారితో హైదరాబాదు వచ్చాను. మొత్తం నటీనటులందరికీ సారిథి స్టూడియోలోనే బస. ఆత్రేయగారు లక్డీకాపూల్‌లో ఉన్న వెంకటేశ్వరా లాడ్జిలో వుండేవారు. అతను, ఆదుర్తిగారు, నిర్మాత సుందరంగారూ, ఇద్దరు సహాయకులూ. నేను సినిమా జర్నలిస్టుని. ఆదుర్తి గారితో ఇంటర్వ్యూ చేశాను… ఆంధ్రజ్యోతి దినపత్రికకి. ఆదుర్తి గారు నేను రాసిన నాటకాలు చూశారు. అప్పుడు ‘మూగమనసులు’ రజతోత్సవం చేసుకోబోతోంది హైదరాబాదులో. ఆ వేదిక మీద అందరి గురించి రాసిన సన్మానపత్రం – సమర్పించాలి. నా అదృష్టం కొద్దీ ఆ సన్మానపత్రం నన్ను రాయమన్నారు- ఆదుర్తిగారు. ఆ సందర్భంలో ఆత్రేయగారిని కలిశాను. కలిశాను ఏమిటి- ఆదుర్తి సుబ్బారావు గారు కలిపారు. ‘మూగమనసులు’ కథలో, సంభాషణల్లో ముళ్లపూడి రమణగారి ప్రమేయం ఉంది. అతను మద్రాసులో వుండి, ‘ప్రేమించి చూడు’ రాస్తున్నారు. ‘తేనెమనసులు’ కథలోనూ రమణ గారి ప్రమేయం ఉంది. ఆ సినిమాలో రాధాకుమారికి వేషం వుందన్న విషయం రమణ గారే మా యింటికి వచ్చి చెప్పారు. ఆ చేత్తోనే నాకు లేదనీ చెప్పారు. నేను ‘దాగుడుమూతలు’లో వేశాను కదా- అందుకట. మరి రాధాకుమారీ వేసింది కదా అని వాదించాను. ఆ పాత్రకి సరైన వాళ్లు దొరకలేదని, అంచేత తప్పని సరిగా రాధాకుమారికి ఇవ్వవలసి వచ్చిందనీ, కృష్ణకి తల్లి పాత్ర అనీ, రాధాకుమారి అలా కనిపించదు గనక, కృష్ణ తండ్రి (చలపతిరావు)కి రెండోభార్యగా మార్చామనీ చెప్పారు- రమణ గారు. ‘మూగమనసులు’ సన్మానపత్రం ఫస్ట్ వెర్షన్ (సినిమా భాష) రాసి ఆదుర్తి గారు, ఆత్రేయ గారూ వుండగా చదివి వినిపించాను. ఇంకొంచెం విస్తరింపు కావాలని టెక్నీషియన్లని ఇంకా మెచ్చుకోవాలనీ సలహా ఇచ్చారు. మళ్లీ రాసి, వినిపిస్తే బాగుంది అన్నారు ఆదుర్తిగారు. అని, మీరే చదవండి వేదిక మీద అని గొప్ప అవకాశం ఇచ్చారు. ఆ సందర్భంలోనే ఆత్రేయ గారి ముందు- ఎవరో చెప్పగా- ‘తెలుగు మాస్టారు’ ప్రహసనం చేశాను. అతను చాలా ఆనందంగా నవ్వి, ఇంకోసారి చెప్పమన్నారు. అలా ఆ పరిచయం ముదిరి- ఆత్రేయగారిని, తెలుగు మాస్టారు కలిస్తే ఎలా మాట్లాడతారో చెప్పమంటే- చెప్పాను. అతను్ని, అతను రచనల్ని రాసే విధానాల్ని చీల్చి చెండాడాను. అతను ఎంత నవ్వారో! ఎంత స్పోర్టివ్‌గా ఆనందించారో! శిలలపై శిల్పాలు చెక్కినారూ- ఏమిటి, శిలలపై శిల్పాలు కాక, పెన్సిళ్లు చెక్కుతారా- ఏమిటి తమ రచన? అంటూ, ఇలాంటివే.

