మహాకవి ధూర్జటి వేడికోలు

మహాకవి ధూర్జటి శ్రీకృష్ణదేవరాయల వారి అష్ట దిగ్గజాలలో ఒకడు. ధూర్జటి తల్లిదండ్రులు సింగమ్మ. రామనారాయణ. ఈయన తాత జక్కయ నారాయణ.చిత్తూరు జిల్లాలోని శ్రీకాళహస్తిలో పుట్టి పెరిగిన దూజాతి వారు పుతుకతో వైష్ణవులైనా ఆ తర్వాత గొప్ప శివభక్తుడ య్యాడు. ఈ కవినే పెద్ద ధూర్జటి అని కూడా పిలుస్తారు. పదహారో శతాబ్దానికి చెందిన ధూర్జటి శ్రీకాళహస్తి మహత్యం, శ్రీకాళహస్తీశ్వవర శతకం రాశారు. అల్లసాని పెద్దన, నంది తిమ్మన, అయ్యలరాజు రామభద్రుడు తదితరులకు సమకాలీనుడు అయిన ధూర్జటి శ్రీకాళహస్తీశ్వర శతకాన్ని ఈ పద్యంతో ప్రారంభించారు.

శ్రీ విద్యత్కవితా జనంజన మహా జీమూత పాపాంబు ధా
రా వేగంబున మన్మనోజ్ఞ సుముదీర్ణత్వంబు గోల్పోయితిని
దేవా! మీ కరుణా శరత్సమయ మింతే చాలు, చిద్భావనా
సేవం దామరతంపరై మనియెడన్ శ్రీకాళహస్తీశ్వరా

శ్రీకాళహస్తి అనే క్షేత్రంలో వెలసిన పరమేశ్వరా! సాలీడు, పాము, ఏనుగులకు మోక్షం ప్రసాదించిన ఓ దేవా! సంపదలు అనే మెరుపుతీగలతో కూడి జనన మరణాలతో నిండిన సంసారం అనే మేఘం నుంచి కురిసే పాపం అనే వర్షపు ధారల వేగానికి నా మనస్సు అనే పద్మం వికసించడం కోల్పోయింది. ఓ కాళహస్తీశ్వరా! మీ దయను శరత్కాల సమయంలో కూడా మాలో కాస్తయినా ప్రసరింప చెయ్యి. అది చాలు. మనసులో కలిగిన భక్తిభావంతో కలిగిన నిన్ను సేవించడం తామరతంపరలా అభివృద్ధి చెంది జీవిస్తాను.

ఈ శతకంలోని ప్రతి పద్యంద్వారా ధూర్జటి శివుడిని మోక్షం కోసం ప్రార్ధిస్తాడు.