– అనిర్వచనీయ సాహసంతో బాలలకు విముక్తి
– మానవ శక్తికి ఎదురులేదని నిరూపించారు
– థాయ్ గుహ సంఘటనలో ఎన్నో మానవీయ కోణాలు
ఆ పన్నెండు మంది పిల్లలూ, వారి ఫుట్‌బాల్ కోచ్.. దారీ తెన్నూ లేని ఆ గుహలో చిక్కుకున్నారు. ఒక రోజు కాదు, రెండు రోజులు కాదు; ఏకంగా 18 రోజుల పాటు.. వారు సురక్షితంగా బయటకు వస్తారా? లేదా? అని ప్రపంచమంతా ఉత్కంఠతతో ఎదురుచూసింది. వారిని కాపాడడాన్ని థాయ్‌లాండ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. రెస్క్యూ బృందాలను సమాయత్తం చేసి, రేయింబవళ్లూ శ్రమించి ఎట్టకేలకు ఆ భయానక గుహ నుంచి ఆ పదముగ్గుర్నీ కాపాడడంతో కథ సుఖాంతమైంది. ప్రతికూల పరిస్థితుల్లోనూ తమ ప్రాణాలను అడ్డుపెట్టి, పిల్లల ప్రాణాలను కాపాడిన రెస్కూ ్య బృంద సభ్యులూ, చుట్టూ భయంకర పరిస్థితుల్ని చవిచూసినా.. ధైర్యం కోల్పోని పిల్లలూ.. ఇప్పుడు ప్రపంచ వార్తగా మారారు.
థాయ్‌లాండ్‌లో ఉన్న ప్రాచీనమైన గుహల్లో తామ్ లువాంగ్ గుహ ఒకటి. జూన్ 23న ఫుట్‌బాల్ క్రీడాకారుల సహాయక కోచ్ పాతికేళ్ల ఎకపాల్తో కలిసి పన్నెండు మంది విద్యార్థులు ఈ గుహలో చిక్కుకున్నారు. వీరంతా 11 నుంచి 17 ఏళ్ల మధ్య ఉన్నవారే. వైల్డ్ బోర్స్ అనే ఫుట్‌బాల్ క్లబ్ జట్టుకు ప్రాతినిథ్యం వహిస్తున్నారు. విహారయాత్రలో భాగంగా కోచ్‌తో కలసి ఆ గుహ లోపలికి వెళ్లారు. సుమారు నాలుగు కిలోమీటర్లు లోపలికి వెళ్లాక, తిరిగి రావడానికి ప్రయత్నించే సమయంలో ప్రవేశ ద్వారం వరద నీటితో మునిగిపోవడంతో వీరంతా లోపలే ఇరుక్కుపోయారు.
పదిరోజుల తర్వాత ఆచూకీ
పిల్లలు గుహలో చిక్కుకున్న విషయం బయట ప్రపంచానికీ, వారి తల్లిదండ్రులకూ అప్పటికి ఏమాత్రం తెలియదు. పదముగ్గురి ఆచూకీ లేకుండా పోవడంతో పిల్లల తల్లిదండ్రుల్లో ఆందోళన మొదలైంది. వారు పోలీసు అధికారులను ఆశ్రయించారు. ఆ తర్వాత రోజు జూన్ 24న గుహ ప్రవేశద్వారం దగ్గర విద్యార్థుల సైకిళ్లు, కాలి గుర్తుల్ని అధికారులు కనుగొన్నారు. వారంతా గుహ లోపలికి వెళ్లారని నిర్ధారణకు వచ్చారు. వారిని సురక్షితంగా తీసుకురావడానికి బృందాన్ని నియమించారు. ఆ బృందాలు రెండురోజుల పాటు శ్రమించినా ఫలితం లేకపోయింది. 