ఆత్రేయగారి ‘రచనాచమత్కృతి’ ఎలాంటిదంటే- రాయరు. చెప్పి రాయిస్తారు. అదీ రాత్రివేళ. రాత్రి తొందరగా భోజనం చేసి, తొమ్మిదిన్నర, పదిగంటలకి పడుకోవాలి. రెండుగంటలకి లేవాలి. ఆ రెండు నుంచి, కోడి కూసే వరకూ (కోళ్లు లేవు- కాకులే అరిచేవి) సాగుతుంది ఆ రచన. అందుకే అతను్ని ‘అర్ధరాత్రేయ’ అని చమత్కరించేవాళ్లం. అక్కడక్కడ కొన్ని చిన్నచిన్న బూతులు రాయడంవల్ల ‘బూత్రేయ’ అని కూడా అన్నారు. దేనికీ అతను నొచ్చుకోరు. ఐతే, ఆ అర్ధరాత్రి భోగాలు నాకు అనుభవం లేదుగాని, కె.వి.రావుగారు, సుదర్శన్ భట్టాచారి గారూ (నేటి ‘భారవి’) అనుభవించారు. తాను ఒక మంచి నీతిగల సాంఘిక చిత్రం నిర్మిస్తూ దర్శకత్వం కూడా చేస్థానని- ఒకరోజు ప్రకటించారు. నన్ను, కె.వి.రావుగారినీ పిలిచి, మీరిద్దరూ నాకు సహాయకులు. కథ సూక్ష్మంగా చెబుతాను. ఇద్దరూ కలిసి స్క్రీన్‌ప్లే వండండి. వంట అయ్యాక చెప్పండి. తింటాను అదే, వింటాను అన్నారు. మరి… అని గొణిగాం. తన ఇంట్లోని లైబ్రరీ గది చూపిస్తూ ఇదే మన ఆఫీసు. ఇద్దరూ ఒకవేళ అనుకుని – వచ్చి కూచోండి. మీకు టీలు, కాఫీలూ కావలసివస్తే ఇంట్లో చెప్పండి పంపిస్తారు అన్నారు. ఇంటినిండా జనమే- వాళ్లెవరోగాని. మరి…. అని మళ్లీ గొణిగాం. పదిరోజుల తర్వాత మీ ఇద్దరి జేబులూ నింపుతాను అని అతను అనుకున్న కథ చెప్పారు. దీనికి ఏం పాత్రలు కలుపుతారో, ఎలా మంచి కథగా రూపొందిస్తారో ఆలోచించండి అని లేచారు. మేము కొన్నాళ్లపాటు కుస్తీలు పట్టి – ఒక విధంగా దృశ్యాలు పేర్చాం. వినమని చెప్పాం. రేపు అన్నారు. అలాంటి రేపులు చాలా అయినాయి. అతను వినడం మాత్రం కాలేదు. మా జేబులూ నిండలేదు. నిండడం కాదుగదా- ఉన్న జేబు ఖాళీ అయింది. ఓ రోజు ఇద్దరం వుండగా- అడావుడిగా వచ్చారు ఆత్రేయ. రేపు దీపావళి. మంచిరోజు. ఇద్దరూ తలంటు పోసుకుని రండి. మీ ట్రీట్‌మెంట్ వింటాను. గట్టిగా అడ్వాన్సులు ఇస్తాను అన్నారు. మర్నాడు తెల్లవారేసరికి లేచి, అతను చెప్పినట్టు తలలు అంటుకోకపోయినా, అతను ఇంటిని అంటుకున్నాం. తీరా వెళితే- తెల్లవారుజామునే బెంగళూరు వెళ్లిపోయారుట! అదే కబురు! అంతే కథ! ఆ కథని కంచికి పంపించేశాం. అతను ఎంత గొప్ప రచయితో అంత నిబద్ధత లేని మనిషి. సినిమా రచయితలకి ఒక సంఘం వుండాలని, అందరికీ చెప్పి, మొదటి సమావేశం ఎక్కడో ఎప్పుడో చెప్పి అందర్నీ ఆహ్వానించి, అతను వెళ్లలేదు! అతను ‘వాగ్దానం’ సినిమా డైరక్టు చేశారు. అతనుే రచయిత కూడా. అక్కినేని హీరో. ఒక సందర్భంలో అక్కినేని చెప్పారు. మేము నటీనటులందరం సిద్ధమై సెట్లో కూచునేవాళ్లం. టెక్నీషియన్లు రెడీ. ఉదయం 9 గంటల కాల్‌షీటు. దర్శకుడే 10-30, 11 గంటలకు వచ్చేవాడు. ఏమిటి మహానుభావా! అని అడిగితే- బద్దకిష్టి రచయితని పెట్టుకున్నానయ్యా. సీన్లు రాయడు. (తానే, తనమీదే జోకు లాంటిది) దగ్గర కూచుని రాయించుకుని వచ్చేటప్పటికి ఇంత ఆలస్యమైంది! ఇదీ ఆత్రేయ సమాధానం! ఆత్రేయగారు ఒక టి.వి సీరియల్ డైరెక్టు చేశారు. అందులో రాధాకుమారి వేసింది. ఎన్ని రోజులు వేషం వేసి పనిచేసినా డబ్బు ఇవ్వలేదుట- అడిగితే- అమ్మా! నాచేత ఎవరూ పాటలు రాయించుకోవడం లేదు. నువ్వు ఎవరికైనా చెప్పి- పాట రాయించమను. అతను డబ్బు ఇస్తాడు కదా, అప్పుడు మీ అందరికీ ఇస్థాను అన్నారు. నిజమా! చమత్కారమా! ఏమైతేనేం ఒక గొప్ప రచయిత. ఎన్ని గొప్ప నాటకాలు, ఎన్ని సినిమాలు! ఎన్ని గొప్ప పాటలు! అతను చేత పాట రాయించుకోవాలని తిరగని వాళ్లు లేరు. ఐతే, ఆ పాట, ఆ మనసులో ఎప్పుడు పుడుతుందో! అతనుకే తెలీదు. ఆత్రేయ సంభాషణలూ అంతే, వింటూ థియేటర్లో ప్రేక్షకులు చప్పట్లు కొట్టేవారు.

