మరో ధృవ తార అస్తమయం

రావి కొండలరావు అస్తమయం

Raavi Kondala Raoప్రముఖ నటుడు, దర్శకుడు, రచయిత, నాటకం.. సినీమా.. టీవీ.. పత్రికలు.. మిమిక్రీ ఇలా అన్ని రంగాలలోనూ విశేష అనుభవం కలిగిన రావి కొండలరావు మంగళవారం నాడు (జూలై 28) గుండెపోటుతో మరణించారు. ప్రస్తుతం ఆయన వయసు 88 సంవత్సరాలు. హైదరాబాద్‌లోని వివేకానంద ఆసుపత్రిలో రావి కొండలరావు తుదిశ్వాస విడిచారు. సినీ, సాహిత్య, సాంస్కృతిక, కళారంగాల్లో విశేష అనుభవం సంపాదించి నిరాడంబరంగా జీవితం గడిపిన రావి కొండలరావు మృతితో టాలీవుడ్‌లో విషాదఛాయలు అలముకున్నాయి. ఆయన మృతిపై టాలీవుడ్ పరిశ్రమ దిగ్భ్రాంతిని వ్యక్తం చేసింది.

1932, ఫిబ్రవరి 11 న సామర్లకోటలో జన్మించిన రావి కొండలరావు, ఆరు దశాబ్దాల సుదీర్ఘ సినీ ప్రస్థానంలో 600లకు పైగా సినిమాలలో తన విలక్షణ నటనతో ప్రేక్షకులను అలరించారు. ఆయన పుట్టిన ఏడాదే తెలుగు సినిమా కూడా పుట్టింది. రావి కొండలరావు సినీరంగంతో పాటే ఎదుగుతూ వచ్చారు. అతని తల్లిదండ్రులు రావి చిదంబరం, పార్వతమ్మ. తండ్రిది పోస్టుమాస్టరు ఉద్యోగం కావడం వల్ల తరచుగా బదిలీలు అవుతూ ఉండేవి. అలా శ్రీకాకుళంలోని పాండ్రంగి వీధిలో ఉండేవారు. రావి కొండలరావు చదువు ఏడు రోడ్ల జంక్షన్‌ సమీపంలో ఉన్న మున్సిపల్‌ హైస్కూలులోనే సాగింది. నాగావళి నదీతీరంలో గడిచిన బాల్యం ఎన్నో ఆనందాలకు ఆటవిడుపుగా సాగింది… అక్కడ్నుంచి జీవన ప్రస్థానంలో మద్రాసు సినీపరిశ్రమతోనే హైదరాబాద్‌ చేరి, అక్కడే స్థిర పడ్డారు. అందుకే తన స్వీయగాథ ‘నాగావళి నుంచి మంజీర వరకూ’ అని పుస్తకంగా తీసుకొచ్చారు.

పదేళ్ల వయసులోనే నటనకు నాంది
రావి కొండలరావుపై చిన్నప్పటి నుంచే నాటకాల ప్రభావం ఉంది. దీనికి కారణం అతని అన్నయ్యలు ఆర్‌.కె.రావు, రావి చలం (ఈయన జంషెడ్‌పూర్‌ నాటకరంగంలో ప్రసిద్ధుడు). కొండలరావు పదేళ్ళ లోపు వయసులో స్కూలు నాటకాల్లో వేసినపుడు తండ్రి ఏమీ అనలేదుగానీ బయటి సమాజాల్లో ఆడినప్పుడు మాత్రం సహించేవారు కారు. చిన్నప్పుడు ఒకసారి తండ్రికి తెలియకుండా ఒక అన్నయ్య తాను నటించే ఒక నాటికలో కొండలరావు చేత ఆడపాత్ర వేయించారు. ఆ ప్రదర్శనకు తండ్రి హాజరవుతాడని వాళ్ళకి తెలియదు. కొడుకును గుర్తుపట్టని తండ్రి స్టేజికేసి చూస్తూ పక్కనున్న వ్యక్తితో ‘వీడెవడో బాగానే చేస్తున్నాడే?’ అన్నారట! అప్పుడా పక్కనున్నాయన ‘అదేమిటండీ వాడు మీవాడేగా?’ అనడంతో… అతను ఆవేశంతో స్టేజి మీదకి వెళ్ళి, కొడుకు విగ్గు పట్టుకుని పీకేసి, కొట్టి, వీధులవెంట తరిమాడట. ప్రేక్షకులు ఇదేదో ‘కొత్త పాత్ర ప్రవేశం’ అని కూడా అనుకున్నారట. అన్నయ్య ఏకపాత్రాభినయంలో చిన్న చిన్న సహాయపాత్రలు వెయ్యడం, కన్యాశుల్కంలో వెంకటేశంగా నటించడం, చిన్నచిన్న కథలు రాయడం లాంటివన్నీ కొండలరావు బాల్య స్మ ృతులు.