26వ తేదీ నాటికి వరదతో గుహలోని పట్టాయ బీచ్ ప్రాంతం ఇరుకుగా మారడంతో లోపలకు వెళ్లిన నేవీ సీల్ డైవర్లు వెనక్కి వచ్చేశారు. అప్పటికే ఈ ఘటన ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. తర్వాత రోజు 27న దాదాపు 30 మంది అమెరికా పసిఫిక్ కమాండ్ సైనిక నిపుణులు, ముగ్గురు బ్రిటిష్ డైవర్లతో కలసి సహాయక చర్యల్లో పాల్గొన్నారు. కానీ వరద ప్రవాహం కారణంగా సహాయ చర్యల్లో ఎలాంటి పురోగతీ లేదు. 28న గుహలోని నీటిని తోడేందుకు పంపుల్ని ఏర్పాటుచేశారు. విద్యార్థుల్ని రక్షించేందుకు ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషించేందుకు డ్రోన్లను రంగంలోకి దించారు. అవి నాలుగురోజుల పాటు గుహలో పరిశీలించి, ఈ నెల 2వ తేదీ నాటికి పన్నెండు మంది విద్యార్థులతో పాటు కోచ్ ఎకపాల్ సజీవంగా ఉన్నట్లు సమాచారమిచ్చాయి. వారి ఉనికిని బ్రిటిష్ డైవర్లు గుర్తించడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. వీరికి ఆహారం, మందుల్ని అందించారు. వీరి ఆచూకీ తెలియడంతో సహాయక చర్యలు ముమ్మరం చేశారు. అయితే ఈ నెల 6న వీరిని రక్షించే పనిలో ఉన్న సమన్ గునన్ అనే నేవీ సీల్ కమాండర్ ట్యాంక్‌లో ఆక్సిజన్ అయిపోవడంతో చనిపోయారు. 8వ తేదీ నాటికి నలుగుర్ని, సోమవారం నాడు మరో నలుగుర్ని రెస్క్యూ బృందాలు సురక్షితంగా బయటకు తీసుకొచ్చాయి. మంగళవారం రాత్రికి మొత్తం 13 మందినీ కాపాడాయి.
18 రోజుల పాటు ఒక గుహలో ఆహారం లేకుండా గడపడం ఎవరికీ సాధ్యమయ్యే పనికాదు. వీరిలోని ఒక బాలుడు తీసుకెళ్లిన స్నాక్స్ ఆ పదమూడు మంది ప్రాణాలు కాపాడాయి. అతడి పేరు పీరాపట్ సోంమియాంజరు. పదిహేడేళ్ల ఈ అబ్బాయికి గుహలో చిక్కుకున్న రోజే పుట్టిన రోజు. బర్త్ డే పార్టీని గుహలో జరుపుకునేందుకు స్నాక్స్ తీసుకువెళ్లడం వల్ల గుహలోని వారికి ఇన్ని రోజులపాటు ఆ స్నాక్సే ఆకలి తీర్చాయని మీడియా కథనాలు చెబుతున్నాయి. మరొక బాలుడి పేరు అబ్దుల్ సమన్. పద్నాలుగేళ్ల ఇతని స్వస్థలం మియన్మార్. బాగా చదివించాలనే ఉద్దేశంతో తల్లిదండ్రులు ఇతన్ని థారులాండ్ తీసుకొచ్చారు. అబ్దుల్‌కి థారుతో పాటు, బర్మీస్, చైనీస్, ఇంగ్లీష్ భాషలూ వచ్చు. బ్రిటిష్ గజ ఈతగాళ్లు గుహలో చిక్కుకున్న వీరిని గుర్తించినప్పుడు.. వాళ్లతో ఇంగ్లీష్‌లో మాట్లాడిన ఒకే ఒక వ్యక్తి ఈ అబ్దుల్. మిగిలిన వారికి ఇంగ్లీష్ రాదు. మిగిలిన