మరో కొత్త నటుడు

మరో కొత్త నటుడు

నటుడు నరేష్ కుమారుడు, దర్శకురాలు విజయ నిర్మల మనవడు అయిన నవీన్ విజయ్ కృష్ణ టాలీవుడ్ లో రంగప్రవేశం చేసారు. ఆగస్ట్ ఏడవ తేదీ ఉదయం హైదరాబాదులోని ఒక స్టుడియోలో నవీన్ విజయకృష్ణ నటించబోయే సినిమాకు ముహూర్త కార్యక్రమం ఆహ్లాదకర వాతావరణంలో సాగింది. ఈ ముహూర్తానికి మహేష్ బాబు, కృష్ణ, విజయనిర్మల, నరేష్ తదితరులు హాజరయ్యారు. సినీ పరిశ్రమనుంచి మరెందరో ప్రముఖులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ముహూర్తపు సన్నివేశానికి నటులు కృష్ణ, మహేష్ బాబు క్లాప్ నిచ్చారు. ప్రముఖ నిర్మాత రామానాయుడు, ప్రముఖ దర్శకుడు కె రాఘవేంద్ర రావు కెమెరా స్విచ్ ఆన్ చేసారు.

నరేష్ మాట్లాడుతూ తమ కుటుంబం దాదాపు ఆరు దశాబ్దాలుగా సినీ ప్రపంచలో కొనసాగుతోందని, నటించడం అనేది తమ రక్తంలో ప్రవహిస్తూనే ఉందని అన్నారు. ఆ నట వారసత్వం నుంచి ఇప్పుడు తన కుమారుడు నవీన్ విజయకృష్ణ కూడా మీ ముందుకు వస్తున్నాడని అన్నారు. తమ ఫ్యామిలీ నుంచి మూడో తరాన్ని వెండితెర పై చూడబోతున్నందుకు తమకెంతో ఆనందంగా ఉందని, తమను ఆదరించినట్లే తన కుమారుడిని కూడా మీరందరూ ఆదరిస్తారనే నమ్మకం తనకుందని నరేష్ చెప్పారు. సంఖ్యా శాస్త్రం ప్రకారం తన కుమారుడి పేరులో ఇంగ్లీష్ వర్ణక్రమంలోరాసేటప్పుడు నవీన్ అనే మాటలో వి అనే అక్షరం ఉండవలసిన చోట డబ్ల్యూ అనే అక్షరాన్ని రాయవలసిందిగా నరేష్ మీడియా వారికి విజ్ఞప్తి చేసారు.

నవీన్ విజయకృష్ణ నటిస్తున్న చిత్రానికి రామ్ ప్రసాద్ దర్శకత్వం వహిస్తున్నారు. ఫ్రెండ్లీ మూవీస్ చాముండీ చిత్ర పతాకంపై ఈ చిత్రం తెరకెక్కబోతోంది.

ఈ చిత్రానికి నిర్మాతలు అడ్డాల చంటి, గవర పార్థసారధి.

నటి మేనక కుమార్తె కీర్తి ఈ సినిమాతో పరిచయమవుతున్నారు. ఇంకా ఈ సినిమాలో రవిబాబు, సప్తగిరి, ప్రగతి, వేణు తదితరులు నటిస్తున్నారు.

మహతీ సాగర్ స్వరాలు అందిస్తున్నారు.

Send a Comment

Your email address will not be published.