మహానందీశ్వరాలయం

Mahanandiనందీశ్వర నమస్తుభ్యం సాంబానంద ప్రదాయక:
మహా దేవస్య సేవార్థం అనుజ్ఞాం దాతు మర్హసి

ఇది నందీశ్వరుడి స్తోత్రం. నంది అనుగ్రహిస్తే అంతా ఆనందమే. అంటోంది శ్రుతి. మనమిక్కడ మహానందీశ్వరుడి గురించి తెలుసుకుందాం.

కర్నూలు జిల్లా నంద్యాల నగరానికి సమీపంలో మహానందిలో కామేశ్వరి సహిత మహనందీశ్వరుడు భక్తులకు దర్శనమిస్తుంటాడు. ఈ మహానందిని నందరాజులు నిర్మించినట్టు చరిత్ర పుటలు తెలియజేస్తున్నాయి. ఇక్కడి మూలవిరాట్టు లింగాకారంలో ఉంటుంది. ఆలయం ముందు ఓ పెద్ద నంది ఉండడం వల్ల ఈ ప్రాంతానికి మహానంది అనే పేరు వచ్చినట్టు చెప్తారు. మహానందికి చుట్టూ పదిహేను కిలోమీటర్ల వలయంలో మొత్తం తొమ్మిది నంది ఆలయాలు ఉన్నాయి. అవి, పద్మనంది. నాగనంది. వినాయకనంది. గరుడ నంది. బ్రహ్మనంది. సూర్యనంది. విష్ణునంది. సోమనంది. శివనంది. కార్తీక మాసంలో ఇక్కడ పెద్ద ఎత్తున ఉత్సవాలు చేస్తుంటారు.

పౌరాణిక గాథలోకి వెళ్తే…
పూర్వం శాలంకాయనుడు అని భక్తుడు ఉండేవాడు. అతనో విచిత్రమైన భక్తుడు. అతను రాళ్ళు తిని తపస్సు చేసి శివుడిని మెప్పించి శివభక్తుడయ్యాడు. ఇతనిని అందరూ శిలాదుడు అని పిలిచేవారు. ఇతను రోజూ పొలం దున్ని బతుకుతుండేవాడు. ఓరోజు ఇతను పొలం దున్నుతుండగా ఓ బాలుడు దొరుకుతాడు. ఆ బాలుడు ఎవడో కాదు. వృషభ రూపంలో ఉన్న ధర్ముడే ఆ బాలుడు. అతనికి శిలాదుడు నంది అని నామకరణం చేశాడు. కంటికి రెప్పలా పెంచసాగాడు. అతను కూడా పరమశివుడి సాక్షాత్కారం కోసం తపస్సు చేసాడు. ఓం నమ: శివాయ అని పంచాక్షరీ మహామంత్రాన్ని జపిస్తూ వచ్చాడు. అతని తపస్సుకు మెచ్చి పరమశివుడు ప్రత్యక్షమవుతాడు. వరం కోరుకోమంటాడు. సదాశివ ధ్యానం తనకు కలిగేలా వరం ప్రసాదించమంటాడు. శివుడు అనుగ్రహిస్తాడు. పుత్రుడిగా స్వీకరిస్తాడు. అంతేకాదు, ఎన్నో సిద్ధులు ప్రసాదిస్తాడు. తన వాహనంగా ఎల్లప్పుడూ దగ్గరే ఉంచుకోమంటాడు. అతనికి సుయశ అనే కాంతతో పెళ్ళి జరుగుతుంది. ఆమె స్వయంగా కామేశ్వరి ప్రసాదించిన సక్తిస్వరూపురాలు అని ఓ మాట ఉంది. ఈ విధంగా నందిని అనుగ్రహించిన ప్రదేశమే మహానంది క్షేత్రం అయింది. ఇది కాలక్రమంలో నందీశ్వరాలయంగా ప్రసిద్ధి చెందింది.

మహానందీశ్వర క్షేత్రం నల్లమల పర్వత పంక్తిని ఆనుకొని ఉంది. ఇక్కడి నందీశ్వర విగ్రహం నోటి నుంచి ఎప్పుడూ నీరు ధారగా వస్తూనే ఉండం ఓ విశేషం. ఈ జలధారే అక్కడి కుండంలో చేరి ప్రవహించి చుట్టుపక్కల పొలాలను సస్యశ్యామలం చేస్తుందని స్థానికుల నమ్మకం. ఈ పుణ్యక్షేత్రంలో రామాలయం, వినాయకుడి ఆలయం కూడా ఉన్నాయి.

ఇక నందీశ్వరాలయ గర్భగృహం మీది విమానం నాగశైలిలో ఉంటుంది. శిఖరం ఆకాశంలోకి చొచ్చుకుపోయినట్లుంటుంది.

ఇదొక పురాతన ఆలయం. ఈ ప్రాంతాన్ని పాలించిన ప్రతి రాజూ ఈ ఆలయాన్ని జీర్ణోద్ధరణ చేసినట్లు చరిత్ర పుటలు చెబుతున్నాయి.

గుడి చుట్టూ ప్రవహించే నీటిబుగ్గల చలువ వల్ల ఏకాంత పావనత్వం వల్ల భక్తకోటిని కాలాలకతీతంగా ఈప్రాంతం ఆకర్షిస్తుంది. అందుకే ఈ ప్రాంతాన్ని కవులు చెక్కిలి చుక్క అని వర్ణించారు.

ఈ ప్రాంతం అంతా ఔషధుల గాలి, నీటితో కలిసుంటుంది. అందుకే ఆ ఆలయ తీర్థానికి దివ్యమైన ఔషధ గుణమున్నట్టు చెప్తారు. అది సేవించిన వారికి ఏ అనారోగ్యమూ అంటదంటారు.

ఏదేమైనా ఇదొక దివ్యమైన పుణ్యక్షేత్రం. మహానంది ఇహపరాల సౌఖ్యాన్ని అందిస్తుంటాడు అనేది అక్షరసత్యం.
– యామిజాల జగదీశ్

Send a Comment

Your email address will not be published.