పిల్లల్లో… చానిన్ విబుల్ రుంగ్రూంగ్ (11ఏళ్లు) ఏడేళ్లకే ఫుట్‌బాల్ ఆడటం మొదలుపెట్టాడు. గుహలో చిక్కుకున్న వారిలో ఇతనే అత్యంత చిన్నవాడు. పనుమాస్ సంగ్దీ (13) ‘నేవీ సీల్స్’ తమని బాగా చూసుకుంటున్నారని తల్లిదండ్రులకు లేఖ రాశాడు. కోచ్ మాటల్లో చెప్పాలంటే .. అతడు టీంలో అందరికంటే చురుకైనవాడు. దుగన్పేట్ ప్రొంటెప్ (13) వైల్డ్ బోర్స్ జట్టుకు కెప్టెన్, థారులోని చాలా జట్లకు నాయకత్వం వహించాడు. సోంపెంగ్ జాయివాంగ్ (13) థారు జాతీయ జట్టుకు ఆడాలనేది ఇతని లక్ష్యం. మొంగోల్ బూనియమ్ (13) అందరిని గౌరవిస్తాడని ఇతని టీచర్లు తెలిపారు. నట్ట్వాట్ టాక్మోరాంగ్ (14) తన గురించి బాధపడొద్దని తల్లిదండ్రులకు లేఖ రాశాడు. ఎక్రాట్ వోంగ్ సుక్చాన్ (14) ‘గుహ నుంచి బయటకొచ్చాక తప్పకుండా నీకు సహాయం చేస్తా’నని అమ్మకు మాట ఇచ్చాడు. ప్రజాక్ సుతమ్ (15) నెమ్మదస్తుడు, మంచి కుర్రాడని ఇతని ఫ్యామిలీ ఫ్రెండ్స్ మీడియాకి చెప్పారు. పిపట్ ఫో (15) గుహ నుంచి బయటకు వచ్చాక అమ్మానాన్నలను రెస్టారెంట్‌కు తీసుకెళ్తానని లేఖ రాశాడు. పోర్నిచాయి కమ్లూంగ్ (16) ‘బాధ పడకండి, నేను బాగానే ఉన్నాను’ అని తల్లిదండ్రులకు లేఖ రాశాడు. సహాయక కోచ్ ఎకపాల్ చాంతావాంగ్ (25) గుహలో చిక్కుకున్న నేపథ్యంలో క్షమించమని పిల్లల తల్లిదండ్రులకు లేఖ రాశాడు. తనతో ఉన్న బాలురను జాగ్రత్తగా చూసుకుంటానని తెలిపాడు.
గుహలో చిన్నారులు చిక్కుకున్న ప్రమాదానికి కారకుడు సహాయకోచ్ ఎకపాల్ చాన్తవాంగేనని తొలుత విమర్శలు వెల్లువెత్తాయి. అయితే వాస్తవం వేరు. గుహలో చిన్నారులు అనారోగ్యానికి గురికాకుండా ఎకపాల్ జాగ్రత్తలు తీసుకున్నాడని లోపలకు వెళ్లిన డైవర్లు చెబుతున్నారు. గతంలో బౌద్ధ సన్యాసిగా ఉన్న ఆయన విద్యార్థులు మానసికంగా కుంగిపోకుండా ధ్యానం, ఇతర అంశాలపై దృష్టి సారించేలా చేశాడని వివరించారు.
గుహలో 18 రోజుల పాటు చిక్కుకున్నా చిన్నారులు మానసిక స్థయిర్యం కోల్పోకుండా ఎకపాల్ జాగ్రత్తలు తీసుకున్నారు. చివరికి తన ఆహారం, నీటిని సైతం ఆకలితో ఉన్న చిన్నారులకు ఇచ్చేశారు. దీనివల్ల ఆయన చాలా బలహీనపడ్డారు. ఎకపాల్ వల్లే తమ చిన్నారులు ఇంకా ప్రాణాలతో ఉన్నారని.. పలువురు విద్యార్థుల తల్లిదండ్రులు ఇప్పుడు ప్రశంసలు కురిపిస్తున్నారు.