వీధి దీపం కింద కూర్చొని ‘గౌతమబుద్ధ’ నాటకం రాసి
గోత్రనామం ఆత్రేయను, పేరులో ఆచార్యను కలిపి ‘ఆచార్య ఆత్రేయ’ అని పెట్టుకున్నారు. చిన్నప్పుటి నుండే చదువు మీద కన్నా నాటకాల మీదనే మక్కువ చూపేవారు. రాజన్ అనే మిత్రుని సాయంతో మద్రాసు చేరుకున్నారు. అక్కడ ఒకసారి వీధి దీపం కింద కూర్చొని ‘గౌతమబుద్ధ’ అనే నాటకం రాసి దానిని యాభైరూపాయలకు అమ్మి, దానితో తన అవసరాలను తీర్చుకున్నారు. ‘తెనాలి రామకృష్ణ’ సినిమాలో చిన్న వేషానికి అవకాశమొచ్చినా అది నచ్చక వెనక్కి వ చ్చేశారు. ఆ తర్వాత షావుకారు చిత్రానికి డైలాగులు రాసే అవకాశం వచ్చినా అప్పుడు ఆరోగ్యం సహకరించలేదు. కొన్నాళ్ల తర్వాత ‘మనోహర’ అనే చిత్రానికి డైలాగ్ అసిస్టెంట్‌గా మాటసాయం చేశారు. చివరికి ‘దీక్ష’ సినిమాతో ఆత్రేయ సినీరంగంలోకి తెరంగేట్రం చేశారు. చాలా పద్యాలు, నాటకాలు, నాటికలు రచించారు. దాదాపు 400 చిత్రాలకు రచన చేశారు. వివిధ విశ్వవిద్యాలయాల్లో ఆత్రేయ మీద 12 మంది పరిశోధనలు చేశారు. ‘మనస్విని’ సంస్థ ఆత్రేయ సాహిత్యాన్ని 7 సంపుటాలుగా 1990లో ప్రచురించారు, ఆయన ‘మనసుకవి’గా ప్రజల మన్ననలు పొందారు.

అక్షర నివాళి..
ఆత్రేయుడు అంటే చంద్రుడు. వెన్నెలంత వేడిగా వెన్నెలంత చల్లగా తెలుగుజాతికి మనసైన పాటలందించిన మనసు కవి, మరిచిపోలేని మాటలందించిన మనసున్న కవి. తెలుగు సినీ సాహిత్య చరిత్రలో ఆయన ఓ చెరిగిపోని తీపి గుర్తు. అరుదైన అక్షరయోగి, మాటల మహర్షి ఆచార్య ఆత్రేయ 13-09-1989న కాలధర్మం చెందారు.

Send a Comment

Your email address will not be published.