సాహిత్యంపై మక్కువ
1948లో గాంధీజీ హత్య తదనంతర పరిణామాల్లో ఆర్‌ఎస్‌ఎస్‌పై నిషేధం, కార్యకర్తల అరెస్టులు జరుగుతున్న నేపథ్యంలో అప్పటికి బాల శిక్షక్‌ దళంలో ఉన్న రావి కొండలరావునీ పోలీసులు అరెస్టు చేసి, రాజమండ్రి జైల్లో మూడునెలలపాటు ఉంచారు. ఆ జైలు జీవితంలో అతనిలోని సాహిత్యాభిలాషణను పెంచింది. టీనేజీలో ఉన్న కొండలరావుకు జైలు లైబ్రరీలో తెలుగు సాహిత్యం చదివేందుకు మంచి అవకాశం దొరికింది. అప్పటికే చిన్నచిన్న కథలు రాసిన అనుభవం ఉండడంతో ఈ అధ్యయనం ఒక తర్ఫీదులా మారిందంటారాయన. జైలు నుంచి విడుదలయ్యాక సరాసరి ఏదైనా పత్రికలో పని దొరుకుంతుందేమోనని అట్నుంచటే మద్రాసు వెళ్లారు. కానీ అంతలోనే ఏ పనీ దొరక్క, మళ్లీ శ్రీకాకుళం తిరిగిరాక తప్పలేదు. ఆ తర్వాత చక్రపాణి నడిపిన యువ పత్రికలో 1949లో అతని కథ ఒకటి అచ్చయింది. దానితో ఉత్సాహం పెరిగింది. ఆ ఊపుతో అతను రాసిన చిన్న కథలూ, నాటికలూ పలు పత్రికల్లో అచ్చయ్యేవి. అప్పట్నుంచి ఇప్పటివరకూ ఎన్నో నాటకాలు, యాభైకి పైగా కథలూ రాశారు.

బాపు రమణలతో దోస్తీ
ప్రఖ్యాత చిత్రకారుడు, దర్శకుడు బాపు, రచయిత ముళ్లపూడి వెంకటరమణతో నిక్కర్లేసుకునే వయసు నుంచే స్నేహం ఉందంటారు రావి కొండలరావు. 1948లో మద్రాసు వెళ్ళినప్పుడు ‘బాల’ పత్రికలో బొమ్మలు వేస్తున్న బాపూతోనూ, ముళ్ళపూడి వెంకటరమణతోనూ పరిచయం ఏర్పడింది. శ్రీకాకుళం వచ్చిన తర్వాత కొంత కాలానికి మద్రాసు ‘ఆనందవాణి’ పత్రికలో సబ్‌ఎడిటర్‌ ఉద్యోగానికి అభ్యర్థులను విశాఖపట్నంలో ఇంటర్వ్యూ చేస్తున్నారని తెలిసి కొండలరావు కూడా వెళ్ళారు. శ్రీశ్రీ, ఆరుద్ర మొదలైనవారు లోగడ పనిచేసిన పత్రిక అది. సబ్‌ఎడిటర్‌ ఉద్యోగానికి కొండలరావు ఎంపికయ్యారు. 1956లో మద్రాసులో ఆరు నెలల పాటు ‘ఆనందవాణి’లో ఉద్యోగం చేశారు. ఆ తర్వాత ‘విజయచిత్ర’ పత్రికలో రెండున్న దశాబ్దాలపాటు సహసంపాదకునిగా పనిచేశారు. ఆనాటికి సాహిత్య, సినీరంగాల్లో ఉన్న ప్రముఖులంతా అతనికి పరిచయమయ్యారు. అప్పటికే కొండలరావు కథలు కొన్ని ప్రచురితమయ్యాయి. తెన్నేటి సూరి నిర్వహిస్తున్న భారతి పత్రికలో ‘స్వయంవరం’, ‘కుక్కపిల్ల దొరికింది’ నాటికలు రెండూ అచ్చుకావడంతో అతను అందరికీ సుపరిచితులుగా మారారు. బాపూ, రమణలతో ఉన్న స్నేహం అతనిని నటనా రంగంలోకి అడుగుపెట్టేలా చేసింది. సినిమాల్లో రచయితగా ఉన్న రావి కొండలరావుకి తగిన పాత్రలను తమ కథల్లో రాసి వేషాలు ఇప్పించారు. తనను నటునిగా తీర్చిదిద్దింది బాపూ రమణలేనని ఇప్పటికీ కొండలరావు ఎంతో ఆనందంగా చెబుతారు.