పథక రచన అమోఘం
చియాంగ్ రారు ప్రావిన్సు గవర్నర్ నరోంగ్‌సక్ ఆధ్వర్యంలో సహాయ చర్యలు జరిగాయి. భారీ వర్షాలు కురిసే అవకాశముందన్న వాతావరణశాఖ హెచ్చరికల నేపథ్యంలో తొలుత బాలుర కుటుంబాలకు సమాచారమిచ్చిన అధికారులు ఆపరేషన్‌ను ప్రారంభించారు. ఒక్కో బాలుడ్ని ఇద్దరు డైవర్లు నాలుగు కిలోమీటర్ల మేర సురక్షితంగా తీసుకొచ్చేలా ప్రణాళికలు వేశారు. వీరు దారి తప్పకుండా మార్గం పొడవునా తాళ్లను అమర్చారు. తర్వాత 15 మంది అంతర్జాతీయ డైవింగ్ నిపుణులతో పాటు ఐదుగురు థారు నేవీ సీల్స్ రంగంలోకి దిగారు. ఆదివారం నలుగురు పిల్లల్ని, తర్వాతరోజు మరో నలుగురిని బయటకు తీసుకొచ్చారు. మంగళవారం రాత్రి నాటికి మొత్తం13 మందిని కాపాడారు. ఈ బృందంలో భారత్‌కు చెందిన ఇద్దరు ఇంజినీర్లు పాల్గొన్నారు. వారు మహరాష్ట్రకు చెందిన శ్యామ్ శుక్లా, ప్రసాద్ కులకర్ణి. వీరిద్దరూ గుహ నుంచి నీటిని బయటకు తోడడంలో సాంకేతిక నైపుణ్యాన్ని అందించారు. థాయ్‌లాండ్‌తోపాటు బ్రిటన్, అమెరికా, ఆస్ట్రేలియా తదితర దేశాల నుంచి వచ్చిన నిపుణులు ఈ సహాయక చర్యల్లో పాల్గొన్నారు.
ఎన్నో అనుభవాలు
అమెరికా వాయుసేనకు చెందిన డెరెక్ అండర్సన్ వారిలో ఒకరు. పిల్లలను కాపాడటంలో తనకు ఎదురైన అనుభవాలను ఆయన విలేకరులకు వివరించారు. జపాన్‌లోని ఒకినవాలో అమెరికా వైమానిక స్థావరంలో విధులు నిర్వర్తిస్తున్న అండర్సన్ తన బృందంతో కలిసి థాయ్‌లాండ్‌లోని గుహ వద్దకు 28న చేరుకున్నారు. ‘ఇది జీవితంలో ఒక్కసారే ఎదురయ్యే సాహసం’ అని ఆయన అన్నారు. గుహలో ఉన్న వారంతా తనకు ఉత్సాహంగానే కనిపించారనీ, ఆ పిల్లలు నిజంగా చాలా హుషారైన వారని అండర్సన్ అభివర్ణించారు. ‘ఇక్కడ అత్యంత ముఖ్యమైన విషయం ఏంటంటే కోచ్, పిల్లలు కలిసి మాట్లాడుకుని, ధైర్యంగా ఉండాలనీ, బతుకుపై ఆశ వదులుకోకూడదని నిశ్చయించుకున్నారు. మేం గుహ వద్దకు చేరుకునే సమయానికి గుహ దారుల్లో పెద్దగా నీరు లేదు. కానీ మేం లోపలికి వెళ్లిన కొద్దిసేపటికే మూడు అడుగుల ఎత్తున నీటి ప్రవాహం మొదలై మమ్మల్ని బయటకు తోసేయ సాగింది. గుహలో ఆక్సిజన్ స్థాయిలు తగ్గిపోతుండటం, పిల్లలు జబ్బుపడే ప్రమాదం, వర్షాలు కురిస్తే నీరు నెలల తరబడి గుహలో ప్రవహించడం తదితర కారణాల వల్ల పిల్లలు ఎక్కువసేపు లోపల ఉండటం మంచిది కాదని అనిపించింది’ అని వివరించారు.