సినిమాల్లో ప్రవేశం
నాటక రచయితగా, నటునిగా అప్పటికే గుర్తింపు పొందిన రావి కొండలరావు సినీ రంగ ప్రవేశం మాత్రం నటునిగా Ravi Kondala Raoజరగలేదంటే ఎవరైనా ఆశ్చర్యపోతారు. కానీ ఇది నిజం. రచయితగా అడుగుపెట్టి నటునిగా మారి, రెండింటినీ సమతూకంగా కొనసాగించారు. ఇదెలా జరిగిందటే… 1954లో హైదరాబాదులో కొండలరావు ‘కాళరాత్రి’ నాటకంలో నటించినప్పుడు సినీరచయిత డి.వి.నరసరాజు జడ్జిగా వచ్చారు. ఆంధ్ర నాటక పరిషత్తు నిర్వహించిన ఆ ప్రదర్శనలో జె.వి.సోమయాజులు, రమణమూర్తి తదితరులు కూడా నటించారు. కొండలరావు ఆ పరిచయాన్ని పురస్కరించుకుని, నరసరాజుని మళ్ళీ 1956లో మద్రాసులో కలుసుకున్నారు. ఆయన సిఫార్సు ద్వారా కొండలరావుకు పొన్నలూరి బ్రదర్స్‌వారి సినీ సంస్థలో స్టోరీ డిపార్ట్‌మెంట్‌లో ఉద్యోగం వచ్చింది.

నటునిగా …
సినిమా స్టోరీ డిపార్ట్‌మెంట్‌లో పని తక్కువగా ఉండడంతో దర్శకత్వం వహిస్తున్న కమలాకర కామేశ్వరరావు కొండలరావును తనకు అసిస్టెంటుగా కూడా పని చెయ్యమని పిలిచారు. ఎన్‌.టి.రామారావు, అంజలీదేవి, రమణారెడ్డి తదితరులు నటిస్తున్న ‘శోభ’ సినిమాలో ఒక సన్నివేశంలో ఒక డాక్టరు పాత్ర అయోమయంగా నటించాలి. మామూలుగా డాక్టరు పాత్రలు వేసే ఒకతను అలా చెయ్యలేక తడబాటు పడి, కొండలరావునే వేసెయ్యమని బతిమాలాడు. దీంతో ఆ పాత్రలో తొలిసారిగా వెండితెరపై నటించారు. అయితే అప్పటికి పూర్తిస్థాయి సినిమా నటనావకాశాలైతే పెద్దగా రాలేదు. ముద్దుకృష్ణ సహకారంతో కొన్ని సినిమాల్లో సహకార దర్శకుడిగా అవకాశాలొచ్చాయి. ఆ తరవాత ‘పూజాఫలం’ వంటి సినిమాల్లో బి.ఎన్‌.రెడ్డిగారితో పనిచేసే అవకాశం కూడా వచ్చింది. అప్పటికి కొండలరావుకు రాధాకుమారితో వివాహం అయింది. జరుగుబాటు కోసం ఇద్దరూ తమిళ సినిమాలకు డబ్బింగ్‌ చెప్పేవారు. ‘సినిమాలకు అసిస్టెంట్‌ డైరెక్టర్‌గా అవస్థలు పడేకంటే వేషాలే వెయ్యరాదా!’ అని ముళ్ళపూడి వెంకటరమణ అనేవారు. ఆ క్రమంలోనే ఆదుర్తి తీసిన ‘దాగుడు మూతలు’ సినిమాలో ఒక డాక్టరు వేషం లభించింది. దాని తరవాత రామారావు వంటి పెద్దనటులతో తనకున్న పరిచయాల ద్వారా చాలా సినిమాల్లో వేషాలు వెయ్యసాగారు. సహాయ నటునిగానే కాకుండా ‘అర్ధరాత్రి’ సినిమాలో విలన్‌గా కూడా నటించారు. ఇప్పటికి ఆరువందలకు పైగా సినిమాల్లో రకరకాల హాస్యపాత్రల్లో నటించారు. నాటకరంగం నుంచి ‘దాగుడు మూతలు’ సినిమాతో నటుడిగా మారారు. రాముడు భీముడు, తేనెమనసులు, ప్రేమించి చూడు లాంటి ఎన్నో విజయవంతమైన చిత్రాల్లో నటించారు. చివరిగా ఆయన 365 డేస్ చిత్రంలో నటించారు.