స్విమ్మింగ్ పూల్‌లో సాధన
డైవర్లు పిల్లలను గుహ నుంచి ఎలా కాపాడాలనే దానిపై ముందుగా ఓ ఈతకొలనులో సాధన చేశారు. లోపల ఉన్న పిల్లలంత ఎత్తు, బరువే ఉన్న పిల్లలను ఎంచుకున్నారు. ‘ఒక్కో పిల్లాడ్ని ఓ డైవర్‌కు కట్టి ఉంచారు. పది మందికి పైగా ఇతర డైవర్లు వెంటే ఉన్నారు. పిల్లాడ్ని పట్టుకునేందుకు, ఆక్సిజన్ అందించేందుకు ఇలా చేశారు. ఒక్కో పిల్లాడికి అవసరమైన మాస్కులు తదితరాలు తొడిగి బయటకు తెచ్చేందుకు సిద్ధం చేయడానికే గంటలు పట్టింది. ఇరుకు దారుల్లో ఇరుక్కున్నప్పుడు నీరు మాస్క్ల్లోపలికి చేరకుండా ఉండేందుకు ప్రత్యేకమైన ప్రెషర్ మాస్క్‌లను వాడటం కీలకంగా మారింది.
గుహ బయట నుంచి బాలలు ఉన్న ప్రాంతం వరకు 8 మిల్లీ మీటర్ల మందం ఉన్న తాడును సహాయక బృందాలు కట్టారు. ఆపరేషన్లలో తాడే కీలకమనీ, లోపలకు వెళ్లిన వారు బయటకు రావాలంటే తాడును పట్టుకుని రావడం ఒకటే మార్గమని చెప్పారు. ‘ఇక్కడ తాడు జీవన రేఖ. లోపలకు వెళ్లేటప్పుడే బయటకు వచ్చే దారిని ఏర్పాటు చేసుకోవాలి. ఒక్కో బాలుడిని బయటకు తీసుకొచ్చే సమయంలో గుహలో 100 మందికిపైగా సహాయక సిబ్బంది ఉన్నారు. కొన్ని చోట్ల నీరు లేదుగానీ పెద్ద పెద్ద బండరాళ్లు, ఇరుకైన దారులతో ప్రమాదకరంగా ఉంది’ అని వివరించారు. వారికి మందులు ఇచ్చినందువల్ల పిల్లలను బయటకు తెస్తున్నప్పుడు వారిలో కొంతమంది నిద్రపోయారనీ, మరికొంత మంది కాస్త మెలకువతో ఉన్నారని థాయ్‌లాండ్ నౌకాదళంలోని మరో డైవర్ చెప్పారు.
సాహస కథతో హాలీవుడ్ సినిమా
పిల్లలను గుహ నుంచి కాపాడటం కథాంశంగా హాలీవుడ్లో ఓ సినిమా వస్తోంది. ప్యూర్ ఫ్లిక్స్ ఎంటర్టైన్మెంట్ ఈ సినిమా తీస్తోంది. దాదాపు 413 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కించే ఈ సినిమాకు కావోస్ ఎంటర్టైన్మెంట్ సహ నిర్మాణ సంస్థగా వ్యవహరించనుంది. ప్యూర్ ఫ్లిక్స్ సీఈవో స్కాట్ మాట్లాడుతూ ‘సహాయక బృందాల ధైర్యం, హీరోయిజం స్ఫూర్తి కలిగిస్తున్నాయి’ అని అన్నారు.
బాలురు వైద్యశాలలో చికిత్స పొందుతున్న తొలి వీడియో బయటకు వచ్చింది. ఆసుపత్రిలో వారి ఫొటోలను కూడా తొలిసారిగా మీడియాకు విడుదల చేశారు. ఇన్నాళ్లూ గుహలో ఉన్నందువల్ల వారికేమైనా ఇన్ఫెక్షన్స్ సోకి ఉంటాయోమోనన్న అనుమానంతో ముందుజాగ్రత్తగా పిల్లలను వేరుగా ఉంచారు. వారిని కలిసేందుకు తల్లిదండ్రులు సహా ఎవ్వరినీ వైద్యులు అనుమతించలేదు. గాజు అద్దాల గదుల్లో పిల్లలను ఉంచి బయట నుంచే తల్లిదండ్రులు చూసి వెళ్లిపోయేలా ఏర్పాట్లు చేశారు. అయితే తామంతా ఆరోగ్యంగానే ఉన్నామని పిల్లలు తలలూపుతూ, చేతులు ఆడిస్తూ, శాంతి చిహ్నాలను ప్రదర్శించారు. పిల్లలు మానసికంగా, శారీరకంగా ఆరోగ్యంగానే ఉన్నారని వైద్యులు స్పష్టం చేశారు. అయితే పిల్లల మానసిక ఆరోగ్యంపై ఇప్పుడే ఏమీ చెప్పలేమనీ, ఇప్పుడు బాగానే ఉన్నట్లు కనిపిస్తున్నా, దీర్ఘకాలంలో వారి ప్రవర్తనపై గుహలో చిక్కుకుపోయిన ప్రభావం ఉండొచ్చని పలువురు మానసిక వైద్యులు అంటున్నారు.
మంగళవారం చివరి బాలుడు బయటకు వచ్చిన తర్వాత.. గుహ నుంచి నీటిని బయటకు తోడే ప్రధాన పంపు మొరాయించింది. అప్పటికి సహాయక సిబ్బంది ఇంకా గుహ లోపలే, ప్రవేశ ద్వారానికి ఒకటిన్నర కిలో మీటరు దూరంలో ఉన్నారు. పంపు పనిచేయడం మానేయడంతో గుహలో నీటిమట్టం భారీగా పెరగసాగిందని ఆస్ట్రేలియా డైవర్లు వెల్లడించారు. బాలురను బయటకు తీసుకురావడానికి ముందే పంపు మొరాయించినట్లైతే ఆపరేషన్‌కు తీవ్ర ఆటంకం కలిగి ఉండేది
ప్రతికూలతలెదురైనా
ఈ రెస్క్యూ ఆపరేషన్‌లో గుహలోని ఆక్సిజన్ స్థాయి తగ్గిపోకుండా కిలోమీటర్ మేర ప్రత్యేకమైన పైపుల్ని అమర్చారు. నీటిని నిరంతరాయంగా తోడేస్తుండటంతో గుహలోని నీటి మట్టం కాస్త తగ్గడం సహాయక చర్యలకు సాయపడింది. గుహలోని ఇరుకు మార్గాలు, బురద నీటితో దారి కన్పించకపోవడం, ఈ పిల్లలకు ఈత రాకపోవడం సహాయక చర్యలకు ప్రధాన అవరోధాలుగా మారాయి. ఈ విద్యార్థుల్ని బయటకు తీసుకొచ్చేందుకు గుహ పైభాగంలో దాదాపు 400 మీటర్ల మేర 100 రంధ్రాలను తవ్వినప్పటికీ ఫలితం లేకపోయింది. దాంతో అమెరికన్, బ్రిటీష్ ప్రభుత్వాల బృందాలు కొత్త పద్ధతులతో బాధితులను సురక్షితంగా కాపాడే పనిలో విజయవంతమయ్యాయి. ఫిఫా ప్రపంచకప్ సెమీస్ విజయాన్ని ఈ బాలలకు అంకితమిస్తున్నట్లు ఫ్రాన్స్ ఫుట్బాల్స్టార్ పాల్పొగ్బా ప్రకటించారు.