తెలుగు మాస్టారి మిమిక్రీ
కొండలరావుకు చిన్నప్పటి నుంచీ హాస్యప్రియత్వం ఎక్కువే. అది సినిమాల్లో చేరాక మరింత పెరిగింది. శ్రీకాకుళంలో తన చిన్నప్పటి తెలుగు మాస్టారు సరిపల్లి సోమేశ్వరశర్మ మాటల్ని అనుకరిస్తూ వాటిని అందరికీ వినిపిస్తూ ఉండేవారు. మద్రాసులో ఉన్నప్పుడు తమ ఇంట్లోనూ, బాపూ, రమణలున్న ఇతర ఇష్టాగోష్ఠుల్లోనూ ఇది తప్పక జరిగే వ్యవహారం. నాటక, సాహితీ రంగాల్లోని స్నేహితులేకాక చాలామంది సినీప్రముఖులు అది విని ఆనందించేవారు. ఇదెంతవరకూ వెళ్ళిందంటే ఆ రోజుల్లోనే ఆసక్తిని ఆపుకోలేక ఆరుద్ర శ్రీకాకుళం వెళ్ళి, సదరు మాస్టార్ని కలుసుకుని మరీ వచ్చారు. ఎవరి మాటా వినిపించుకోకుండా, దబాయింపు ధోరణిలో ‘సారులెన్స్‌’ అని కేక పెట్టే తెలుగు మాస్టారుది ఒక వింత స్వభావం. దీనిని హాస్యస్ఫోరకంగా మార్చి రావి కొండలరావు తన నటనలో అంతర్భాగంగా కలిపేసుకున్నారు. ఇప్పటికీ రావి కొండలరావు హాస్య సంభాషణలు ఎక్కడా మాస్టారి సన్నివేశం లేకుండా పూర్తికావు.

Captureమనసున మనసై బతుకున బతుకై
సినిమాల్లో భార్యాభర్తలు నిజజీవితంలోలా కలిసి నటించడం అరుదైన విషయం. కానీ రావి కొండలరావు, ఆతని భార్య రాధాకుమారి భార్యాభర్తలుగా 127 సినిమాల్లో కలిసి నటించారు. ఆమె కూడా మొత్తం ఆరొందల సినిమాల్లో నటించారు. ఇద్దరూ కలిసి, వేర్వేరుగా ఎన్నో నాటకాల్లో కూడా నటించారు. ఆమె స్వస్థలం విజయనగరం. వారిద్దరూ కలిసి నటించి, నవ్వులు పూయించిన ఎన్నో సరదా సన్నివేశాలు ప్రేక్షకుల మనసులపై చెరగని ముద్రనే వేశాయి. ఆయన మృతి తెలుగు చిత్రసీమకు తీరని లోటు.

Send a Comment

Your email address will not be published.