మానవీయత మరుగున పడలేదు
వివిధ దేశాల్లోని ప్రభుత్వాలు, సంస్థలు, వ్యక్తులు ఈ ఉదంతంపై స్పందించిన తీరు అద్భుతమని చెప్పాలి. ఆ పసి ప్రాణాలను కాపాడాలని వరద నీటితో నిండిన గుహల్లో ఈదడానికి ప్రత్యేక శిక్షణ పొందిన మెరికల్లాంటి గజ ఈతగాళ్లు స్వచ్ఛందంగా ముందుకొచ్చారు. ప్రపంచ ప్రఖ్యాత పారిశ్రామికవేత్త, స్పేస్ ఎక్స్ ప్రాజెక్టు సృష్టికర్త ఎలాన్ మస్క్ సైతం ఆ గుహలో పనికొచ్చేలా ఒక జలంతర్గామిని తయారు చేయించుకుని వచ్చి అక్కడే ఉండిపోయాడు. అది చివరకు ఉపయోగపడకపోయినా ఆ పిల్లల క్షేమంపై ఆత్రుత ప్రదర్శించి శ్రద్ధ పెట్టిన మస్క్ తీరు మెచ్చదగ్గది.
ఈ మొత్తం ఆపరేషన్ ఎవరి ఊహలకూ అందనంత ప్రాణాంతకమైనది. సుశిక్షితుడైన థాయ్ నావికాదళ గజ ఈతగాడొకరు Navy Seal Saman Kunan మరణించడం దీనికి తార్కాణం. సర్వసాధారణంగా గుహలు మనుష్య సంచారానికి అనువుగా ఉండవు. ప్రకృతిసిద్ధమైన వింతలు, విశేషాలను చూసితీరాలన్న ఆసక్తి ఉన్నవారు సైతం ఎంతో శ్రమకోర్చేవారైతే తప్ప అలాంటిచోటుకు వెళ్లరు. సరిగ్గా ఎనిమి దేళ్లక్రితం చిలీ గనిలో 33మంది కార్మికులు చిక్కుకున్న ఉదంతంతో కూడా దీన్ని పోల్చలేం. ఎందు కంటే వారంతా నిత్యం గనికి రాకపోకలు సాగించే పనిలో ఉన్నవారే. ఎలాంటి ప్రమాదమైనా ఏర్ప డవచ్చునన్న ఎరుకతో నిరంతరం అప్రమత్తమై ఉంటారు.
కానీ ఈ ఉదంతం అలాంటిది కాదు. గుహ వెలుపలి నుంచి బాలురు చిక్కుకున్న ప్రాంతం నాలుగు కిలోమీటర్ల దూరం. పైనుంచి లెక్కేస్తే ఆ ప్రాంతం కిలోమీటరు లోతున ఉంది. అక్కడికి చేరాలంటే ఇరుకైన మార్గం తప్ప వేరే దారి లేదు. ఆ దారి కూడా కంటకప్రాయమైనది. ఎన్నో వంపులతో, ఎత్తుపల్లాలతో… వరద నీటితో, బురదతో నిండి ఉంది. కన్ను పొడుచుకున్నా కానరానంత దట్టమైన చీకటి. అలాంటి పరిస్థితుల్లో ఎంత చేయి తిరిగినవారైనా ఆ ఇరుకైన దారిలో ఒకవైపు ఈదుకెళ్లడానికి అయిదు గంటల సమయం పడుతుంది. అందుకే ఈ ఆపరేషన్ మొత్తం ఓ కంటితుడుపు చర్యే కావొచ్చునని అందరూ భావించారు. పూర్తిగా ఆశలు వదిలేసుకున్నారు.
వారిని వెలుపలికి తీసుకురావడానికి కనీసం నాలుగు నెలల సమయం పట్టొచ్చునని తొలుత నిపుణులు చెప్పినప్పుడు ఆ పిల్లలు చనిపోవడం ఖాయమనుకున్నారు. అన్ని నెలలకు సరిపడా ఆహారం, నీళ్లు అందించినా వెలుతురు కిరణాలు సోకని చోట అంత సుదీర్ఘకాలం మనోధైర్యంతో వారు మనుగడ సాధించడం కష్టమేనని అభిప్రాయపడ్డారు. గబ్బిలాలు మాత్రమే తిరిగేచోట వాటిద్వారా ప్రాణాంతక వ్యాధులు సోకే ప్రమాదమున్నదని కూడా అనుకున్నారు. నిజానికి భారీ వర్షాలు తమ ప్రతాపం చూపకపోయి ఉంటే వరదనీరు తగ్గేవరకూ వారిని అక్కడే ఉంచడం మంచిదని నిపుణులు అభిప్రాయపడేవారు.
కానీ అవి రోజురోజుకూ ఉగ్రరూపం దాల్చి వరద నీరు అంతకంతకు పెరుగుతూ పోవడంతో ఏదో ఒకటి చేసి ఆ పిల్లల్ని మృత్యు పరిష్వంగం నుంచి బయటకు తీసుకురావాల్సిందేనన్న కృత నిశ్చయానికొచ్చారు. ఈ ఉదంతంలో ఏ రంగంలోవారైనా నేర్వదగిన పాఠాలు ఎన్నో ఉన్నాయి. సంక్షోభ సమయాల్లో మానసికంగా ఎంత దృఢంగా ఉండాలో ఆ పిల్లలు ఆచరించి చూపారు. తాను అర్ధాకలితో ఉన్నా బృందంలోని పిల్లలకు లోటు రానీయకుండా చూసుకున్న పాతికేళ్ల కోచ్ ఎకపోల్ చాంతన్వాంగ్ నాయకత్వ స్థానంలో ఉన్నవారు ఎంతటి త్యాగానికి సంసిద్ధులై ఉండాలో నిరూపిం చాడు. తిండికి కొరతగా ఉన్నప్పుడు, ఆక్సిజెన్ నానాటికీ తగ్గుముఖం పడుతున్నప్పుడు మానసిక కుంగుబాటు దరి చేరకుండా అన్ని జాగ్రత్తలూ తీసుకున్నాడు. ఎందుకంటే ఏ ఒక్కరిలో వణుకు మొదలైనా అది బృందం మొత్తాన్ని ఆవరిస్తుంది. ఎవరినీ ప్రాణాలతో మిగల్చదు.
మన గురజాడ ‘ఎల్లలోకములొక్క ఇల్లై… వర్ణభేదములెల్ల కల్లై’ ఈ ప్రపంచం ఉండాలని మనసారా కాంక్షించాడు. ప్రపంచంలో ఏమూలనున్నవారు సంక్షోభంలో చిక్కుకున్నా ఆ ఆపద అందరిదీ అనుకుని ముందుకురకడమే మానవీయత అనిపించుకుంటుంది. కానీ దురదృష్టవశాత్తూ ఇటీవలికాలంలో ఆ దృక్పథం కొడిగడుతోంది. దేశాలకుండే భౌగోళిక హద్దులకు మించి మనుషుల మధ్య నిలువెత్తు అడ్డుగోడలు పుట్టుకొస్తున్నాయి. అవి నానాటికీ విస్తరిస్తున్నాయి. ‘మనవాళ్లు’ కాదని, అన్య మతస్తులని, వేరే దేశస్తులని కారణాలు చెప్పుకుని మనుషులు బండ బారిపోతున్నారు.
కళ్లముందు తోటి మనిషిని కొట్టి చంపుతున్నా గుడ్లప్పగించి చూస్తూ ఉండేవారు భారత్ లో పోతున్నారు. అలా ఉండటమే ఔన్నత్య చిహ్నమని నూరిపోసే ధూర్తులు పాపంలా పెరిగి పోతున్నారు. ఇటు వంటి నిరాశామయ క్షణాల్లో థాయ్‌లాండ్ బాలురును కాపాడిన గజఈతగాళ్లు ఈ ప్రపంచంలో మనిషితనం ఇంకా బతికే ఉన్నదన్న తీయని కబురందించారు. సంక్షుభిత సమయాల్లో ఏమూలనో మానవీయత మొగ్గ తొడుగుతుందని, దాని పరిమళాలు అన్ని అవధులూ దాటుకుని పరివ్యాప్తమవుతాయని వారు తమ అంకిత భావంతో నిరూపించారు.